ENGLISH | TELUGU  

అనసూయను స్పైసీగా చూపిస్తున్న కృష్ణవంశీ!

on Dec 19, 2019

 

రంగమ్మత్తగా 'రంగస్థలం'లో ప్రేక్షకుల్ని అలరించి, భావోద్వేగాలకు గురిచేసిన అనసూయ త్వరలో ఒక 'స్పైసీ' క్యారెక్టర్లో అలరించేందుకు సిద్ధమవుతోంది. అవును. కృష్ణవంశీ డైరెక్ట్ చేస్తోన్న 'రంగ మార్తాండ' సినిమాలో ఆమె స్పైసీ క్యారెక్టర్ చేస్తోందట. ఈ విషయాన్ని స్వయంగా కృష్ణవంశీ వెల్లడించారు. "సెన్సువస్ సెన్సేషన్, ఎప్పుడూ  ప్రకాశవంతంగా కనిపించే, ఎప్పుడూ నవ్వుతూ ఉండే, అమేజింగ్ అనసూయతో వర్క్ చేస్తుండటం సంతోషంగా ఉంది. తను 'రంగ మార్తాండ'లో ఒక స్పైసీ రోల్ చేస్తోంది" అని తన ట్విట్టర్ పేజీద్వారా ఆయన తెలియజేశారు. నానా పటేకర్ టైటిల్ రోల్ చేయగా మరాఠీలో మహేశ్ మంజ్రేకర్ డైరెక్ట్ చేసిన 'నటసామ్రాట్' మూవీని 'రంగమార్తాండ' పేరుతో కృష్ణవంశీ రీమేక్ చేస్తున్నారు. తెలుగులో టైటిల్ రోల్ను ప్రకాశ్ రాజ్ చేస్తుండగా, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ, ఎప్పుడూ ఆయనకు చేదోడువాదోడుగా ఉండే కీలకమైన భార్య పాత్రను రమ్యకృష్ణ చేస్తున్నారు. రమ్యకృష్ణ, కృష్ణవంశీ భార్యాభర్తలనే విషయం తెలిసిందే. 2003లో వివాహానంతరం కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన 'శ్రీ ఆంజనేయం'లో హీరో నితిన్ తల్లిగా అతిథి పాత్రలో కనిపించిన రమ్యకృష్ణ, మళ్లీ ఆయన డైరెక్షన్లో నటిస్తోంది ఇప్పుడే.

టెలివిజన్ రంగంలో మకుటంలేని మహారాణిలా రాణిస్తోన్న అనసూయ సినిమాల విషయంలో మాత్రం ఆచితూచి అడుగులు వేస్తూ వస్తోంది. అనేక అవకాశాలు ఆమె దగ్గరకు వస్తున్నప్పటికీ, తనకు ఆఫర్ చేస్తోన్న పాత్ర, డైరెక్టర్, హీరోలను బట్టి కూడా ఆమె సినిమాలను ఎంపిక చేసుకుంటూ వస్తోంది. టెలివిజన్ న్యూస్ ప్రెజెంటర్‌గా కెరీర్‌ను ఆరంభించి, తన రూపంతో ఆకట్టుకున్న ఆమె, తర్వాత టీవీ యాంకర్‌గా మారి వీక్షకుల్ని అమితంగా అలరించింది. 'జబర్దస్త్' షో ప్రెజెంటర్‌గా ఆమెకు వచ్చిన పాపులారిటీ అసాధారణమని చెప్పాలి. ఆమెకు వచ్చిన క్రేజ్‌ను క్యాష్ చేసుకోవాలని సినీ నిర్మాతలు, దర్శకులు ప్రయత్నిస్తూ వచ్చారు. ఎట్టకేలకు అడివి శేష్ హీరోగా రవికాంత్ పేరెపు డైరెక్ట్ చేసిన 'క్షణం' మూవీలో ఏసీపీ జయా భరద్వాజ్ అనే నెగటివ్ రోల్‌ను ఎంపిక చేసుకొని అందర్నీ ఆశ్చర్యపరిచింది అనసూయ.  సినిమా చూశాక ఆమె ఆ క్యారెక్టర్‌ని ఎందుకు చేసిందో అర్థమైంది. నెగటివ్ రోల్ అయినప్పటికీ సినిమాలో అది చాలా కీలకం. అయితే తొలిగా విడుదలైన సినిమా మాత్రం నాగార్జున డ్యూయల్ రోల్ చేసిన 'సోగ్గాడే చిన్నినాయనా' మూవీ. ఇందులో ఆమె నాగార్జున మరదలిగా స్పెషల్ అప్పీరెన్స్ ఇచ్చి అలరించింది.

గోపీచంద్ మలినేని డైరెక్ట్ చెయ్యగా సాయిధరం తేజ్ హీరోగా నటించిన 'విన్నర్' మూవీలో 'సూయా సూయా అనసూయా' అనే స్పెషల్ సాంగ్ చేసి అలరించిన అనసూయ, ఆ తర్వాత మోహన్‌బాబు సినిమా 'గాయత్రి'లో ఒక కీలక పాత్ర చేసింది. ఆ సినిమా ఫ్లాపవడంతో ఆమె క్యారెక్టర్ ఎలివేట్ కాలేదు. ఇక ఆమె కెరీర్‌లోనే టాప్ మూవీ అయిన 'రంగస్థలం' వచ్చింది. అందులో రంగమ్మత్త అంటూ రాంచరణ్ పిలిచే పాత్రను ఉన్నత స్థాయిలో పోషించి శభాష్ అనిపించుకుంది. గుండెల్లో ఎంతో విషాదాన్ని దాచుకొని, బయటకు నవ్వుతూ కనిపించే రంగమ్మగా అనసూయ నటన మనల్ని చాలాకాలం వెన్నాడుతూనే ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు. 'ఎఫ్2'లో గెస్ట్ రోల్ చేసిన ఆమె, వైఎస్ రాజశేఖరరెడ్డి జీవితంలోని పాదయాత్ర ఘట్టం ప్రధానంగా మహి వి. రాఘవ్ డైరెక్ట్ చేసిన 'యాత్ర' చిత్రంలో గౌరు చరితారెడ్డిగా కనిపించింది. రాజేష్ నాదెండ్ల డైరెక్ట్ చేసిన 'కథనం'లో హీరోయిన్‌గా ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ చూపింది. డైరెక్టర్ తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన 'మీకు మాత్రమే చెప్తా' సినిమాలోనూ కనిపించిన ఆమె ఇప్పుడు 'రంగమార్తాండ'లో నటించేందుకు సిద్ధమవుతోంది.

ఆమెది స్పైసీ రోల్ అంటూ కృష్ణవంశీ పేర్కొన్నారు కానీ.. ఒరిజినల్‌లో స్పైసీగా ఉండే ప్రధాన పాత్ర ఏదీ లేదనే చెప్పాలి. కథలో ప్రకాశ్ రాజ్ కూతురు, కోడలి పాత్రలు కూడా కీలకమైనవే. ఫస్టాఫ్‌లో కోడలి క్యారెక్టర్, సెకండాఫ్‌లో కూతురి క్యారెక్టర్ కీలకంగా ఉంటాయి. కుటుంబం విడిపోవడానికి కోడలి పాత్ర కారణమైతే, తండ్రిని అవమానించే పాత్ర కూతురిది. చేస్తే ఈ రెండింటిలోనే ఒక క్యారెక్టర్‌ను అనసూయ చేస్తుందనుకోవాలి. అది ఏదనేది కొద్ది రోజుల్లో వెల్లడి కావచ్చు. బహుశా ఒరిజినల్‌లోని క్యారెక్టర్‌నే అనసూయతో స్పైసీగా కృష్ణవంశీ చేయిస్తున్నారనుకోవాలి. 'రంగమార్తాండ'లో తనకు అవకాశం ఇచ్చిన కృష్ణవంశీ గురించి "ఆయన సినిమాల నుంచి నేనెప్పుడూ స్ఫూర్తి పొందుతుంటాను. జీవం తొణికిసలాడుతుండే, మూలాలను మరవని, సున్నితంగా ఉంటూనే శక్తిమంతంగా కనిపించే అమ్మాయిల పాత్రలు ఆయన సినిమాల్లో కనిపిస్తుంటాయి. సెట్స్‌పై ఆయన నుంచి ఆదేశాలు పొందే అవకాశం రావడం ఒక కల" అని ట్వీట్ చేసింది అనసూయ. ఈ సినిమాలో క్యారెక్టర్ ఆమెకు ఎలాంటి పేరు తీసుకొస్తుందో చూడాలి.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.