ప్రస్తుతానికి మాత్రం చిరుదే పై చేయి!
on Dec 21, 2022

మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రానుంది. ఈ సందర్భంగా సంక్రాంతి కానుకగా మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య గా నందమూరి నటసింహం బాలకృష్ణ వీరసింహారెడ్డిగా తమ సత్తా చాటనున్నారు. వాల్తేర్ వీరయ్యకు బాబీ దర్శకత్వం వహిస్తుండగా వీరసింహారెడ్డికి గోపీచంద్ మలినేని దర్శకుడు. బాబి ట్రాక్ రికార్డు చూసుకుంటే ఆయన దర్శకత్వం వహించిన మొదటి చిత్రం రవితేజ పవర్. తర్వాత ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సర్దార్ గబ్బర్ సింగ్ అనే చిత్రం చేశాడు. పవర్ బాగానే ఆడిన సర్దార్ గబ్బర్ సింగ్ మాత్రం డిజాస్టర్ గా మిగిలింది. కానీ ఆ వెంటనే జూనియర్ ఎన్టీఆర్ తో జై లవకుశ తీసి, ఏకంగా ఎన్టీఆర్ ను త్రిపాత్రాభినయంతో రక్తి కట్టించాడు.
ఇంకా ఆ తర్వాత వెంకటేష్, నాగచైతన్యాలతో వెంకీ మామ తీశాడు. మొత్తానికి రవితేజ పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ వెంకటేష్ వంటి వారిని డైరెక్ట్ చేసిన అనుభవం బాబీకి ఉంది. వీటిలో సర్దార్ గబ్బర్ సింగ్ మాత్రమే డిజాస్టర్ అయ్యింది. ఇక వీరసింహారెడ్డిని డైరెక్ట్ చేస్తున్నా గోపీచంద్ మలినేని సినిమాల విషయానికి వస్తే రవితేజ డాన్ శీను తో హిట్ అనిపించుకున్నాడు. ఆ తర్వాత వెంకటేష్తో బాడీగార్డ్ చిత్రం చేస్తే అది పెద్దగా ఆడలేదు. రీమేక్‌తో కూడా మెప్పించలేకోపోయాడు. ముచ్చటగా మూడోసారి మరల మాస్ మహారాజా రవితేజ తో కలిసి బలుపు చిత్రం తీసి విజయం అందుకున్నాడు. రామ్ తో పండగ చేసుకో, సాయి ధరంతేజ్ తో విన్నర్ చిత్రాలు పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ రవితేజతో తీసిన క్రాక్ చిత్రం ద్వారా మరల హిట్ ట్రాక్ లోకి వచ్చాడు. బాబి, గోపీచంద్ మలినేని ఇద్దరు తమ కెరీర్ను మాస్ రాజా రవితేజతో ప్రారంభించడం విశేషం. అన్నట్టు వాల్తేరు వీరయ్య చిత్రం విషయానికొస్తే ఇందులో మెగాస్టార్ చిరంజీవితో పాటు మాస్ మహారాజా రవితేజ కూడా ఓ కీలక పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే.
ఇక సంగీత పరంగా తీసుకుంటే మెగాస్టార్ చిరంజీవి చిత్రాలకు సంగీతం అద్భుతంగా ఉండాల్సిందే. ఎందుకంటే ఆయన సాంగ్సే ఆయనకు చాలా పెద్ద ప్లస్. కాబట్టి హుషారు అయిన పాటలతో అభిమానులను ఉర్రూతలూగించాలి. వాల్తేరు వీరయ్యకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. దేవి శ్రీ ఈమధ్య కాస్త ట్రాక్ తప్పినట్టు కనిపిస్తున్నాడు. రౌడీ బాయ్స్, రంగ్‌దే వంటి చిత్రాలు ఆయన స్థాయికి ఏమాత్రం సరిపోనివి. కానీ సరిలేరు నీకెవ్వరు, ఉప్పెన, మహర్షి చిత్రాలతో పాటు ఇటీవల సంచలన విజయం సాధించి పాన్ ఇండియా రేంజ్ లో ఓ ఊపు ఊపేసిన పుష్పా- ది రైజ్ చిత్రానికి కూడా దేవిశ్రీ సంగీతం ఇచ్చాడు. ఈ చిత్రం ఆల్బమ్ తెలుగులోనే కాదు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పుష్ప రేంజ్‌నే కొనసాగిస్తూ వాల్తేరు వీరయ్యకు సంగీతం అందిస్తున్నాడు. ఇక తమన్ విషయానికి వస్తే సంగీత దర్శకునిగా తనకు మంచి పేరు ఉన్నప్పటికీ ఆయనపై కాపీ క్యాట్ అనే ముద్ర ఉంది. కానీ ఈమధ్య ఆయన తన సంగీతంతో సరికొత్త పాటలను అందిస్తు ఆ ముద్రను చెరిపేసుకుంటున్నాడు. ఆయన ఇటీవల సంగీతమందించిన వకీల్ సాబ్, అఖండ, అలా వైకుంఠపురంలో, భీమ్లా నాయక్, గాడ్ ఫాదర్ చిత్రాలు సంగీత పరంగా మెప్పించాయి.
అసలు విషయానికొస్తే ఈ సంక్రాంతికి పోటీ పడుతున్న చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలయ్య వీరసింహారెడ్డిలు రెండు ఒకే నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. దాంతో ఈ రెండు చిత్రాలలో ముందుగా ఆడియో బ్లాక్ బస్టర్ గా ఏది నిలుస్తుంది అనే ఉత్కంఠ ఎక్కువవుతుంది. ప్రస్తుతానికైతే మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్యదే పై చేయి అని చెప్పాలి. ముందుగా వీర సింహారెడ్డి లో జై బాలయ్య పాట విడుదల అయింది. కానీ ఆ పాట కంటే మెగాస్టార్ బాస్ పార్టీ అత్యధిక వ్యూస్ లైక్స్ అందుకుంది. ఇక సెకండ్ నెంబర్స్ విషయానికి వస్తే బాలకృష్ణ సుగుణసుందరి పాట రాగానే చిరంజీవి శ్రీదేవి పాట తో వచ్చాడు. ఈ రెండు చిత్రాల పాటలు కూడా ఒకదానితో ఒకటి పోటీ పడుతూ జనాలకు చేరువవుతున్నాయి. త్వరలోనే ఈ రెండు చిత్రాల నుంచి అద్భుతమైన మాస్ సాంగ్స్ రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. మరి అప్పుడు ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలి....!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



