యాంకరింగ్ లో కూడా సిండికేట్ తయారైంది.. ఉదయభాను సెన్సేషనల్ కామెంట్స్!
on Jul 10, 2025
అప్పట్లో తెలుగునాట టాప్ యాంకర్స్ లో ఉదయభాను ఒకరు. ఎన్నో షోలను తనదైన యాంకరింగ్ తో హిట్ చేశారు. ఉదయభాను హోస్ట్ చేస్తే చాలు.. ఆ షో హిట్ అనే అంతలా పేరు పడిపోయింది. ఉదయభాను ఎనర్జిటిక్ యాంకరింగ్ కి అప్పట్లో ఎందరో ఫ్యాన్స్ ఉండేవారు. అంతటి స్టార్డం చూసిన ఆమెకు అవకాశాలు లేకుండా పోయాయా? కొందరు సిండికేట్ గా మారి ఆమె అవకాశాలకు గండి కొడుతున్నారా? తాజాగా ఉదయభాను చేసిన సంచలన వ్యాఖ్యలను గమనిస్తే అలాగే అనిపిస్తోంది.
సుహాస్ హీరోగా నటించిన 'ఓ భామ అయ్యో రామ' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రీసెంట్ గా జరిగింది. చాలా రోజుల తర్వాత ఈ ఈవెంట్ కి హోస్ట్ గా ఉదయభాను రావడం విశేషం. ఇదే విషయాన్ని ఆ వేడుకకు గెస్ట్ గా హాజరైన దర్శకుడు విజయ్ కనకమేడల ప్రస్తావించాడు. "చాలా రోజుల తర్వాత ఉదయభాను గారు మళ్ళీ ఈవెంట్ లు చేస్తున్నారు.. చాలా సంతోషంగా ఉంది." అని విజయ్ అన్నాడు. దీనికి ఉదయభాను ఇచ్చిన సమాధానం ఆశ్చర్యపరిచింది. "ఇదొక్కటే చేస్తున్నాను. మళ్ళీ చేస్తానని గ్యారెంటీ లేదు. రేపే ఈవెంట్ అనుకుంటాం.. చేసే రోజు ఉండదు ఈవెంట్. అంత పెద్ద సిండికేట్ ఎదిగింది ఇక్కడ. సుహాస్ మా బంగారం కాబట్టి ఏదో ఈ ఈవెంట్ చేయగలిగా." అని ఉదయభాను అన్నారు.
ఉదయభాను మాటలను బట్టి చూస్తే.. ఇక్కడ కొందరు సిండికేట్ గా ఏర్పడి, తనలాంటి వారికి అవకాశాలు రాకుండా చేస్తున్నారు అనిపిస్తోంది. నిజానికి అప్పట్లో సుమ, ఝాన్సీ, ఉదయభాను టాప్ యాంకర్స్ గా ఉండేవారు. వీరిలో యూత్ లో ఎక్కువగా ఉదయభానుకి ఫాలోయింగ్ ఉండేది.
సుమ ఇప్పటికీ యాంకరింగ్ లో రాణిస్తోంది. ఝాన్సీ నటిగా మారి సినిమాలు చేస్తోంది. అయితే ఉదయభాను మాత్రం అటు యాంకర్ గానూ, ఇటు యాక్టర్ గానూ బిజీగా లేరు. ఒకట్రెండు సినిమాల్లో నటించారు. 'లీడర్', 'జులాయి' వంటి సినిమాల్లో ప్రత్యేక గీతాల్లో మెరిశారు. కానీ, పూర్తిస్థాయిలో నటిగా బిజీ అవ్వలేదు. అలా అని యాంకర్ గా.. షోలు కానీ, ఈవెంట్ లు కానీ పెద్దగా చెయ్యట్లేదు. ఉదయభాను తనకి ఆసక్తి లేక యాంకరింగ్ తగ్గించారేమో అనే అభిప్రాయం ఇప్పటిదాకా ఉండేది. కానీ, కొందరు ఉదయభానుకు ఈవెంట్ లు లేకుండా చేస్తున్నారని ఆమె తాజా కామెంట్స్ తెలుపుతున్నాయి.
ప్రస్తుతం సినిమా ఈవెంట్లు అంటే మొదట వినిపించే పేరు సుమ. పెద్ద సినిమాల ఈవెంట్లు ఎక్కువగా సుమనే చేస్తూ ఉంటారు. ఇక చిన్న, మీడియం రేంజ్ సినిమాలకు మంజూష, గీతా భగత్, స్రవంతి వంటి వారు ఎక్కువగా హోస్ట్ చేస్తున్నారు. మరి ఈ యాంకర్ల ఎంపిక ఎలా జరుగుతుంది. ఈవెంట్ మేనేజర్ల చేతిలో ఉందా? పీఆర్ఓ చేతుల్లో ఉందా? లేక మూవీ టీం ఇన్వాల్వ్ అవుతుందా? అసలు ఉదయభానుకి అవకాశాలు రాకుండా చేస్తున్నది ఎవరు? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంపై ఉదయభాను అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు. టాలెంటెడ్ యాంకర్ కి అవకాశాలు లేకుండా చేస్తారా? అంటూ ఫైర్ అవుతున్నారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
