'చిరు' కోరిక: 2024 ఎన్నికల్లో బీజేపీ-జనసేన కూటమి గెలవాలి!
on Aug 7, 2020

భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షునిగా సోము వీర్రాజు నియమితులైన విషయం తెలిసిందే. మునుపటి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను తొలగించి, పవన్ కల్యాణ్‌కు సన్నిహితునిగా పేరుపొందిన వీర్రాజును నియమించడం బీజేపీలో చర్చకు దారి తీసింది. కాగా గురువారం మెగాస్టార్ చిరంజీవిని ఆయన నివాసానికి వెళ్లి కలిశారు వీర్రాజు. ఆయనను పుష్పగుచ్ఛంతో తన ఇంట్లోకి ఆహ్వానించి, అభినందనలు తెలిపారు చిరంజీవి. ఈ సందర్భంగా ఇద్దరూ కొద్దిసేపు భేటీ అయ్యారు.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై బీజేపీ, జనసేన కలిసికట్టుగా పోరాటం చేయాలని వీర్రాజును చిరంజీవి కోరినట్లు తెలిసింది. చిరును వీర్రాజు కలవడం వెనుక బీజేపీ హైకమాండ్ సూచన ఉన్నదనీ, ఆయనను ఎలాగైనా బీజేపీలోకి తీసుకురాగలిగితే పార్టీకి ఆంధ్రప్రదేశ్‌లో ప్రయోజనం చేకూరుతుందనీ ఆ పార్టీ భావిస్తోందంటూ ఓవైపు ప్రచారం జరుగుతుండగా, మరోవైపు ఇంకో అంశం ప్రచారంలోకి వచ్చింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రెండు పార్టీల కూటమి విజయం సాధించి, అధికారంలోకి రావాలని వీర్రాజుతో భేటీ సందర్భంగా చిరంజీవి ఆకాంక్షించారనేదే ఆ విషయం.
నిజానికి ఇద్దరూ ఏం మాట్లాడుకున్నారనేది వాళ్లకు తప్ప ఇంకెవరికీ తెలీదు. ఏదేమైనా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ, ఆ తర్వాత 2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీ-జనసేన కూటమిగా పోటీ పడనున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



