'గద్దలకొండ గణేష్' తర్వాత 'బూమరాంగ్' అంటున్న అధర్వ!
on Sep 24, 2019
వరుణ్ తేజ్ టైటిల్ రోల్ చేసిన 'గద్దలకొండ గణేష్' సినిమాతో తమిళ హీరో అధర్వ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఒకప్పుడు తమిళ డబ్బింగ్ ఫిల్మ్ 'హృదయం'లో హీరోగా నటించి, మనవాళ్ల హృదయాలకు దగ్గరైన మురళి కొడుకే అధర్వ. హరీశ్ శంకర్ డైరెక్ట్ చేసిన 'గద్దలకొండ గణేష్'లో సినిమా డైరెక్టర్ కావాలని తపించే అభిలాష్ అనే యువకుడిగా నటించి మెప్పించాడు అధర్వ. నిజానికి ఆ సినిమా కథను నడిపించేది అధర్వ పాత్రే. వరుణ్ తేజ్ విలన్ అయితే అధర్వ హీరో. తెలుగులో అతడికి పేరు రావడంతో ఇప్పుడు అతడి తమిళ సినిమాలను తెలుగులో విడుదల చేసేందుకు నిర్మాతలు రెడీ అవుతున్నారు.
తాజాగా అతడి తమిళ సినిమా 'బూమరాంగ్' తెలుగులో అదే పేరుతో వస్తోంది. ఆర్. కణ్ణన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఈ ఏడాది మార్చిలో తమిళనాట విడుదలైంది. ఇందులో మేఘా ఆకాశ్, ఇందూజా రవిచంద్రన్ నాయికలుగా నటించారు. విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్ బేనర్‌పై సిహెచ్ సతీశ్‌కుమార్ ఈ సినిమాని తెలుగులో అనువదిస్తున్నారు. తెలుగులో ‘అందాల రాక్షసి’, ‘ఎవడే సుబ్రమణ్యం’, ‘అర్జున్‌రెడ్డి’, ‘హుషారు’ చిత్రాల్లో పాటలతో తెలుగు ప్రేక్షకులను వీనులవిందైన స్వరాలను అందించిన రధన్, ఈ చిత్రానికి హిట్ ఆల్బమ్ ఇచ్చారు. త్వరలో పాటల్ని, అక్టోబర్‌లో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నామని సతీశ్‌కుమార్ చెప్పారు.
'గద్దలకొండ గణేష్' విడుదల కంటే ముందే నయనతార తమ్ముడిగా 'అంజలి సీబీఐ' (తమిళంలో 'ఇమైక నోడిగళ్') అనే డబ్బింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అధర్వ. అయితే ఆ సినిమా సరిగా ఆడకపోవడంతో అతడిని మనవాళ్లు సరిగా గుర్తించలేదు. ఇప్పుడు 'గద్దలకొండ గణేష్'లో చక్కని నటనతో అతను ఆకట్టుకున్నాడు.
Also Read