ENGLISH | TELUGU  

నాన్నా.. నువ్వు ఇండ‌స్ట్రీకి ఇచ్చిన దానికంటే వ‌న్ ప‌ర్సెంట్ ఎక్కువిచ్చి చ‌స్తా!

on Oct 23, 2021

 

ఆకాశ్ పూరి మాట్లాడాడు. వాళ్ల నాన్న పూరి జ‌గ‌న్నాథ్ గురించి మాట్లాడాడు. పూరి కొడుకుగా పుట్టినందుకు గ‌ర్విస్తున్నానంటూ, ఏదో ఒక రోజు న‌న్ను చూసి నువ్వు గ‌ర్విస్తావంటూ మాట్లాడాడు. ఒకానొక‌రోజు న‌న్ను చూసి కాల‌ర్ ఎగ‌రేస్తావంటూ మాట్లాడాడు. ఆకాశ్ పూరి ఎమోష‌న‌ల్ స్పీచ్‌కు వేదిక అయ్యింది 'రొమాంటిక్' మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్‌. 'రొమాంటిక్' మూవీలో ఆకాశ్ హీరోగా న‌టించాడు. పూరి శిష్యుడు అనిల్ పాడూరి డైరెక్ట్ చేసిన రొమాంటిక్ మూవీ అక్టోబ‌ర్ 29న రిలీజ్ అవుతోంది.

"ఎప్ప‌ట్నుంచో మా నాన్న గురించి మాట్లాడాల‌ని వెయిట్ చేస్తున్నాను. ఫైన‌ల్‌గా ఇప్పుడు వ‌చ్చింది అవ‌కాశం. ఎక్క‌డో న‌ర్సీప‌ట్నంలో పుట్టిన మా నాన్న‌ ఏ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇక్క‌డకు వ‌చ్చారు. క‌ష్ట‌ప‌డ్డారు. ఇండ‌స్ట్రీ అనే మ‌హాస‌ముద్రంలోకి దూకేశారు. నాన్నా నువ్వు ఇండ‌స్ట్రీకి వ‌చ్చి పెద్ద బ‌స్సు కొనుక్కున్నావ్‌. న‌న్ను, అమ్మ‌నీ, చెల్లినీ, మ‌న ఫ్యామిలీని, ఫ్రెండ్స్ అంద‌ర్నీ నీ బ‌స్సులో వేసుకొని ఒక లాంగ్ జ‌ర్నీ స్టార్ట్ చేశావు. మంచిగా వెళ్తున్న బ‌స్సు ఒక రాంగ్ ప‌ర్స‌న్‌ని న‌మ్మ‌డం వ‌ల్ల స‌డ‌న్‌గా ఆగిపోయింది. మేమంద‌రం బ‌స్సులోనే ఉన్నాం. ఏం చేయాలో తెలీదు. ఆ మ‌నిషొక్క‌డే బ‌స్సులోంచి కిందికి దిగి, బ‌స్సును తొయ్య‌డం మొద‌లుపెట్టాడు. కొన్ని సంవ‌త్స‌రాలుగా ఆ బ‌స్సును తోస్తూనే వ‌చ్చాడు." అన్నాడు ఆకాశ్‌.

ఎన్నో ఏళ్ల నుంచి తాను ఏవో మాట‌లు విన్నాన‌నీ, నాన్న‌ను ఎవ‌రైనా అంటే చిన్న‌ప్పుడు త‌న‌కు చాలా కోపం వ‌చ్చేదనీ చెప్పాడు. "ఏదైనా బ్యాడ్ కామెంట్ చ‌దివినా, వాడి ఇంటికి వెళ్లి వాడి త‌ల‌ప‌గ‌ల‌గొడ‌తామ‌ని అనిపించేది. ఆ రేంజ్‌లో కోపం వ‌చ్చేది. కొన్ని బ్యాడ్ కామెంట్స్ వింటే చాలా బాధ‌నిపించేది. 'పూరి టైమ్ అయిపోయింది.. ఇంక సినిమాలేం తీస్తాడు.. రొటీన్ సినిమాలు'.. అంటూ అప్పుడు కొన్ని కామెంట్స్ వ‌చ్చేవి. కానీ నాన్నా.. మొన్న ఇస్మార్ట్‌కు నువ్విచ్చిన 'హై'.. దీనెమ్మ అలాంటి ఇలాంటి హై కాదు.. ఇప్పుడు చెప్తున్నా.. నీ కెరీర్ అయిపోయింది, నీ వ‌ల్ల ఏం కాదు అన్న ప్ర‌తివాళ్ల‌కు ఇప్పుడు నేను చెప్తున్నా.. 'దీనెబ్బ కొట్టాడ్రా మావాడు'.. నాన్నా.. థియేట‌ర్లో జ‌నాలు నీ డైలాగ్స్‌కు ఎగురుతుంటే.. కాల‌ర్ ఎగ‌రేశా నాన్నా నేను. నాకా మూమెంట్ ఇచ్చినందుకు థాంక్యూ." అన్నాడు ఆకాశ్‌.

"నాన్నా నీకో విష‌యం చెప్పాలి. నువ్వు నాకో మాట చెప్పావ్‌. 'ఒరేయ్‌.. జీవితంలో స‌క్సెస‌వ‌డం, ఫెయిల‌వ‌డం ముఖ్యం కాదు, మ‌న‌కిష్ట‌మైన ప‌నిలో మ‌నం ఉంటే చాలు.. అదే స‌క్సెస్' అన్నావ్‌. కొన్నాళ్లు బాగా ఆ మాట‌ను న‌మ్మేవాడ్ని. కానీ.. నేను హీరో అయ్యి.. ఇప్ప‌టికి మూడేళ్ల‌యింది. ఈ మూడేళ్ల‌లో నేను తెలుసుకున్న విష‌యం ఏమంటే.. ఆ మాట క‌రెక్ట్ కాదు నాన్నా. నేను ఆ రూట్‌లో ఉండ‌కూడ‌దు. ఎందుకంటే మీ నాన్న పూరి జ‌గ‌న్నాథ్ కాదు. సింహాచ‌లం నాయుడి పేరు ఇక్క‌డెవ‌రికీ తెలీదు. మా నాన్న పూరి జ‌గ‌న్నాథ్ పేరు ఇక్క‌డున్న వాళ్లంద‌రికీ తెలుసు. ఒక ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ లేనోడు ఇండ‌స్ట్రీకి వ‌చ్చి ఫెయిలైనా ప‌ర్లేదు. అతని మీద ఒక సింప‌తీ ఉంటుంది. కానీ ఒక బ్యాగ్రౌండ్ ఉన్నోడు ఇండ‌స్ట్రీకి వ‌చ్చి ఫెయిలైతే బ‌య‌ట.. మ‌నిషిలా కూడా చూడ‌రు నాన్నా.. సో.. నా లైఫ్‌లో స‌క్సెస్ అవ‌డ‌మే రియ‌ల్ స‌క్సెస్‌. ఇట్స్ డు ఆర్ డై. నేను స‌క్సెస్‌ఫుల్ అవుతా నాన్నా. క‌ష్ట‌ప‌డ‌తా." అని హామీ ఇచ్చాడు ఆకాశ్‌.

"నీ కొడుగ్గా పుట్ట‌డం నా అదృష్టం నాన్నా. ఇప్పుడు నేను హీరోన‌య్యాక నా గురించి కూడా మాట‌లు వింటూ వ‌చ్చా. వీడు హీరో ఏంటి?  వీడేం ప‌నికొస్తాడు?  బొంగ‌వుతాడు స్టార్‌.. ఇలా కొన్ని కొన్ని మాట‌లు విన్నా. నాన్నా నేను నీ కొడుకైనందుకు గ‌ర్విస్తున్నా. బ‌ట్‌.. నేను కేవ‌లం కొడుకును కాను. నా పేరు ఆకాశ్ పూరి. ఒక‌రోజు న‌న్ను చూసి నువ్వు గర్వ‌ప‌డ‌తావ్‌. నేను క‌ష్ట‌ప‌డ‌తా. ప్ర‌తి సెక‌నూ క‌ష్ట‌ప‌డ‌తా. ప్ర‌తి సినిమా ప్రాణం పెట్టి చేస్తా. ప్ర‌తి షాట్ ప్రాణంపెట్టి చేస్తా. నువ్వు న‌న్నెంతో ఇన్‌స్పైర్ చేశావ్ నాన్నా. ప్ర‌తి సినిమా ఫ‌స్ట్ సినిమా అనుకొని చెయ్య‌మ‌న్నావ్‌. ప్ర‌తి సినిమా లాస్ట్ సినిమా అయితే ఎలా చేస్తానో అలా క‌ష్ట‌ప‌డతాను. నువ్వూ ఒక‌రోజు న‌న్ను చూసి కాల‌ర్ ఎగ‌రేయాలి నాన్నా. అది నా గోల్‌. దానికోసం క‌ష్ట‌ప‌డ‌తాను. నాకు ఏ టైమ్‌లో బ్రేక్ వ‌స్తుందో తెలీదు నాన్నా. ఎన్నేళ్ల‌యినా స‌రే.. నేను కొట్టాల‌.. నువ్వు కాల‌ర్ ఎగ‌రెయ్యాల‌." అన్నాడు ఆకాశ్‌.

"నువ్వు ఈ సినిమా ఇండ‌స్ట్రీ కోసం ఎంతో ఇచ్చావ్‌. నేను ఈ ఇండ‌స్ట్రీలో పుట్టి పెరిగాను. ఈ ఇండ‌స్ట్రీయే నా స్కూల్ ఫీజు క‌ట్టింది, నాకు అన్నం పెట్టింది. నువ్వు సినిమా ఇండ‌స్ట్రీ కోసం ఎంతిచ్చావో, దానికంటే వ‌న్ ప‌ర్సెంట్ ఎక్కువిచ్చి నేను చ‌స్తా. క‌చ్చితంగా.. అది గుర్తు పెట్టుకో. ఫైన‌ల్‌గా నీకు ఒక‌టే చెప్తున్నా. సినిమా హిట్ట‌యినా ఇంకో సినిమా తీస్తాను, ఫ్లాపైనా ఇంకో సినిమా తీస్తాను. ఇది త‌ప్ప నాకు ఏదీ రాదు. దీనికి త‌ప్ప నేను దేనికీ ప‌నికి రాను. నా లైఫ్ అంతా ఒక్క‌టే.. సినిమా సినిమా సినిమా." అని ఎమోష‌న‌ల్ అయ్యాడు ఆకాశ్ పూరి.

కొడుకు ఎమోష‌న‌ల్ స్పీచ్‌ను ఎదురుగా కూర్చొని చూస్తూ, వింటూ తానూ ఎమోష‌న‌ల్ అయ్యాడు పూరి జ‌గ‌న్నాథ్‌.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.