కౌరవ, పాండవులకే తప్పలేదు గొడవలు.. మేమెంత!
on Sep 18, 2022

ఒకప్పుడు టాలీవుడ్ మూవీస్ లో హాస్యం చాలా ఆరోగ్యకరంగా ఉండేది. అలాంటి హాస్యాన్ని పండించిన క్యారెక్టర్లు ఎవరు అని అడగగానే డ్యూయల్ కాంబినేషన్ ఐన కోట, బాబూమోహన్ పేర్లే చెప్తారు చాలామంది. హాస్యాన్ని పండించడం అంటే చాలా టఫ్ టాస్క్. ఒక్కోసారి హాస్యం పండినా కూడా ఆడియన్స్ కి రీచ్ కాదు. అలాంటి హాస్యాన్ని ఎంతో చక్కగా చేసి అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ నిలిచిపోయారు కోట, బాబూమోహన్, బ్రహ్మానందం. మరి అలాంటి కోట, బాబూమోహన్ మధ్యన ఏవో మనస్పర్థలు వచ్చాయని రూమర్స్ అప్పట్లో ఎన్నో వచ్చాయి. కాకపొతే అప్పట్లో సోషల్ మీడియా అనేదే లేదు. కాబట్టి వాటి విషయాలు ఎవరికీ తెలిసేవి కావు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా ఉదృతి బాగా పెరిగింది. ఇక చాలామంది కూడా చెప్పాలనుకున్న విషయాలను ఇంటర్వ్యూల్లో చెప్పుకుంటున్నారు. మరి బాబూమోహన్ కూడా అలాంటి కొన్ని విషయాలు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
కోట గారికి, మీకు మధ్యన చాలా క్లాషెస్ వచ్చాయట అనే ప్రశ్న ఒక ఇంటర్వ్యూలో బాబూమోహన్ కి ఎదురయ్యింది. "ఒక ఇంట్లో ఉన్నప్పుడు అందరి మధ్యన ఏదో ఒక సందర్భంలో గొడవలు వస్తాయి. రావని లేదు కదా. మనం మనుషులం. భావోద్వేగాలు ఉంటాయి.. టెంపర్మెంట్లు ఉంటాయి. కౌరవులు, పాండవులంతటి వాళ్లకే బేధాభిప్రాయాలు, గొడవలు వచ్చాయి, యుద్దాలే జరిగాయి. మా మధ్యన కూడా అంతే. కొంత మంది బయటకు చెప్పుకున్నారు, కొందరు దాచుకున్నారు, కొందరు అప్పటికప్పుడు పరిష్కరించుకున్నారు. ఎవరం కూడా ముక్కులు, చెవులు కోసుకోలేదు.. చిన్న చిన్న మనస్పర్థలు వస్తాయి, పోతాయి. నేను, కోట గారు ఒకే ప్లేట్ లో భోజనం చేసేవాళ్ళం. హోటల్లో చెరొక రూమ్ ఇచ్చినా కూడా ఎవరో ఒకరి రూంలోనే ఉండేవాళ్ళం. మేము మేమే..మా మనస్త్వత్వాలు అంతే. కోటగారి తర్వాత ఎక్కువగా బ్రహ్మానందంతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నా. కాకపోతే అక్కడ కోట గారిని అన్నా అంటే ఆయన తమ్ముడు అనేవారు, ఇక్కడ బ్రహ్మానందం నేను బావ , బావ అనుకునేవాళ్లం. క్యారెక్టర్ బాగా చేయాలి, డైలాగ్ బాగా చెప్పాలి చిన్న తప్పు జరిగినా బూతద్దంలో చూస్తారు కాబట్టి ఎదుటివాళ్ళ కంటే బాగా చేయాలి అనే కాంపిటీషన్ ఉండేది మాలో కోట గారు అంటే నటనలో కూడా ఆయన అలాగే కోటలా ఉండేవారు. ఆయన పక్కన నేనో బచ్చాను గనక ఒళ్ళు దగ్గర పెట్టుకుని బాగా నటించాలి అంటూ అదే పనిగా రిహార్సల్స్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. అంతే కానీ మా ఇద్దరి మధ్య ఎప్పుడూ గొడవలు వంటివి ఏమీ లేవు." అంటూ బాబు మోహన్ కోట గారితో ఉన్న అనుబంధం గురించి ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



