టాలీవుడ్ రామాయణం ఏ పాత్ర ఎవరికి??
on May 11, 2017
ఐదొందల కోట్లతో రామాయణం తెరకెక్కిస్తున్నామన్న అల్లు అరవింద్ ప్రకటనతో... టాలీవుడ్లో సరికొత్త ఉత్సాహం వచ్చింది. బాహుబలి తో పొందిన స్ఫూర్తా... లేదంటే అల్లు అరవింద్ ఎప్పటి నుంచో ఇలాంటి భారీ సినిమా తీయడానికి స్కెచ్చులు వేస్తున్నాడా?? అనే విషయాల్ని పక్కన పెడితే.. టాలీవుడ్లో మరో మహత్తర ప్రాజెక్టుకు అంకురార్పణ జరగడం మాత్రం ఆనందించాల్సిన విషయం. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లోనూ ఈ సినిమాని విడుదల చేస్తారు కాబట్టి.. ఆ సంస్థల నుంచి నటీనటుల్ని ఎంపిక చేసుకోవడం తథ్యం. అయితే... టాలీవుడ్ వరకూ చూస్తే రామాయణం చిత్రానికి న్యాయం చేసే నటీనటులు ఎవరున్నారు? రాముడు ఎవరు? సీతగా ఎవరు చేస్తే బాగుంటుంది? అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
రాముడు అంటే తెలుగువారికి గుర్తొచ్చే స్వరూపం... నందమూరి తారక రామారావు. రాముడంటే ఇలానే ఉంటాడేమో అనిపించేంత అద్భుతమైన అభినయం ప్రదర్శించారాయన. ఆ తరవాత ఎంతమంది ఆ పాత్ర పోషించినా.. ఆ వైభవం తీసుకురాలేకపోయారు. రాముడి పాత్ర కోసం టాలీవుడ్ నుంచి ఒకరిని ఎంపిక చేయాల్సివస్తే దర్శక నిర్మాతలకు అది కత్తిమీద సామే. ఆ పాత్ర చేయగలిగే సామర్థ్యం... నందమూరి వారసుడు ఎన్టీఆర్ కే ఉందేమో! బాలరామాయణంలో రాముడిగా కనిపించిన ఎన్టీఆర్.. ఆ తరవాత ఎప్పుడూ ఆ సాహసం చేయలేదు. ఎన్టీఆర్ అయితే ఈ పాత్రకు న్యాయం జరుగుతుంది. రామరాజ్యంలో నందమూరి బాలకృష్ణ కూడా ఆ పాత్రని చాలా అద్భుతంగా పోషించారు. కాబట్టి.. మరో ఆప్షన్ దర్శకులకు దొరికినట్టే.
సీత పాత్రలో టాలీవుడ్ వాళ్లనే తీసుకోవాలంటే నిత్యమీనన్ తప్ప మరో ఆప్షన్ లేకపోవొచ్చు. నయనతారని ఇప్పటికే సీత పాత్రలో చూసేశాం. నిత్య అయితే... కొత్తగా ఉండొచ్చు. అతి ముఖ్యమైన హనుమంతుడి పాత్ర దగ్గర పేచీ వచ్చేస్తుంది. మళ్లీ కండలు పెంచితే.. సునీల్ ఈ పాత్రకు సరితూగుతాడేమో. రావణుడిగా రానా అయితే సరిగ్గా సరిపోతాడు. భళ్లాలదేవుడిగా తనలోని క్రూరత్వం చూపించిన రానా... రావణుడిగా బెస్ట్ ఆప్షన్. లక్ష్మణుడు, భరతుడు లాంటి పాత్రల కోసం నాని, శర్వానంద్, నాగశౌర్య లాంటి యంగ్ హీరోల్ని తీసుకొంటే బాగుంటుంది. అన్ని భాషల వారికీ న్యాయం చేయాలంటే మాత్రం టాలీవుడ్ నుంచి రాముడు.. తమిళ చిత్రసీమ నుంచి సీత, బాలీవుడ్ నుంచి రావణుడిని దిగుమతి చేసుకోవాల్సిందే. మరి అల్లు అరవింద్ మైండ్లో ఏముందో...??