'భీమ్లా నాయక్' ట్రైలర్ చెప్తోన్న బీభత్సమైన విషయాలివే!
on Feb 21, 2022
.webp)
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'భీమ్లా నాయక్' ట్రైలర్ వచ్చేసింది. నిజానికి ఈ ట్రైలర్‌ను ఈరోజు జరిగే ప్రి రిలీజ్ ఈవెంట్‌లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంతో, ఆయన గౌరవార్థం ఈవెంట్‌ను కాన్సిల్ చేశారు. ముందుగా నిర్ణయించిన దాని ప్రకారం రాత్రి 8 గంటల 10 నిమిషాలకు కాకుండా 9 గంటలకు ట్రైలర్‌ను యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు మేకర్స్. దీంతో ఫ్యాన్స్ తీవ్ర అసహనానికి గురయ్యారు. ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీపై విపరీతంగా ట్రోల్స్ చేశారు. ఈరోజు ట్రైలర్ రిలీజవుతుందనంగా రెండు రోజుల ముందు నుంచే #BheemlaNayakTrailerStorm అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండింగ్‌లోకి తెచ్చిన ఫ్యాన్స్.. చెప్పిన టైమ్‌కు ట్రైలర్ రాకపోవడం, సరిగ్గా 8 గంటల 10 నిమిషాలకు ట్రైలర్ 9 గంటలకు వస్తుందని ప్రొడ్యూసర్ ప్రకటించడంతో ఆగ్రహానికి లోనయ్యారు.
ఏదేమైతేనేం.. 9 గంటలకు 'భీమ్లా నాయక్' ట్రైలర్ రూపంలో వచ్చేశాడు. వచ్చీ రావడంతోటే బీభత్సం సృష్టించేశాడు. "ఒక వైల్డ్ యానిమల్‌కు కళ్లెం వేసినట్లు ఒక ఎక్స్‌ట్రీమిస్ట్‌కు పోలీస్ యూనిఫామ్ వేసి, వాడ్ని కంట్రోల్‌లో పెట్టాం. నువ్వు ఆ యూనిఫామ్ తీసేశావ్" అంటూ రానాతో పోలీస్ ఆఫీసర్ వేషంలోని మురళీశర్మ చెప్పిన డైలాగ్ చాలు.. భీమ్లా నాయక్ క్యారెక్టరైజేషన్ ఎలాంటిదో చెప్పడానికి. భీమ్లా నాయక్ ఒక వైల్డ్ యానిమల్ లాంటోడనీ, ఒక ఎక్స్‌ట్రీమిస్ట్ అనీ ఆ డైలాగ్‌తో అర్థమైపోతోంది. అలాంటి వైల్డ్ యానిమల్ లాంటోడిని కెలికితే ఏమవుతుందో రానా పోషించిన డానియల్ శేఖర్ క్యారెక్టర్‌కు బాగా తెలిసొస్తుందని ట్రైలర్ చెప్తోంది.

భీమ్లా నాయక్‌తో పాటు సినిమాలోని ప్రధాన క్యారెక్టర్లన్నింటినీ ఈ ట్రైలర్‌లో చూపించారు. భీమ్లాకు తగ్గదే ఆయన భార్య కూడా. "ఏం నాయక్ నువ్వు పేల్చినప్పుడు ఆడు లోపల్లేడా.. చూసుకోవాలి కదా" అని భీమ్లాతో అంటూ అతని పక్కన కూర్చున్న ఆమెను చూసి, అక్కడే ఉన్న మురళీశర్మ ఒక్కసారిగా షాకైపోయి, "గొప్పదానివి దొరికావమ్మా" అనడం చూస్తుంటే ఆమె క్యారెక్టరైజేషన్ ఎలాంటిదో తెలిసిపోతోంది. ఆ క్యారెక్టర్‌ను నిత్యా మీనన్ చేసింది. ఆ భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని చూపే మంచి మంచి సీన్లు కూడా సినిమాలో ఉన్నాయని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు.
ఇగో ప్రాబ్లెమ్‌తో భీమ్లా నాయక్, డానియల్ శేఖర్ ఒకరినొకరు ఢీకొని, ఎదుటివాళ్లపై తమదే పైచేయి సాధించాలని పట్టుదలతో ట్రై చేసేసరికి అది చిలికి చిలికి గాలివానగా మారి, ఇద్దరి మధ్యా పెద్ద యుద్ధానికే దారితీస్తుంది. దాని వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురైనా ఫేస్ చేయడానికే ఇద్దరూ మొగ్గుచూపుతారు. వారి మధ్య భీకరమైన వార్‌తో వారి కుటుంబాలతో పాటు చుట్టూ వున్నవాళ్లు కూడా ఎఫెక్ట్ అవుతారని ట్రైలర్‌ని బట్టి మనం ఊహించొచ్చు. డానియల్ శేఖర్ తండ్రిగా తమిళ స్టార్ యాక్టర్ సముద్రకని కనిపించాడు.
త్రివిక్రమ్ డైలాగ్స్, స్క్రీన్‌ప్లే, తమన్ మ్యూజిక్ 'భీమ్లా నాయక్' మూవీకి మెయిన్ హైలైట్స్ కానున్నాయని బల్లగుద్ది మరీ చెప్పేయొచ్చు. రెండున్నర నిమిషాల ట్రైలర్‌లోనే పవన్ కల్యాణ్ నటన ఎలా ఉండబోతోందో, ఆవేశపరుడైన పోలీస్‌గా ఆయన విశ్వరూపం ఎలా ఉంటుందో మనకు అర్థమైపోతోంది. ఆయనను ఢీకొట్టే డానియల్ శేఖర్‌గా రానా కూడా పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో కనిపించనున్నాడనేది స్పష్టం.
బిజు మీనన్, పృథ్వీరాజ్ సుకుమారన్ లీడ్ రోల్స్ చేయగా, సూపర్‌హిట్టయిన మలయాళం మూవీ 'అయ్యప్పనుమ్ కోషియుమ్'కు రీమేక్‌గా భీమ్లా నాయక్‌ను తీసిన విషయం మనకు తెలుసు. ఒరిజినల్‌లో బిజూ మీనన్ చేసిన పోలీస్ ఇన్‌స్పెక్టర్ రోల్‌ను తెలుగు వెర్షన్‌లో పవన్ కల్యాణ్ చేయగా, పృథ్వీరాజ్ చేసిన క్యారెక్టర్‌ను రానా దగ్గుబాటి చేశాడు. సాగర్ కె. చంద్ర డైరెక్ట్ చేసిన 'భీమ్లా నాయక్' మూవీలో రానా వైఫ్‌గా మలయాళం నటి సంయుక్తా మీనన్ చేసింది.

తమన్ సంగీతం సమకూర్చగా ఇప్పటివరకు రిలీజ్ చేసిన పాటలన్నీ సూపర్ పాపులర్ అవడమే కాకుండా, 'భీమ్లా నాయక్'పై అంచనాలు ఆకాశాన్ని అందుకోవడానికి కారణమయ్యాయి. అలాగే ఇదివరకు రిలీజ్ చేసిన క్యారెక్టర్ టీజర్స్‌లో టైటిల్ రోల్‌లో పవన్ లుక్స్, ఆయన డైలాగ్స్ ఫ్యాన్స్‌నే కాకుండా ఆడియెన్స్‌ను అమితంగా అలరించాయి. రానా లుక్స్, డైలాగ్స్‌కు కూడా ప్రశంసలు లభించాయి. విడుదల తేదీ విషయంలో కొద్ది రోజుల క్రితం సందిగ్ధత నెలకొన్నప్పటికీ, ఫిబ్రవరి 25న వస్తున్నామని నిర్మాతలు ప్రకటించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అడ్డుకట్టలు లేకుండాపోయాయి. పవన్ కల్యాణ్, రానా క్యారెక్టరైజేషన్స్ మెయిన్ అట్రాక్షన్‌గా వస్తోన్న 'భీమ్లా నాయక్' బాక్సాఫీస్ దగ్గర బీభత్సం సృష్టించి, వసూళ్లపరంగా సంచలనాలు సృష్టించడం ఖాయమని అభిమానులు బల్లగుద్ది మరీ చెప్తున్నారు. వారి ఆశల్ని టైటిల్ రోల్‌లో పవన్ కల్యాణ్ ఏ రేంజ్‌లో నిజం చేస్తారో.. వెయిట్ అండ్ సీ.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



