మద్రాస్ నుంచి హైదరాబాద్‌కు తరలివచ్చిన తొలి హీరో!
on Jan 22, 2021

నేడు నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు వర్ధంతి. కేన్సర్‌తో బాధపడుతూ 2014 జనవరి 22న ఆయన తుదిశ్వాస విడిచారు. అక్కినేని అంత్యక్రియలను ఆయనకు ప్రాణప్రదమైన అన్నపూర్ణ స్టూడియోస్‌లో నిర్వహించారు. ఆయనను చివరిసారిగా దర్శించుకోవడానికి వచ్చిన జన సందోహాన్ని అదుపుచేయడం పోలీసువారికీ కష్టమైంది. చిత్రసీమకు సంబంధించి హైదరాబాద్‌లో నిర్మించిన తొలి స్టూడియో సారథీ స్టూడియో కాగా, తర్వాత నిర్మించింది అన్నపూర్ణ స్టూడియోస్‌నే.
తెలుగు చిత్రపరిశ్రమ అంతా మద్రాసులో ఉన్నప్పుడు, తెలుగువారి సొంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో ఇండస్ట్రీని తీసుకురావాలని తపించి, అందుకు తొలి అడుగువేసిన నటుడు అక్కినేని. ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్‌లోనే ఇండస్ట్రీ నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడకు వచ్చేసిన ఆయన 1975లో ఒక ఫిల్మ్ స్టూడియో నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అదే.. అన్నపూర్ణ స్టూడియో. 1975 ఆగస్ట్ 13న తన పెద్ద కుమార్తె సత్యవతి కుమారుడైన చిన్నారి సుమంత్ (ఇప్పటి హీరో)తో దానికి శంకుస్థాపన చేయించారు. నాలుగు నెలల్లోనే దీని నిర్మాణం పూర్తవడం విశేషం.
1976 జనవరి 14 సంక్రాంతి పర్వదినాన అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ చేతుల మీదుగా అన్నపూర్ణ స్టూడియోస్ ప్రారంభమైంది. ఈ స్టూడియోస్‌లో షూటింగ్ జరుపుకున్న తొలి చిత్రం అక్కినేని, వాణిశ్రీ జంటగా నటించిన 'సెక్రటరీ'. దానికి నిర్మాత అక్కినేని వియ్యంకుడు డి. రామానాయుడు. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ సాధించింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



