పావలా శ్యామలకు 'మా' సభ్యత్వం నిమిత్తం రూ. లక్ష అందించిన మెగాస్టార్!
on May 18, 2021
.jpg)
ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న సీనియర్ నటి పావలా శ్యామలను మెగాస్టార్ చిరంజీవి మరోసారి ఆదుకున్నారు. గతంలో శ్యామల కుమార్తె వైద్యం నిమిత్తం రూ. 2 లక్షలు ఇచ్చి ఆదుకున్న ఆయన ఈరోజు ఆమెకు మా సభ్యత్వం నిమిత్తం సభ్యత్వ రుసుము రూ. 1,01,500 (ఒక లక్షా పదిహేను వందల రూపాయలు) అందజేశారు. మెగాస్టార్ ఇచ్చిన చెక్కును శ్యామలకు మా మెంబర్స్ అయిన కరాటే కల్యాణి, సురేశ్ కొండేటి ఆమె ఇంటికి వెళ్లి అందజేశారు. ఆ చెక్కును మా ఆఫీసులో అందజేసి, త్వరలో మెంబర్‌షిప్ కార్డు అందిస్తామనీ, తద్వారా ప్రతి నెలా మా నుంచి రూ. 6 వేల పెన్షన్ వస్తుందనీ వారు తెలిపారు.
ఐదు దశాబ్దాలుగా తాను ఎన్నో సినిమాల్లో నటించినా, రంగస్థలంపై ఎన్నో నాటకాలు ప్రదర్శించి ఉత్తమ నటిగా ఎన్నో సార్లు పురస్కారాలు అందుకున్నా, ఇవాళ్టి వరకు అనామకురాలిని అని, ఇక నుంచి నటిగా గుర్తింపు లభించిందని ఆనందం వ్యక్తం చేశారు పావలా శ్యామల. "ఇదివరకు ఓసారి చిరంజీవిగారు రూ. 2 లక్షలు ఇచ్చి ఆదుకున్నారు. అప్నుడు నేను ఎంతో కష్టంలో ఉన్నాను. తీవ్ర మానసిక వేదనను అనుభవించాను. నా కుమార్తెకు టీబీ వ్యాధికి చికిత్స చేయించలేని పరిస్థితి. కాలు విరిగి తీవ్ర ఇబ్బందిలో ఉంటే.. అప్పుడు ఆ రెండు లక్షల ఆర్థిక సాయం నన్ను ఎంతో ఆదుకుంది. ఆ మేలు ఎన్నటికీ మర్చిపోలేను. అప్పుడు సినీ పరిశ్రమలో ఎవరూ సాయం చేయలేదు. కానీ నాకు మెగాస్టార్ కుమార్తె వచ్చి 2 లక్షల ఆర్థిక సాయం చేసి ఆదుకున్నారు. ఇప్పుడు మా సభ్యత్వం కోసం లక్ష రూపాయలు పంపించారు. నేను బతికినంత కాలం ఆయనకు ఋణపడి ఉంటా." అని శ్యామల కృతఙ్ఞతలు తెలిపారు.
.jpg)
అలాగే సీనియర్ దర్శకుడు శివనాగేశ్వరరావు రూ. 50 వేలు సాయం చేసినట్లు శ్యామల చెప్పారు. వివిధ దాతలు అందించిన 41 వేల రూపాయలను కరాటే కల్యాణి ఇచ్చినట్లు శ్యామల తెలిపారు. న్యూరో సిటీ సెంటర్ వైద్య నిపుణుని కూడా ఇంటికి తీసుకొచ్చి తమ కుమార్తె వైద్యం నిమిత్తం మాట్లాడించారని శ్యామల చెప్పారు. అవసరమైన వివిధ వస్తువులు అందించిన కళ్యాణికి, సురేష్‌కు ఆమె కృతఙ్ఞతలు తెలిపారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



