కరోనా దెబ్బ.. నాలుగు రాష్ట్రాల్లో మూతపడిన సినిమా హాళ్లు!
on Mar 14, 2020

కరోనా దెబ్బ అన్ని రంగాలకు మాదిరిగానే సినిమా రంగంపై గట్టిగా పడింది. ఒకవైపు విద్యార్థులకు పరీక్షలతో థియేటర్లలో కలెక్షన్లు తక్కువగా నమోదయ్యే ఈ సీజన్‌లో ఇప్పడు కరోనా వైరస్ భయం పిడుగుపాటులా తాకి, కలెక్షన్లను మరింత కుదేలయ్యేట్లు చేస్తున్నాయి. దేశంలో ఇప్పటివరకూ కరోనా మరణాలు రెండు మాత్రమే నమోదైనప్పటికీ, చనిపోయిన ఆ ఇద్దరూ వృద్ధులైనప్పటికీ కరోనా భయం సర్వత్రా వ్యాపించేసింది. ఇదివరకే రెండు రాష్ట్రాలు కేరళ, ఢిల్లీ.. సినిమా థియేటర్లను తాత్కాలికంగా మూసివేయగా శుక్రవారం నుంచి మరో రెండు రాష్ట్రాలు ఒడిశా, మహారాష్ట్ర సినిమా హాళ్లను మార్చి 31 వరకు మూసివేయాల్సిందిగా జీవోలు జారీ చేశాయి. ఇది ప్రధానంగా బాలీవుడ్ సినిమాపై పెను ప్రభావాన్ని చూపనున్నది.
ప్రస్తుతం టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన ఔట్ అండ్ ఔట్ యాక్షన్ మూవీ 'బాఘీ 3' సూపర్ హిట్ దిశగా దూసుకుపోతోంది. ఇప్పటికే ఆ మూవీని కొన్న బయ్యర్లందరూ సేఫ్ జోన్‌లోకి రాగా, లాభాలు వస్తున్న తరుణంలో థియేటర్ల మూసివేత నిర్ణయం వాళ్లకు అశనిపాతంలా మారింది. నిజానికి కరోనా వైరస్ ప్రభావంలోనూ 'బాఘీ 3' తొలివారంలో దేశంలో 90 కోట్ల రూపాయల నెట్ సాధించడం చిన్న విషయం కాదని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే కరోనా కేసులు పెరుగుతుండటం, హెడ్‌లైన్స్‌లో దానికి సంబంధించిన వార్తలను భయానకంగా చెబుతుండటంతో గురువారం ఈ సినిమా వసూళ్లు బాగా తగ్గాయి. ఇప్పుడు మహారాష్ట్ర వ్యాప్తంగా థియేటర్లు మూతపడటం వల్ల ఆ సినిమా లాభాలను కోల్పోనున్నది.
రానున్న రోజుల్లో ఈ నాలుగు రాష్ట్రాలను ఇంకెన్ని రాష్ట్రాలు అనుసరిస్తాయో తెలీదు. ఏ క్షణంలోనైనా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కూడా తాత్కాలికంగా సినిమా థియేటర్లను మూసివేస్తూ నిర్ణయం తీసుకొనే అవకాశాలు లేకపోలేదు. గత రెండు వారాలుగా పెద్ద సినిమాలేవీ విడుదల కాలేదు. ప్రస్తుతం ఆడుతున్న చిన్న సినిమాలకు కలెక్షన్లు లేవు. కరోనా ఎఫెక్ట్ వల్ల ఇప్పటికే 25 శాతం పైగా కలెక్షన్లు తగ్గాయని నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారు. ఈ నెలాఖరు నుంచి ప్రేక్షకుల్లో ఇమేజ్ ఉన్న హీరోల సినిమాలు ఒకదాని తర్వాత ఒకటిగా విడుదలకు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో వాటి రిలీజ్ డేట్లపై కూడా కరోనా ప్రభావం పడేట్లు కనిపిస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



