'ఆర్య'తో స్టైలిష్ స్టార్‌ని.. 'పుష్ప'తో ఐకాన్ స్టార్‌ని!
on Apr 8, 2021
ఇక అల్లు అర్జున్ను "స్టైలిష్ స్టార్" అనడానికి వీల్లేదు. అతని రేంజ్ మారిపోయింది. ఇకనుంచీ మనం అతడిని "ఐకాన్ స్టార్" అని పిలవాలి. ఇంతకు ముందు స్టైలిష్ స్టార్.. ఇప్పుడు ఐకాన్ స్టార్ అనే పేర్లు అతనికిచ్చింది డైరెక్టర్ సుకుమార్. అవును. మెగాస్టార్, సూపర్‌స్టార్, పవర్‌స్టార్, మెగాపవర్‌స్టార్ లాంటి కిరీటాలతో పోలిస్తే స్టైలిష్ స్టార్ కిరీటం ఆనడం లేదు. అందుకే 'ఆర్య'తో బన్నీని స్టైలిష్ స్టార్ అని పిలిచిన సుకుమార్, 'పుష్ప'తో అతడిని "ఐకాన్ స్టార్"గా పిలుస్తున్నాడు. ఆ కిరీటం బన్నీ ఫ్యాన్స్‌కు కూడా బాగా నచ్చేసింది. అన్ని స్టార్ల కంటే ఐకాన్ స్టార్ అనే బిరుదే పెద్దదని వారు సంబరపడుతున్నారు.
మన స్టార్లకు కేవలం హీరో అని పిలిపించుకుంటే సంతృప్తిగా ఉండదు. ముందు ఏదో కిరీటం లాంటి, బిరుదు లాంటి ఏదో ఒక పేరు ఉండాలి. ఫ్యాన్స్ కూడా ఆ కిరీటాలను చూసుకొని సంబరపడుతుంటారు. ఇప్పుడు బన్నీకి స్టైలిష్ స్టార్ అనే పేరు కంటే ఐకాన్ స్టార్ అనే పేరు బాగుందని సంబరపడుతున్నారు. నిజానికి సుకుమార్ ఇచ్చిన పేరు ఐకానిక్ స్టార్. అది కరెక్ట్ వర్డ్. కానీ చివరికి ఐకాన్ స్టార్ అనే పేరు ఖాయం చేశారు.
వాళ్లకేమిటి.. బన్నీకి కూడా స్టైలిష్ స్టార్‌గా పిలిపించుకోవడం కంటే ఐకాన్ స్టార్‌గా పిలిపించుకోవడమే నచ్చింది. ఈ విషయాన్ని 'పుష్ప' టీజర్ రిలీజ్ ఈవెంట్లో స్వయంగా చెప్పాడు బన్నీ. "నా లైఫ్ టేకాఫ్ అయ్యిందే 'ఆర్య' సినిమాతో. ఆ సినిమాతో నాకు స్టైలిష్ స్టార్ అనే పేరొచ్చింది. ఇవాళ.. ఇక నా ఫ్యూచరంతా ఒక కొత్త పేరొచ్చింది. సుకుమార్ గారికి థాంక్స్.. నాకు 'ఆర్య' ఇచ్చినందుకు, "ఐకాన్ స్టార్' అనే పేరిచ్చినందుకు. సుకుమార్ గారు నాకేమిచ్చినా స్పెషల్‌గా, ఎప్పుడూ గుర్తుండిపోయేలా ఉంటుంది. ఇప్పుడు కూడా ఎప్పుడూ గుర్తుండిపోయే గిఫ్ట్ ఇచ్చినందుకు థాంక్స్. తను అంటూ ఉన్నాడు.. నువ్వు స్టైలిష్ స్టార్ నుంచి నెక్ట్స్ లెవల్‌కు వెళ్లిపోవాలి.. యు ఆర్ ద ఐకాన్ స్టార్ అన్నాడు. థాంక్యూ సో మచ్ డార్లింగ్. సింపుల్‌గా, స్టైల్‌గా ఉంది కదా.. నాక్కూడా నచ్చింది." అని ఒప్పేసుకున్నాడు. అదీ సంగతి!