కళామతల్లి కీర్తికిరీటంలో కలికితురాయి..సినారె
on Jun 12, 2017

ప్రముఖ తెలుగు కవి, సాహితీవేత్త, చలనచిత్ర గేయ రచయిత, రాజా-లక్ష్మీ, జ్ఞానపీఠ్, కళాప్రపూర్ణ (డాక్టర్), పద్మశ్రీ, పద్మభూషణ్ లాంటి ఎన్నో అత్యున్నత పురస్కారాల గ్రహీత, మాజీ రాజ్యసభ సభ్యుడు.. 'సి నా రె' గా ప్రసిద్ధి చెందిన 'సింగిరెడ్డి నారాయణ రెడ్డి' కళామతల్లి ఒడిలో నుండీ ఆవిడ కీర్తికిరీటంలో మరో కలికితురాయిలా శాశ్వత విశ్రాంతి కోసం వెళ్ళిపోయారు, భౌతికంగా మన మధ్యలేరు అన్న వార్త వినగానే తెలుగు చలనచిత్ర పరిశ్రమతోపాటు, ఆయన సాహిత్యం విని, చదివి పరవశించిన వాళ్ళందరూ ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు.
ఆయన సినీ జీవితం స్వర్గీయ 'ఎన్. టి. ఆర్.' గారి సువర్ణ హస్తాలతో, ఆ మహనీయుని అచంచలమైన ప్రోత్సాహంతో 1962 సంవత్సరంలో 'ఎన్. టి. ఆర్.' గారు స్వీయ నిర్మాణంలో నటించి, దర్శకత్వం వహించిన 'గులేబకావళి కథ' చిత్రంలోని 'నన్ను దోచుకుందువటే వన్నెల దొరసానీ' అనే పాటతో ప్రారంభమయ్యింది. ఆ తరం సినీరచయితగా పరిచయమై దాదాపు మూడుతరాలకు పైగా సాగిన ఆయన సినీ ప్రస్థానం నేటి వరకూ దాదాపు 3500 పైగా గేయాలతో ముగిసి, తన సమకాలికులలో ఆఖరి గేయ రచయితగా భువి నుండీ దివికి పయనమై వారందరి సరసన చేరుకున్నారు.
'సీతయ్య' (ఎవ్వరి మాటా వినడు) సినిమాలోని 'ఎవరి మాటా వినడు సీతయ్య', 'ఇదిగో రాయలసీమగడ్డ, దీని కధ తెలుసుకో తెలుగుబిడ్డా', 'రావయ్యా, రావయ్యా రామసక్కనీ సీతయ్య' పాటలను ఆయన రాసినప్పుడు, ఆయనతో దర్శక, నిర్మాతగా పనిచేసే భాగ్యం నాకూ దక్కింది. ప్రత్యేకంగా 'సీతయ్య' చిత్రంలోని 'ఇదిగో రాయలసీమగడ్డ, దీని కధ తెలుసుకో తెలుగుబిడ్డా' అనే పాటకు 2003 సంవత్సరపు 'నంది' పురస్కారాన్ని అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఆయన అందుకోవటం నాకూ, మా 'బొమ్మరిల్లు వారి' సంస్థకు మరో గర్వకారణం.
29, జూలై 1931 సంవత్సరంలో ఒకప్పటి 'కరీంనగర్' జిల్లా (ఇప్పుడు 'రాజాన్న సిర్‌సిల్ల' జిల్లా) లోని 'హనుమాజి పేట్' లో జన్మించి, తన 'తెలుగు', 'ఉర్దూ' కవితలతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 'తెలుగు', 'ఉర్దూ' వారిని రంజింపజేసిన.. మహాకవి 'సి నా రె' గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడ్ని ప్రార్ధిస్తూ, ఆయన కుటుంబసభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటున్నాను.
ఇట్లు
వై వి ఎస్ చౌదరి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



