నడిచి వచ్చే నక్షత్రంలా ఆయన స్వర్గద్వారాల వైపు సాగిపోయారు
on Nov 30, 2021
ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణంతో తెలుగు సినీపరిశ్రమలో విషాదం నెలకొంది. 'సిరివెన్నెల' లేరనే వార్తని సినీ పరిశ్రమ జీర్ణించుకోలేకపోతోంది. సినీ పరిశ్రమకు సిరివెన్నెల చేసిన సేవను సినీ ప్రముఖులు గుర్తుచేసుకుంటూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి తాజాగా ట్విట్టర్ వేదికగా స్పందించారు. "సిరివెన్నెల మనకిక లేదు.. సాహిత్యానికి ఇది చీకటి రోజు." "నడిచి వచ్చే నక్షత్రంలా ఆయన స్వర్గద్వారాల వైపు సాగిపోయారు. మనకి ఆయన సాహిత్యాన్ని కానుకగా ఇచ్చి వెళ్లారు." అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.
"సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఆరు రోజుల క్రితం హాస్పిటల్ లో జాయిన్ అవ్వడానికి వెళుతున్న సమయంలో నేను ఆయనతో మాట్లాడాను. మద్రాస్ లో ఒక మంచి హాస్పిటల్ ఉందని, అక్కడికి వెళదామని అన్నాను. అయితే ఆయన ఈరోజు ఇక్కడ జాయిన్ అవుతాను.. ఈ నెలాఖరులోపు వచ్చ్చేస్తాను. అప్పటికి ఉపశమనం రాకపోతే అప్పుడు అక్కడికి వెళ్దాం అన్నారు. ఆరోజు ఆయన ఎంతో ఉత్సాహంగా మాట్లాడితే ఏమి జరగదని అనుకున్నాను. కానీ అలా ఉత్సాహంగా మాట్లాడి, నెలాఖరులోపు వచ్చేస్తానని వెళ్లిన మనిషి ఇలా జీవం లేకుండా వస్తారని ఊహించలేకపోయాను." అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
"తెలుగు సినీ కళామతల్లికి ఎనలేని సేవలు అందించారు. వేటూరి తర్వాత అంత గొప్ప సాహిత్య విలువలను ఈ తరానికి అందించిన గొప్ప రచయిత సీతారామశాస్త్రి. ఆయన సాహిత్యంలో శ్రీశ్రీ గారి పదును కనపడుతుంది. సినీ పరిశ్రమలో ఆయన స్థానాన్ని మరెవరూ భర్తీ చేయలేరు. భౌతికంగా సిరివెన్నెల దూరమయ్యారు కానీ తన పాటలతో ఆయన ఇంకా బతికే ఉన్నారు. తన పాట బతికున్నంతకాలం సిరివెన్నెల బతికే ఉంటారు" అంటూ చిరంజీవి సిరివెన్నెల ప్రతిభని గుర్తుచేసుకున్నారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
