బిగ్‌బాస్ కౌశల్ మెచ్చిన 'అచీవర్'
on Nov 17, 2022

ప్రస్తుత తరంలో కమర్షియల్ సినిమాలతో పాటు సందేశాత్మకమైన చిన్నపిల్లల సినిమాలు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవల్మెంట్ అథారిటీ చైర్మెన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త అన్నారు. నవంబర్ 14 చిల్డ్రన్స్ డేను పురస్కరించుకొని యువ దర్శకుడు తల్లాడ సాయికృష్ణ రూపొందించిన 'అచీవర్' సినిమాను ప్రసాద్ ల్యాబ్స్ వేదికగా ప్రివ్యూ షో ప్రదర్శించారు. ఈ చిత్ర ప్రదర్శనకు బిగ్ బాస్ ఫేం కౌశల్, సీనియర్ దర్శకుడు రేలంగి నరసింహారావు, ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ తదితరులు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ.. అచీవర్ చిత్రం విద్యార్థుల్లో విఙ్ఞాన సర్వస్వాన్ని, ధైర్యసాహాసాను పెంపొందించేదిగా ఉందని అన్నారు. ఇలాంటి సినిమాను తీసిన తల్లాడ సాయిక్రిష్ణ ఇప్పటికే రాష్ట్ర, కేంద్ర అవార్డులను అందుకున్నాడని, ఈ సినిమాతో జాతీయ స్థాయి అవార్డు అందుకోవాలని అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున కూడా ప్రత్యేకంగా ఈ సినిమాను ప్రదర్శించే ప్రయత్నం చేస్తానన్నారు.
బిగ్ బాస్ కౌశల్ మాట్లాడుతూ.. చిన్న పిల్లలతో సినిమా తీయడం చాలా కష్టమైన పని అని, అందులో ఉండే సమస్యలు తనకు బాగా తెలుసని అన్నారు. ప్రత్యేకంగా చిన్నారుల కోసమే ఇలాంటి మంచి సినిమా తీయడం పరిశ్రమకు మంచి పరిణామమని ఆనందాన్ని వ్యక్తం చేశారు. తాను కూడా చైల్డ్ ఆర్టిస్టుగా చేశానని, తన నటనకు నేషనల్ అవార్డు సైతం అందుకున్నానని అన్నారు. అచీవర్‌లో నటించిన చిన్నారులు కపిల్, చాణక్య, విశ్వతేజలు అద్భుతంగా నటించారని, సినిమాలో నువ్వే ఒక సైన్యం అనే పాట సినిమా స్థాయిని మరింత పెంచిందని అన్నారు. చిన్నప్పుటి నుంచే ఇలాంటి మంచి సినిమాలతో చిన్నారుల్లోని ఆలోచనా విధానాన్ని మార్చగలమని అన్నారు.
ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ., అతి తక్కువ సమయంలో, దసరా సెలవుల్లోనే షూటింగ్ పూర్తి చేసి, చిల్డ్రన్స్ డేకు విడుదల చేయాలంటే దర్శకుడికి సినిమా పైన మంచి పట్టు ఉండాలని, ఈ విషయంలో తల్లాడ సాయి సమర్థుడని అన్నారు. సినిమాల్లో చిన్న సినిమా, పెద్ద సినిమాలంటూ ఉండవని, విడుదలైన తరువాతే అది ఏ సినిమా అని నిర్ణయిస్తుందని అన్నారు. తన శిష్యుడిగా తల్లాడ సాయి సినిమా రంగంలో ఉన్నత స్థాయికి ఎదగాలని అభినందించారు.
ప్రముఖ దర్శకులు రేలంగి నరసింహారావు మాట్లాడుతూ., ఎంచుకున్న సినిమా కథ చాలా బాగుందని, చిన్నారుల యాక్టింగ్‌కు వంద మార్కులు పడతాయని అన్నారు. దర్శక దిగ్గజం దాసరి నారాయణ రావు దగ్గర ఎన్నో మెలుకువలు నేర్చుకున్నానని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ చిత్ర దర్శకున్ని చూస్తుంటే అప్పటి అనుభవాలు గుర్తుకువస్తున్నాయని అన్నారు.
చిత్ర దర్శకుడు తల్లాడ సాయిక్రిష్ణ మాట్లాడుతూ., ఇప్పటి వరకు వివిధ జోనర్స్‌లో సినిమాలు రూపొందించాను, నిర్మించాను. అందుకే విభిన్నంగా ఈ సారి చిన్నారుల సినిమాతో మీ ముందుకు వచ్చాను. మంచి సినిమాలు తీయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాను. నా ప్రయాణంలో నా టీం కీలక పాత్ర పోషించింది. తక్కువ సమయంలో సినిమా తీయాలంటే టీమ్ కృషి తప్పనిసరి. దీని వల్ల నిర్మాతలకు కూడా మేలు చేస్తుందని అన్నారు. తన అధ్వర్యంలో త్వరలో వరుసగా మరో మూడు సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయని, ప్రస్తుతం సెట్స్ పైన ఉన్నాయన్నారు. త్వరలో ఓటీటీ వేదికగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నామని అన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



