'ఆర్ ఆర్ ఆర్' తాజా ఖబర్: అజయ్ దేవ్‌గణ్ వచ్చేశాడు!
on Jan 21, 2020

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా టాప్ డైరెక్టర్ యస్.యస్. రాజమౌళి డైరెక్ట్ చేస్తోన్న 'ఆర్ ఆర్ ఆర్' మూవీ షూటింగ్ కీలక ఘట్టానికి చేరుకుంది. ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర చేయడానికి అంగీకరించిన బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ తొలిసారిగా సెట్స్‌పై మంగళవారం అడుగుపెట్టాడు. చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో "అజయ్ దేవ్‌గణ్ జీతో మా షెడ్యూలును ఈరోజు మొదలు పెడుతున్నందుకు మేమంతా సూపర్ చార్జవుతూ, ఉత్కంఠతకు గురవుతున్నాం. వెల్‌కం సార్" అని పోస్ట్ చేసింది. బాలీవుడ్‌లో తన లేటెస్ట్ ఫిల్మ్ 'తానాజీ' సూపర్ హిట్ అవడంతో అజయ్ దేవ్‌గణ్ సైతం సూపర్ చార్జింగ్‌లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో 'ఆర్ ఆర్ ఆర్' షూటింగ్‌లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చాడు. డైరెక్టర్ రాజమౌళితో ఆయన కరచాలనం చేస్తున్న ఫొటోలు ఇప్పుడు నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి.
ఈ మూవీలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమరం భీమ్ గా తారక్ నటిస్తున్నారు. వాళ్లకు యుద్ధవిద్యలు నేర్పే గురువుగా అజయ్ దేవ్‌గణ్ కనిపించనున్నట్లు అంతర్గత వర్గాల సమాచారం. స్వాతంత్ర్యం పూర్వ కాలం, అందునా 20వ శతాబ్ది తొలినాళ్ల కాలం నేపథ్యంతో తయారవుతున్న ఈ ఫిక్షనల్ మూవీలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, బ్రిటిష్ తార ఒలీవియా మోరిస్ నాయికలుగా నటిస్తున్నారు. తమిళ నటుడు సముద్రకని ఒక కీలక పాత్ర చేస్తున్నాడు. ఎం.ఎం. కీరవాణి సంగీతం, కె.కె. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న 'ఆర్ ఆర్ ఆర్' 2020 అక్టోబర్‌లో విడుదల కానున్నది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



