గానకోకిలను కలుసుకొన్న క్షణం.. విక్రమ్ కలనిజమైన క్షణం!
on Nov 22, 2021

దక్షిణాది చిత్రసీమలోని పాపులర్ యాక్టర్లలో విక్రమ్ ఒకరు. విలక్షణ నటునిగా గుర్తింపు పొందిన ఆయనకు తమిళంలోనే కాకుండా తెలుగు ప్రేక్షకుల్లోనూ అభిమానులున్నారు. ఆయన పలు సినిమాలు ఇక్కడ కూడా హిట్టయ్యాయి. అలాంటి నటుడ్ని ఒక్కసారైనా కలుసుకోవాలని అభిమానులు తహతహలాడుతుంటారు. అలాంటిది ఆయనకూ ఒకర్ని కలవాలనే కల ఉండేది. ఆ కలను ఎట్టకేలకు నిజం చేసుకున్నారాయన. గానకోకిల పి. సుశీల గొంతుకు విక్రమ్ వీరాభిమాని. ఆమెను ఎలాగైనా కలుసుకోవాలని ఆయన కలలు కంటూ వచ్చారు. ఆ కల నిజమైన క్షణాలను తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా షేర్ చేసుకున్నారు.
ఆయన పంచుకున్న పోస్ట్ ప్రకారం, గాయని సుశీలను కలుసుకోవాలని వుందని అక్టోబర్‌లో ఆమెను రిక్వెస్ట్ చేశారు విక్రమ్. ఆ మరుసటి రోజు ఆమె ఇంటికి వెళ్లారు. ఆమెను కలుసుకుని, తను ఆమెకు వీరాభిమానినని చెప్పగానే, అక్కడే ఉన్న మేనేజర్ ఆశ్చర్యపోయాడు. చెప్పిన టైమ్ కంటే పది నిమిషాలు ముందుగానే సుశీల ఇంటికి వెళ్లారు విక్రమ్. ఆమెను కలుసుకోబోతున్నాననే ఫీలింగ్‌తో నెర్వస్‌గా అనిపించిందనీ, దాదాపు రెండు గంటల సేపు తన అభిమాన గాయనితో మాట్లాడగలిగాననీ చెప్పారు విక్రమ్. అయితే మరింత సమయం ఆమెతో గడపాలనుకున్నా, మరో పనికి సంబంధించిన ఫోన్ రావడంతో అన్యమనస్కంగానే అక్కడ్నుంచి రావాల్సి వచ్చిందనీ తెలిపారు. మొత్తానికి ఆమెను కలుసుకొని, అంతసేపు మాట్లాడే అవకాశం రావడం తనకెంతో ఆనందాన్ని కలిగించిందనీ, మరిన్నిసార్లు వస్తానని ఆమెతో చెప్పాననీ షేర్ చేశారు విక్రమ్.

వర్క్ విషయానికొస్తే, విక్రమ్ ప్రస్తుతం 'కోబ్రా', 'మహాన్', 'పొన్నియన్ సెల్వన్' సినిమాలు చేస్తున్నారు. 2022లో ఈ సినిమాలు ఒకదాని తర్వాత ఒకటిగా విడుదల కానున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



