బాహుబలికి `మెగా` స్కెచ్
on May 11, 2017
టాలీవుడ్ చరిత్ర బాహుబలి కి ముందు ఆ తరవాత అని లిఖించుకోవాల్సిందే. తెలుగు చిత్రసీమపై, ఆ మటకొస్తే... భారతీయ చలన చిత్ర యవనికపై బాహుబలి సృష్టించిన ప్రభావం అంతటిది. కేవలం గణాంకాల గురించే మాట్లాడుకొంటే.. ఆల్ ఇండియా పరంగా అన్ని రికార్డుల్ని బద్దలు కొట్టేసింది. ఏకంగా రూ.1000 కోట్ల మైలు రాయిని అవలీలగా దాటేసింది. తెలుగు సినిమా స్టామినా ప్రపంచానికి చాటి చెప్పిన చిత్రమిది. బాహుబలి రికార్డుల్ని బద్దలు కొట్టడం సామాన్యమైన విషయం కాదు. ఈవిషయం చిత్రసీమకి తెలుసు. అందుకే నాన్ బాహుబలి రికార్డులు అంటూ కొత్తగా ఒకటి మొదలెట్టారు. అంటే రికార్డుల పరంగా బాహుబలి గణంకాల్ని పరిగణలోకి తీసుకోరన్నమాట.
బాహుబలిని మినహాయిస్తే.. మేమే ఫస్టు అని చెప్పుకొంటున్నారిప్పుడు. అయితే అల్లు అరవింద్ మాత్రం... బాహుబలి రికార్డుల్ని బద్దలు కొట్టడానికే సన్నద్దం అవుతున్నారు. అందుకే రూ.500 కోట్లతో `రామాయణం` ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టబోతున్నారు. అందులో భాగంగానే `మేం రూ.500 కోట్లతో సినిమా తీస్తున్నాం` అంటూ చాటింపు వేశారు. ఓ సినిమా చేస్తున్నప్పుడు బడ్జెట్ ఎంతో ప్రకటించాల్సిన అవసరం ఉండదు. అంతెందుకు.... బాహుబలి బడ్జెట్ ఇంత అని చిత్రబృందం ఇప్పటి వరకూ చెప్పలేదు. అంటే అల్లు అరవింద్ ఉద్దేశం ఏమిటి?? భారతీయ చలన చిత్ర సీమలో మాకంటే ఎవ్వరూ ఇంత భారీగా ఖర్చు పెట్టడం లేదనే కదా? అలా ఇండియన్ సినిమా చూపు ఈ సినిమాపై పడేలా చేసుకొంటారన్నమాట. దీన్నో ఇంటర్నేషనల్ సినిమా రేంజు పబ్లిసిటీ ఇవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది. తద్వారా బిజినెస్ భారీ ఎత్తున చేసుకోవొచ్చు. బాహుబలి రికార్డుల్ని బద్దలు కొట్టడానికి ఇదే అరుదైన అవకాశం అని అల్లు అరవింద్ భావిస్తున్నాడు. చూద్దాం.. ఎవరి బాక్సులు ఎలా బద్దలవుతాయో...??