మానసికంగా రేప్ చేస్తున్నారు - యాంకర్ ప్రదీప్
on Aug 28, 2020

"ప్రేక్షకులకు వినోదం ఆనందించడం తప్ప నాకు ఇంకేం రాదు. నాకు వీలైనంతవరకు సహాయం చేశాను తప్ప... ఇప్పటివరకు నేను ఎవరికీ అన్యాయం చేయలేదు. నా మీద ఇటువంటి నిందలు ఆరోపణలు వేస్తుంటే.... ఎంత బాధగా ఉంటుందో తెలుసా? నేనేం తప్పు చేశాను? ఎందుకు నా పేరును ఇలా వాడుతున్నారు? అని ఎంతో బాధగా ఉంది" అని యాంకర్ ప్రదీప్ ఆవేదన వ్యక్తం చేశారు.
గత కొన్నేళ్లుగా తనపై ఐదువేలసార్లు అత్యాచారం చేశారని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో సుమారు 140 మందిపై ఒక యువతి కేసు పెట్టింది. అందులో యాంకర్ ప్రదీప్ కూడా ఉన్నాడని కొన్ని యూట్యూబ్ ఛానళ్లు కథనాలు ప్రసారం చేశాయి. సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేశారు. అవన్నీ అసత్యాలేనని ప్రదీప్ స్పష్టం చేశారు. ఆయనొక వీడియో విడుదల చేశారు. అందులో ట్రోలింగ్, అసత్య వార్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
"ఒక వ్యక్తికి న్యాయం జరగడం కోసం ఇంకో వ్యక్తి జీవితాన్ని నాశనం చేసేస్తారా? నిజానిజాలు ఏంటో తెలుసుకోకుండా సోషల్ ట్రోలింగ్ షురూ చేస్తారా?" అని ప్రదీప్ ప్రశ్నించారు. సదరు పుకార్లు ప్రచారం చేయడం వల్ల తన కుటుంబం ఎంతో ఆందోళన చెందుతోందని ఆయన అన్నారు. "నిజం తెలిసేలోపు నాకు గానీ నా కుటుంబానికి గానీ ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు?" అని మరో ప్రశ్న వేశారు.
"ఇది ఎంత మానసిక క్షోభ తెలుసా? ఒక విధంగా మానసికంగా మానభంగం చేస్తున్నట్లు. సదరు వ్యక్తులు చేస్తున్న ఆరోపణలు... వాళ్ళు చెబుతున్న పేర్లు, వ్యక్తులు, స్థలాలతో నాకు ఎటువంటి సంబంధం లేదు. అందులో ఏ మాత్రం నిజం లేదు. యాంకర్ ప్రదీప్‌కి, దానికి ఎటువంటి సంబంధం లేదు. నిజానిజాలు బయటకు వచ్చే లోపు ఎవరైతే ఈ అసత్య ప్రచారం చేస్తున్నారో... వాళ్ల మీద నేను లీగల్ యాక్షన్‌కి వెళ్తున్నాను. తర్వాత వచ్చే పరిణామాలు నేను బాధ్యుడిని కాదు. దయచేసి సోషల్ ట్రోలింగ్ ఆపేయండి" అని ప్రదీప్ పేర్కొన్నారు. గతంలో తనపై ఇదే విధంగా సోషల్ ట్రోలింగ్ చేశారని అన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



