ENGLISH | TELUGU  

‘భోళా శంకర్’ మూవీ రివ్యూ:  మళ్ళీ బోల్తా పడ్డ మెహర్!

on Aug 11, 2023

సినిమా పేరు: భోళా శంకర్
తారాగణం: చిరంజీవి, తమన్నా, కీర్తి సురేశ్, సుశాంత్, తరుణ్ అరోరా, బ్రహ్మానందం, మురళీ శర్మ, సాయాజీ షిండే,  బ్రహ్మాజీ, ఉత్తేజ్, శ్రీముఖి, రష్మీ గౌతమ్, గెటప్ శ్రీను, హైపర్ ఆది, వెన్నెల కిశోర్, పి. రవిశంకర్, తులసి, సురేఖా వాణి, రఘుబాబు తదితరులు  
సంగీతం: మహతి స్వర సాగర్
సినిమాటోగ్రాఫర్: డూడ్లే
ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేశ్
కథనం, మాటలు, మార్పులు, దర్శకత్వం : మెహర్ రమేశ్
నిర్మాత: రామబ్రహ్మం సుంకర
బ్యానర్: ఏకే ఎంటర్టైన్మెంట్స్
విడుదల తేదీ: ఆగస్టు 11, 2023 
చిత్ర నిడివి: 159 నిమిషాలు (2 గంటల 39 నిమిషాలు)

'వాల్తేరు వీరయ్య' వంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన చిత్రం 'భోళా శంకర్'. తమిళ సినిమా 'వేదాళమ్' (2015) ఆధారంగా మెహర్ రమేశ్ రూపొందించిన ఈ మూవీ.. శుక్రవారం (ఆగస్టు 11) జనం ముందుకొచ్చింది. గత కొంతకాలంగా సరైన సక్సెస్ లేని మెహర్ రమేశ్ ఈ చిత్రంతో సాలిడ్ హిట్ కొట్టాడా? చిరంజీవి ఖాతాలో మరో రీమేక్ హిట్ జమ అయిందా? తెలుసుకునేముందు రివ్యూలోకి వెళదాం.

కథ:
ఓపెన్ చేస్తే.. కోల్ కతా నగరం. అక్కడి అమ్మాయిలు అక్రమ రవాణాకి గురవుతుంటారు. దీంతో.. తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయిస్తారు. సినిమా పోస్టర్ల కంటే కూడా ఆడపిల్లల మిస్సింగ్ పోస్టర్స్ ఎక్కువగా కనిపిస్తున్న ఆ తరుణంలో.. చెల్లెలు మహాలక్ష్మి (కీర్తి సురేశ్)తో కలిసి కోల్ కతా వస్తాడు శంకర్ (చిరంజీవి). జీవనోపాధి కోసం టాక్సీ డ్రైవర్ అవతారమెత్తుతాడు. తన టాక్సీలోనే వేర్వేరు సందర్భాల్లో తోబుట్టువులైన లాయర్ లాస్య (తమన్నా), ఫైలట్ శ్రీకర్ (సుశాంత్) పరిచయమవుతారు. శంకర్ కారణంగా లాస్య కోర్టులో అభాసుపాలు అవుతుంది. దీంతో.. శంకర్ పై రివెంజ్ పెంచుకుంటుంది. మరోవైపు.. శంకర్ ట్యాక్సీలో ఉన్నప్పుడే తొలి చూపులోనే మహాలక్ష్మి ని ప్రేమిస్తాడు శ్రీకర్. ఇలా.. రెండు కుటుంబాల అన్నాచెల్లెళ్ళ కథలు వేర్వేరు ట్రాకుల్లో నడుస్తుంటాయి. మరోవైపు.. పోలీసులు హ్యూమాన్ ట్రాఫికింగ్ విషయంలో టాక్సీ డ్రైవర్ల సహకారం కోరుతారు. ఈ విషయంలో శంకర్ ముందుకొస్తాడు. ఈ క్రమంలోనే.. అక్రమ రవాణా ప్రధాన సూత్రధారి అయిన అలెక్స్ (తరుణ్ అరోరా) తమ్ముళ్ళను చంపేస్తాడు శంకర్. తన కళ్ళముందే శంకర్ ఒకరిని హత్య చేయడం చూసి షాకవుతుంది లాస్య. అసలు శంకర్ ఈ హత్యలు చేయడం వెనుక కారణం ఏమిటి?  శంకర్, మహాలక్ష్మి గతం ఏంటి? చివరకి వీరి కథ ఏ తీరాలకు చేరిందన్నది మిగిలిన సినిమా. 

విశ్లేషణ:
'వేదాళమ్' సినిమా విడుదలైన సమయంలో.. తమిళ వెర్షన్ చూసిన చాలామంది తెలుగుజనాలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'ఊసరవెల్లి' మూవీని గుర్తుకుచేసుకున్నారు. 'ఊసరవెల్లి'లో నాయిక పాత్రధారి కుటుంబాన్ని కోల్పోయి గతం మరిచిపోవడం, ఆమె పగని కాస్త హీరో తీర్చడం థీమ్ అయితే.. 'వేదాళమ్' లో హీరోకి చెల్లెలు కాని చెల్లెలు కూడా తన కుటుంబాన్ని కోల్పోయి గతం మరిచిపోవడం, ఆమె కోసం మరికొంతమంది అమ్మాయిల క్షేమం కోసం కథానాయకుడు విలన్స్ ని టార్గెట్ చేయడం అన్నది థీమ్. డివైడ్ టాక్ తో పాటు తమిళనాట వరదలు వంటి ప్రతికూల అంశాల మధ్య విడుదలైనప్పటికీ అజిత్ ఇమేజ్, స్టార్ డమ్ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ 'వేదాళమ్'కి ప్రధాన బలాలుగా నిలిచి ఆ చిత్రాన్ని హిట్ మూవీగా నిలిపాయి. దీంతో.. అప్పట్నుంచే మనవాళ్ళు రీమేక్ పై కన్నేశారు. కాస్త ఆలస్యంగానైనా చిరంజీవితో ఈ రీమేక్ ని సెట్ చేశారు మెహర్ రమేశ్. స్ట్రయిట్ పిక్చర్స్ విషయంలో బోల్తా పడ్డప్పటికీ.. రీమేక్స్ విషయంలో మెహర్ కి మంచి ట్రాక్ రికార్డే ఉంది. అదే.. 'శక్తి', 'షాడో' వంటి డిజాస్టర్స్ తరువాత వచ్చినా 'భోళా శంకర్'పై ఆశలు కోల్పోకుండా చేసింది. మెహర్ కూడా తన వంతుగా మన తెలుగు నేటివిటికి, చిరు ఇమేజ్ కి తగ్గట్టుగా సినిమాని మలిచే ప్రయత్నం చేశారు. మరీముఖ్యంగా.. వినోదం డోసు పెంచే వైపుగా కొన్ని మార్పులు చేశారు. ఈ క్రమంలో 'ఖుషి' నడుమ్ సీన్ తో పాటు మరికొన్ని పవన్ కళ్యాణ్ ఎలిమెంట్స్ తోడు చేశారు. అవన్నీ తెరపై మెగాభిమానులను ఎంటర్టైన్ చేసేవే. కీర్తి సురేశ్ లాంటి నటి తోడవడంతో సిస్టర్ సెంటిమెంట్ సీన్స్ బాగానే వర్కవుట్ అయ్యాయి. అందుకే ఫస్టాఫ్   కంటే సెకండాఫ్ కాస్త బెటర్ అనిపిస్తుంది కూడా. అయితే కథనం మీద మెహర్ మరింత దృష్టి పెట్టిఉంటే మెరుగైన రిజల్ట్ వచ్చే అవకాశం ఉండేది. ఏదేమైనా.. ఓటీటీ కాలంలో రీమేక్ సినిమాలు చేయడం అన్నది ఓ రకంగా సాహసమే. చిరంజీవి లాంటి స్టార్ ఉండడం కమర్షియల్ గా ప్లస్సే కావచ్చు కానీ.. ప్రేక్షకులు తెరపైనే ధ్యాస పెట్టే స్థాయిలో మరింత కృషి తోడు కావల్సి ఉంది. తనకు మంచి వనరులున్నప్పటికీ వాటిని పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోయారు మెహర్. దీంతో.. మెగా ఫ్యాన్స్ ని ఓ మేరకు, సగటు ప్రేక్షకులను నిరాశకు గురిచేసినట్లయ్యింది.

నటీనటుల పనితీరు:
మెగాస్టార్ చిరంజీవి ఎప్పటిలానే పాత్రలో ఒదిగిపోయారు. 67 ఏళ్ళ వయసులోనూ పాటల్లోనూ, పోరాటాల్లోనూ హుషారుగా సాగిపోయారు. సెంటిమెంట్ సీన్స్ లోనూ, కామెడీ సీన్స్ లోనూ మరోమారు తనదైన ముద్రవేశారు. అయితే మొదట్లో ప్రచారం చేసినట్లుగా 'గుండు' లుక్ తో మాత్రం ఎక్కడా కనిపించలేదు. బహుశా అజిత్ తో అనవసర పోలికలు ఎందుకులే అనుకున్నారేమో. ఇక మహాలక్ష్మి పాత్రలో కీర్తి సురేశ్ రాణించింది. రెండు ఛాయలున్న ఈ వేషంలో కీర్తి జీవించేసిందనే చెప్పాలి. అలాగే లాస్య పాత్రలో కనిపించిన తమన్నాకి కీర్తి కంటే స్క్రీన్ ప్రెజెన్స్ తక్కువే. ఇంటర్వెల్ ఎపిసోడ్ లో ఆమె హావభావాలు బాగున్నాయి. అయితే, చాలా చోట్ల బాగా ఏజ్డ్ గా కనిపించింది. సుశాంత్ ది ఒక రకంగా ప్రత్యేక పాత్రే. ఉన్నంతలో మెప్పించాడు. ఇక మెయిన్ విలన్ గా తరుణ్ అరోరా, సెకండ్ విలన్ గా షావర్ అలీ పరిధి మేర ఓకే అనిపించారు. రష్మి, శ్రీముఖి చిన్న వేషాల్లో దర్శనమిచ్చినా.. గ్లామర్ తో మెరిశారు. బంశీ అలియాస్ వంశీ పాత్రలో వెన్నెల కిశోర్ కామెడీ ట్రాక్ అక్కడక్కడా నవ్వులు పంచింది.  సాయాజీ షిండే, మురళీ శర్మ, బ్రహ్మాజీ, ఉత్తేజ్, హైపర్ ఆది, గెటప్ శ్రీను, తులసి తదితరులు ఆకట్టుకున్నారు.

సాంకేతిక నిపుణుల పనితీరు:
సాంకేతికంగా సినిమా ఫర్లేదనిపించింది. మహతి స్వర సాగర్ పాటల్లో "జామ్ జామ్ జజ్జనక", "భోళా మానియా" తెరపై కనువిందు చేశాయి. నేపథ్య సంగీతం కొన్ని చోట్ల బాగున్నా.. అక్కడక్కడా శ్రుతి మించినట్లపించింది. డూడ్లే విజువల్స్ బాగున్నాయి. ప్రధమార్థంలో కోల్ కతా, ద్వితీయార్ధంలో హైదరాబాద్ అందాలను అతని కెమెరా కన్ను చక్కగా ఆవిష్కరించింది. ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేశ్ తన కత్తెరకి మరింత పదును పెట్టాల్సింది. ఏకే ఎంటర్ట్మైన్మెంట్స్ వారి నిర్మాణ విలువలు బాగున్నాయి.

తెలుగువన్ పర్‌స్పెక్టివ్: 
రీమేక్ లకు బ్యాడ్ టైమ్ నడుస్తున్న ప్రస్తుత తరుణంలో 'భోళా శంకర్'గా చిరు చేసిన ఈ ప్రయత్నం.. మెగాభిమానులకు ఓకే అనిపించినా, కామన్ ఆడియన్స్ కి అంతగా కనెక్ట్ కాకపోవచ్చు. తనకు దక్కిన ఈ మెగా ఛాన్స్ ని మెహర్ రమేశ్ ఇంకా బాగా వినియోగించుకుని ఉంటే.. సాలిడ్ సక్సెస్ తనకి క్రెడిట్ అయిఉండేదే. ఏదేమైనా..  'భళా' అనిపించాల్సిన 'భోళా శంకర్'ని కాస్త  బాక్సాఫీస్ ముంగిట 'బోల్తా శంకర్'గా మలిచేసాడు మెహర్. వారాంతంతో పాటు పంద్రాగస్టు సెలవు దినాన్ని వినియోగించుకోగలిగితే 'భోళా శంకర్' ఎంతో కొంత సేఫ్ కావచ్చు.. లేదంటే కష్టమే.

రేటింగ్: 2.25/5 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.