ENGLISH | TELUGU  

'అతడే శ్రీమన్నారాయణ' సినిమా రివ్యూ

on Jan 1, 2020

 

సినిమా పేరు: అతడే శ్రీమన్నారాయణ
తారాగణం: రక్షిత్ శెట్టి, శాన్వి శ్రీవాస్తవ, అచ్యుత్‌కుమార్, బాలాజీ మనోహర్, గోపాలకృష్ణ దేశ్‌పాండే, ప్రమోద్ శెట్టి, మధుసూదన్ రావు, రిషబ్ శెట్టి
స్క్రీన్‌ప్లే: చంద్రజిత్, అభిజిత్ మహేశ్, రక్షిత్ శెట్టి
మాటలు: రాజేశ్
పాటలు: రామజోగయ్య శాస్త్రి
సంగీతం: అజనీష్ లోక్‌నాథ్, చరణ్ రాజ్
సినిమాటోగ్రఫీ: కర్మ్ చావ్లా
నిర్మాతలు: పుస్క్కర్ మల్లికార్జున, హెచ్.కె. ప్రకాశ్
ఎడిటింగ్, డైరెక్షన్: సచిన్
బ్యానర్: పుష్కర్ ఫిలిమ్స్
విడుదల తేదీ: 1 జనవరి 2020

కన్నడనాట సూపర్ హిట్టయిన 'కిరిక్ పార్టీ' హీరోగా ఫేమస్ అయిన రక్షిత్ శెట్టి హీరోగా నటిస్తూ, స్క్రీన్‌ప్లే సమకూర్చిన 'అవనే శ్రీమన్నారాయణ' సినిమా తెలుగులో 'అతడే శ్రీమన్నారాయణ'గా అనువాదం అవుతున్నదనే విషయం తెలిసినప్పుడు తెలుగు సినీ వర్గాలు ఒకింత ఆసక్తి చూపాయి. ట్రైలర్ రిలీజయ్యాక ఆ ఆసక్తి రెట్టింపయ్యింది. భారీ నిర్మాణ విలువలతో ఈ సినిమాని తీశారనీ, రక్షిత్ శెట్టి ఏదో మ్యాజిక్ చేయబోతున్నాడనీ అనిపించింది. మరి ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'అతడే శ్రీమన్నారాయణ' మూవీ ఎలా ఉంది? రక్షిత్ శెట్టి మ్యాజిక్ చేశాడా? పదండి చూద్దాం..

కథ
మాయలోకం అనే నాటక సమాజం ఒక ఊరిలో నాటక ప్రదర్శన ఇచ్చి, ప్రభుత్వ నిధిని దొంగిలించిందనే వార్త వ్యాపిస్తుంది. ఆ సమాజానికి చెందిన లారీని అటకాయించిన అభీరుల నాయకుడు రామరామ (మధుసూదన్ రావు), ఒక్క బ్యాండ్ మాస్టర్‌ని మినహాయించి మిగతా నాటక సమాజ సభ్యులందర్నీ చంపేస్తాడు. అతడు ఆశించినట్లు ఆ లారీలో నిధి ఉండదు. పదిహేనేళ్లు గడిచిపోతాయి. రామరామ చనిపోతాడు. అతని కొడుకుల్లో ఒకడైన జయరాం (బాలాజీ మనోహర్) అభీరుల నాయకుడై ఆ నిధి కోసం అన్వేషిస్తుంటే, అతడి కారణంగా బయటకు వెళ్లిపోయిన రామరామ మరో కొడుకు తుకారాం (ప్రమోద్ శెట్టి) సవతి అన్నపై కక్షతో రగులుతూ ఒక రాజకీయ పార్టీపెట్టి అందును కోసం చూస్తుంటాడు. ఆ నిధి అన్వేషణలో అమరావతి పోలీస్ స్టేషన్ సీఐ శ్రీమన్నారాయణ (రక్షిత్ శెట్టి) రంగంలోకి దిగుతాడు. అయితే అతడికి ఒక పత్రిక రిపోర్టర్ లక్ష్మి (శాన్వి) నుంచి ఆటంకాలు ఎదురవుతాయి. జయరాం, తుకారాం, శ్రీమన్నారాయణ మధ్య నడిచే దాగుడుమూతలాటలో చివరికి ఏమయ్యింది? అసలు లక్ష్మి ఎవరు? నిధి ఏమయ్యింది?.. అనే అంశాలతో మిగతా కథ నడుస్తుంది.

విశ్లేషణ
'అతడే శ్రీమన్నారాయణ' అనేది ఎంటర్‌టైన్‌మెంట్, యాక్షన్ మేళవించిన ఒక ఫాంటసీ డ్రామా. ఫలానా కాలంలో జరిగిందని చెప్పకపోయినా సెల్‌ఫోన్లు రాని కాలానికి చెందిన కథ అనుకోవచ్చు. జీపులు, కాస్ట్యూమ్స్ ప్రకారం చూస్తే యాభై ఏళ్ల క్రితం కాలపు కథగా కూడా ఊహించుకోవచ్చు. సినిమాలో ఒక కౌబాయ్ తరహా సెటప్ కనిపిస్తుంది. అభీరులనేవాళ్లు దోపిడీ దొంగలలాంటివాళ్లు. వాళ ప్రాంతంలోకి పోలీసులు కూడా ప్రవేశించలేరు. వాళ్ల నాయకుడు జయరాం అయితే మహా క్రూరుడు. తండ్రికిచ్చిన మాట ప్రకారం సవతి తమ్ముడు తుకారాంని చంపడు కానీ, అతని చేతి రెండువేళ్లను తెగనరుకుతాడు. అలాంటి వాళ్లతో శ్రీమన్నారాయణ ఆడే ఆట ఒకవైపు వినోదాన్ని కలిగిస్తూ, ఇంకోవైపు అతడేం ప్రమాదంలో చిక్కుకుంటాడోననే ఉత్కంఠనీ రేకెత్తిస్తుంది. ఫస్టాఫ్‌లో కథనం స్ట్రెయిట్‌గా లేకపోవడంతో సగటు ప్రేక్షకుడు తికమకకు గురవుతాడు. ఫలితంగా అసహనానికీ లోనవుతాడు.

సెకండాఫ్ నడుస్తున్నకొద్దీ కథనంలో ఉత్కంఠ పెరుగుతుంది. శ్రీకృష్ణ పరమాత్మ సందర్భానుసారం ఎలా తన లీలలు ప్రదర్శిస్తుంటాడు, చిక్కుల్లో పడినట్లు అనిపిస్తూనే, వాటి నుంచి ఎలా బయటపడుతుంటాడని మనం చదువుకున్నామో, అదే తరహాలో రక్షిత్ శేట్టి పోషించిన శ్రీమన్నారాయణ పాత్రను దర్శకుడు సచిన్ మలిచాడు. అంటే, అతని పాత్రే మనకు వినోదాన్ని పంచుతుంది. అతడికి తోడు, ఎప్పుడూ అతని పక్కనే ఉండే హెడ్‌కానిస్టేబుల్ అచ్యుత్. వీళ్లిద్దరూ వినోదాన్ని తమ భుజాల మీద వేసుకున్నారు. శాన్వి పోషించిన లక్ష్మి క్యారెక్టర్ రొటీన్ హీరోయిన్‌లా ఉండదు. హీరో హీరోయిన్ల మధ్య ఎలాంటి రొమాన్సూ ఈ సినిమాలో లేదు. పైగా శ్రీమన్నారాయణ అంటే లక్ష్మికి ఏమాత్రం గిట్టదు. తనవాళ్లను రక్షించుకోవడమే పనిగా పెట్టుకున్న ఆమెకు, ఆ పనికి అడ్డం వస్తున్నట్లు కనిపించే నారాయణను ఎందుకు ఇష్టపడుతుంది? కానీ నారాయణ, లక్ష్మి మధ్య ఘర్షణ మనకేమీ ఆసక్తి కలిగించదు. ఆ ఇద్దరూ ఒక్కటైతే బాగుండనని అనిపించే దానికి భిన్నంగా లక్ష్మి క్యారెక్టర్ బిహేవ్ చేస్తుంటే ఒకింత చికాకూ కలుగుతుంది. 

మొదట్లో తన స్క్రీన్‌ప్లేతో, సన్నివేశాల కల్పనతో ఇబ్బందిపెట్టిన దర్శకుడు.. ప్రి క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్‌ను మాత్రం ఆసక్తికరంగా, ఆకర్షకంగా చిత్రించాడు. లేకపోతే 186 నిమిషాల సినిమాని భరించడం మన వల్ల అయ్యే పనేనా? ఇంత నిడివి ఉండే మన టాప్ హీరోల సినిమాలనే మనం సహించలేకపోయిన సందర్భాలున్నాయి. మరి ఒక కన్నడ హీరో, అదీ మనకు తెలీనివాడు నటించిన సినిమాని ఇంతసేపు చూసి సహించగలరా మన ప్రేక్షకులు? 'కేజీఎఫ్' లాంటి సినిమా చూశారంటే, దానిలోని ఉద్వేగభరిత సన్నివేశాలు, హీరోయిజం కారణాలు. 'శ్రీమన్నారాయణ'లో ఆ తరహా ఉద్వేగం కానీ, హీరోయిజం కానీ లేవు. అందుకే సినిమా నిడివి విషయంలో జాగ్రత్త పడాల్సింది. పాటల్లోని సంగీతం ఆకట్టుకుంటుంది. అలాగే రీరికార్డింగ్ కూడా ఇంప్రెసివ్‌గానే ఉంది. సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్. కౌబాయ్ సినిమాల తరహా కలర్ టోన్ కానీ, సందర్భాలకు తగ్గట్లు ఉపయోగించిన ఎఫెక్ట్స్ కానీ బాగున్నాయి. ఒకందుకు ఈ సినిమాని మెచ్చుకోవచ్చు. ఒక నిధి అన్వేషణకు, నాటక కళాకారుల భద్రతకూ ముడిపెట్టి, కథకు ఒక ప్రయోజనాన్ని కల్పించారు.

ప్లస్ పాయింట్స్
హీరో క్యారెక్టరైజేషన్‌లోని ఎంటర్‌టైన్‌మెంట్
ప్రి క్లైమాక్స్, క్లైమాక్స్
మ్యూజిక్, సినిమాటోగ్రఫీ


మైనస్ పాయింట్స్
తికమక పెట్టే ఫస్టాఫ్ స్క్రీన్‌ప్లే, సాగదీసిన సన్నివేశాలు
హీరో హీరోయిన్ల మధ్య రొమాంటిక్ యాంగిల్ లేకపోవడం
కథలో ఫీల్ మిస్సవడం
ఎడిటింగ్ 

నటీనటుల అభినయం
శ్రీమన్నారాయణగా రక్షిత్ శెట్టి తొలిసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రష్మికా మందన్న మాజీ లవర్‌గా ఇటీవలి కాలంలో వార్తల్లో నిలిచిన అతడు (ఆ ఇద్దరూ 'కిరిక్ పార్టీ'లో జోడీగా నటించారు) టైటిల్ రోల్‌కు అతికినట్లు సరిపోయాడు. కన్నింగ్ పోలీసాఫీసర్‌గా నోటిలో సిగార్ పెట్టుకొని అతడు ప్రదర్శించిన హావభావాలు కానీ, యాక్షన్ సీన్లలో కనపర్చిన ఎనర్జీ కానీ ఆకట్టుకున్నాయి. 'సాహోరే సభా ప్రాంగణం' అనే పాటలో అతడు వేసిన ఒక స్టెప్.. సిగ్నేచర్ స్టెప్పుగా మారింది కూడా. లక్ష్మి పాత్రలో శాన్వి బాగానే నటించింది కానీ, తెరకు ఆమె గ్లామర్‌ను అద్దలేకపోయింది. క్రూరుడైన జయరాం పాత్రలో బాలాజీ మనోహర్ గొప్పగా రాణించాడు. అతని ఆహార్యం, అతని నటన ఆ పాత్రకు అచ్చుగుద్దినట్లు సరిపోయాయి. తుకారాంగా ప్రమోద్ శెట్టి కూడా బాగా చేశాడు. హీరో 'అచ్యుతన్న' అని పిలిచే హెడ్ కానిస్టేబుల్ క్యారెక్టర్‌ను కన్నడ హాస్యనటుడు అచ్యుత్‌కుమార్ బాగానే చేశాడు. అతిథి పాత్ర లాంటి రామరామగా తెలుగునటుడు మధుసూదన్ రావు పర్ఫెక్టుగా ఫిట్టయ్యాడు. బ్యాండ్ మాస్టర్‌గా చేసిన గోపాలకృష్ణ దేశ్‌పాండే కూడా ఆకట్టుకున్నాడు. మిగతావాళ్ల పేర్లు మనకు తెలీకపోయినా వాళ్లు కూడా పరిధుల మేరకు నటించారు. కౌబాయ్ కృష్ణగా మరో అతిథి పాత్రలో 'కిరికి పార్టీ' డైరెక్టర్ రిషభ్ శెట్టి కనిపించడం ఒక విశేషం. 

తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్
'అమరావతి'లో జరిగినట్లుగా చెప్పినా, మన నేటివిటీకి దూరంగా కనిపించే కథను మూడు గంటలపైగా కుర్చీల్లో కూర్చొని చూడ్డం కష్టమే. అనవసరం అనిపించే సన్నివేశాలు లేకపోతే, కథనం బిగువుగా ఉంటే, వినోదం పంచే సినిమా ఇది.

రేటింగ్: 2.75/5

- బుద్ధి యజ్ఞమూర్తి


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.