బ్లాక్‌బస్టర్ సాంగ్ 'నీలినీలి ఆకాశం' వెనకున్న స్టోరీ ఏంటి?
on Feb 17, 2020

కొద్ది రోజులుగా ఒక చిన్న సినిమా పాట సంగీత ప్రపంచంలో సంచలనం సృష్టిస్తోంది. అది.. టీవీ యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా పరిచయమవుతున్న '30 రోజుల్లో ప్రేమించటం ఎలా' మూవీలోని 'నీలినీలి ఆకాశం' పాట. జనవరి 31న రిలీజ్ చేసిన ఆ పాట యూట్యూబ్‌లో ఇప్పటికి 25 మిలియన్ వ్యూస్ దాటి బ్లాక్‌బస్టర్ హిట్టయింది. ఇటీవలి కాలంలో ఒక చిన్న సినిమా పాట ఈ రేంజ్ హిట్టయ్వడం ఇదే. కొన్ని టాప్ స్టార్స్ సినిమాల పాటలు కూడా ఈ స్థాయిలో పాపులర్ కాలేదు. అనూప్ రూబెన్స్ స్వరాలు కూర్చిన ఈ పాటను చంద్రబోస్ రాయగా, సింగింగ్ సెన్సేషన్ సిద్ శ్రీరామ్, సునీత ఆలపించారు. హీరో హీరోయిన్లు ప్రదీప్, అమృతా అయ్యర్‌పై దాన్ని చిత్రీకరించారు. అసలు ఈ పాట వెనకున్న కథేమిటి తెలుగుఒన్'తో మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ పంచుకున్న ఆ కథేమిటో చూద్దాం...
"ఈ సినిమాకు సంబంధించి నేను ఫస్ట్ ట్యూన్స్ ఇచ్చిన సాంగ్ 'నీలినీలి ఆకాశం'. డైరెక్టర్ మున్నా సందర్భం చెప్పగానే దాన్నుంచే ట్యూన్స్ కంపోజింగ్ స్టార్ట్ చేద్దామనిపించింది. ఆ ట్యూన్స్ కట్టి వినిపించగానే మున్నా, హీరో ప్రదీప్ పెద్ద సాంగ్ అవుతుందని అన్నారు. మొదట 'నీలినీలి ఆకాశం నీకే ఇస్తాలే' అంటూ ఒక రఫ్ లిరిక్ పెట్టి ఒక రోజులో ట్యూన్స్ కట్టినా. అప్పటికి చంద్రబోస్ గారు ఇంకా ఎంటర్ అవలేదు. అంటే ట్యూన్‌లోంచే 'నీలినీలి ఆకాశం నీకే ఇస్తాలే' పదాలు వచ్చాయి. చాలా పాటలు నేను అట్లాగే ఇస్తుంటా. ఆ లైన్ తీసుకొని చంద్రబోస్ గారు మిగతా పాటంతా అల్లేశారు. ఆయనకు కూడా ఈ ట్యూన్స్ బాగా నచ్చాయి. చాలా ఇంట్రెస్ట్ తీసుకొని ఆ సాంగ్ రాశారు. మొదట ఒక వెర్షన్ రాశారు. అది మాకు నచ్చింది. కానీ ఆయనకే ఇంకా బాగా రాయాలనిపించింది. దాంతో పల్లవి ఇంకో వెర్షన్ రాశారు. అందరికీ అది ఎగ్జైటింగ్‌గా అనిపించి, ఆ రెండో వెర్షన్ పెట్టేశాం. అలా ఆయన మొత్తం మూడు రోజులు తీసుకొని పాట రాశారు. మ్యూజిక్ డైరెక్టర్‌గా నాకు, లిరిక్ రైటర్‌గా ఆయనకూ ఈ పాట ఎంతో పేరు తీసుకొచ్చింది. ఈ సినిమాలో పెద్ద స్టార్స్ లేరు. సాంగే క్యారీ చేసింది. సిద్ శ్రీరామ్, సునీత గారు కూడా చాలా బాగా పాడారు. ఇంతవరకు ఈ జానర్ రూరల్ స్టైల్ సాంగ్ పాడలేదని సిద్ శ్రీరామ్ చెప్పాడు. అతని ఉచ్ఛారణ విషయంలో నేను చాలా శ్రద్ధ తీసుకున్నా. అందువల్ల ఒక అచ్చ తెలుగు గాయకుడు పాడితే ఎలా ఉంటుందో అంత స్పష్టంగా తెలుగు పదాలను అతని నోటివెంట పలికాయి. ఈ పాట ఇంత హిట్టయ్యిందంటే మొదటి కారణం డైరెక్టర్ ఇచ్చిన సందర్భమే. అది ఇన్‌స్పైర్ చేసింది కాబట్టే ఆ ట్యూన్స్ ఇవ్వగలిగాను" అని చెప్పుకొచ్చాడు అనూప్ రూబెన్స్.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



