తెగింపు కోసం తెగించలేకపోతున్న అజిత్!
on Dec 31, 2022
.webp)
తెలుగులో శ్రీకర్ గా మొట్టమొదట హీరోగా కోలీవుడ్ స్టార్ అజిత్ ప్రేమ పుస్తకం అనే చిత్రం తీశారు. ఆ చిత్రంలో హీరోగా చేసినా ఆ తరువాత తమిళంకు వెళ్లి రజిని తరువాత ఆ రేంజ్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు. దాంతో అభిమానులు ఆయనను తల అజిత్ అని పిలుస్తారు. కానీ ఎందుకనో ఈయన తెలుగు మార్కెట్ పై ఎప్పుడు తన ఆసక్తిని చూపించలేదు. కేవలం తమిళ మార్కెట్ ని మాత్రమే చూసుకుంటూ అక్కడే తన స్టార్‌డమ్‌ని విస్తరించుకున్నారు.
ఇక ప్రస్తుతం హెచ్. వినోద్ దర్శకత్వంలో ఆయన తమిళంలో తనీవు అనే సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం తెలుగులోకి తెగింపుగా పొంగల్ రేస్‌లో ఉంది. తమిళ్లో ఈ సినిమాకి పోటీగా దళపతి విజయ్ నటించిన వారీసు విడుదలవుతోంది. ఈ చిత్రాన్ని తెలుగు నిర్మాత, దర్శకులైన దిల్ రాజు- వంశీ పైడిపల్లి లు తెరకెక్కిస్తున్నారు. దాంతో ఈ చిత్రానికి తెలుగులో వారసుడు అనే టైటిల్‌ను ఖరారు చేసి రెండు భాషల్లోనూ వారసుడును భారీగా ప్రమోట్ చేస్తూ హైప్ క్రియేట్ చేస్తున్నారు.
మరోవైపు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య, నందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి చిత్రాలు విడుదలవుతున్నాయి. ఈ రెండు చిత్రాలతో పాటు కేవలం వారసుడికి మాత్రమే తెలుగులో క్రేజ్‌ను, హైప్‌ను క్రియేట్ చేయగలుగుతున్నాయి. ఈ మూడు చిత్రాల కోసమే తెలుగు అభిమానులు ఆసక్తిని చూపిస్తున్నారు. ఇటీవల వారిసు ఆడియో రిలీజ్ కార్యక్రమాన్ని చెన్నైలో నిర్వహించారు. దీనికి భారీగా అభిమానులు తరలివచ్చారు. వాళ్ళందరినీ చూసిన విజయ్ నాకు నేనే పోటీ... నాకెవ్వరూ పోటీ కాదు.... నేనే నెంబర్ వన్ అనే తరహాలో సినిమా డైలాగులు చెబుతూ చెలరేగారు. కానీ అజిత్ మాత్రం ఇప్పటికీ మౌనంగానే ఉంటున్నారు. ఇంతవరకు తెగింపు సంబంధించి పెద్దగా ప్రచారం నిర్వహించలేదు. సోషల్ మీడియాలోనూ హడావుడి లేదు. దీంతో సినిమాకు బజ్ క్రియేట్ కావడం లేదు. ఏదో అనామక హీరో నటించిన ఒక డబ్బింగ్ చిత్రం గా ఈ మూవీని అందరూ భావిస్తున్నారు. రిలీజ్ సమయం దగ్గర పడుతున్న కూడా యూనిట్ ప్రమోషన్స్ విషయంలో ఇలా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న సన్నివేశం చాలామందికి ఇబ్బందిని కలిగిస్తోంది.
నేడు ఎంత పెద్ద స్టార్ హీరో అయినా మౌనంగా ఉంటే వీలుకాదు. బయటకు వచ్చి ప్రమోట్ చేయాలి. లేదంటే సినిమాలు ప్రేక్షకులను రీచ్ కావడం కష్టం. ఇక కేవలం ఏదో ఒకటి రెండు ఇంటర్వ్యూలు ఇస్తే సరిపోదు. రిలీజ్ వరకు జనాలలోనే తిరిగి జనాలలోనే సినిమా పేరు నానేలా చేయాలి. మంచి కంటెంట్ ఉన్న సినిమాలను మరింతగా ముందుకు తీసుకుని వెళ్తే అది ఎంతో ప్లస్ అవుతుంది. ఇది అజిత్, విజయ్ లాంటి వాళ్ళు కచ్చితంగా చేయాల్సిన పని. విజయ్ అయితే తనకు వీలైనంతవరకు ఇలా హైప్ క్రియేట్ చేయడానికి దిల్రాజు, వంశీపైడిపల్లిలతో కలిసి కష్టపడుతున్నాడు.
మరోవైపు తెలుగులో కూడా చిరు, బాలయ్య వంటి స్టార్స్ కూడా తమ వయసును పక్కనపెట్టి ప్రమోషన్స్ కోసం రేయింబవళ్లు కృషి చేస్తున్నారు. కానీ అజిత్ మీడియాకు కనిపించడం చాలా తక్కువ. కోలీవుడ్ లోనే ఆయన పెద్దగా కనిపించడు అన్న విమర్శ ఉంది. ఇక టాలీవుడ్ సంగతి వేరేగా చెప్పాల్సిన పనిలేదు. దాంతో ఆయన సినిమా విడుదలవుతుందో లేదో కూడా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆ రకంగా చూసుకుంటే అజిత్ తెగింపు పై చాలా నెగటివిటి వచ్చింది. దానికి తక్షణం తొలగించుకోవాల్సిన అవసరం అజిత్ పై ఉంది. అంతే కాదు ఈ బాధ్యత ఈ మూవీని డబ్ చేస్తున్న వారిపై కూడా ఖచ్చితంగా ఉందనే చెప్పాలి!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



