చిరు చూపు ఐష్ వైపు.. ఈసారైనా వర్కవుట్ అయ్యేనా?
on Sep 19, 2023
మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్.. తెలుగు తెరపై ఇప్పటివరకు ఒకే ఒకసారి సందడి చేసింది. అది కూడా.. ఓ ఐటమ్ సాంగ్ లో. దాదాపు 24 ఏళ్ళ క్రితం విడుదలైన ఆ సినిమానే.. 'రావోయి చందమామ'. ఇందులో కింగ్ నాగార్జునతో కాసేపు చిందులేసింది ఐష్. కట్ చేస్తే.. త్వరలో ఈ టాలెంటెడ్ బ్యూటీ మరో క్రేజీ ప్రాజెక్ట్ లో ఎంటర్టైన్ చేయనుంది. ఈ సారి స్పెషల్ సాంగ్ లో కాకుండా ఓ ముఖ్య పాత్రలో.
ఆ వివరాల్లోకి వెళితే.. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా 'బింబిసార' ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ నిర్మించనున్న ఈ భారీ బడ్జెట్ మూవీ.. సోషియో ఫాంటసీ సబ్జెక్ట్ తో తెరకెక్కనుంది. కాగా, ఈ చిత్రంలో ముగ్గురు నాయికలకు స్థానముంది. వారిలో ఒకరిగా లేడీ సూపర్ స్టార్ అనుష్క కనిపించనుండగా, సీతారామం ఫేమ్ మృణాళ్ ఠాకూర్ మరో హీరోయిన్ గా ఎంటర్టైన్ చేసింది. ఇప్పుడు ఇంకో నాయికగా ఐష్ పేరు వినిపిస్తోంది. వీరిలో ఎవరెవరు కన్ఫామ్ అవుతారో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
ఇదిలా ఉంటే, గతంలోనూ చిరుతో ఐష్ జోడీ కట్టనున్నట్లు కొన్ని సినిమాల విషయంలో ప్రచారం జరిగింది. అయితే, అవేవీ వర్కవుట్ కాలేదు. మరి.. ఈ సారైనా ఈ కాంబో సెట్ అవుతుందేమో చూడాలి.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
