యాంకర్‌ను దూషించిన స్టార్ యాక్టర్ అరెస్ట్
on Sep 27, 2022

మలయాళ స్టార్ యాక్టర్ శ్రీనాథ్ భాసీని కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. తన లేటెస్ట్ ఫిల్మ్ 'చట్టంబి' ప్రమోషన్స్ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ ఎంటర్‌టైన్‌మెంట్ పోర్టల్‌కు చెందిన ఫిమేల్ యాంకర్‌ను అసభ్య పదజాలంతో దూషించాడనేది అతనిపై మోపిన అభియోగం. విచారణలో భాగంగా శ్రీనాథ్‌ను మరదు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం ఉదయం తమ ముందు విచారణకు హాజరు కావాల్సిందిగా పోలీసులు కోరగా, సాయంత్రానికి వాయిదా వేయాల్సిందిగా అతను రిక్వెస్ట్ చేసుకున్నాడు.
ఇంటర్వ్యూ సందర్భంగా భాసీ అలా ప్రవర్తించడానికి కారణం తెలుసుకోవడానికి ఆ ఇంటర్వ్యూ వీడియో క్లిప్‌ను అందజేయాల్సిందిగా పోలీసులు కోరారు. అలాగే ఓ రేడియో స్టేషన్‌కు ఇచ్చిన మరో ఇంటర్వ్యూలో ఎలాంటి కారణం లేకుండానే యాంకర్‌ను భాసీ దూషించిన ఓ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ క్లిప్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఈ రెండు ఘటనలకు సంబంధించిన భాసీని ఇంటరాగేట్ చేస్తున్నారు.
'చట్టంబి' మూవీ ప్రమోషన్ ఇంటర్వ్యూ సందర్భంగా ఆన్‌లైన్ ఎంటర్‌టైన్‌మెంట్ పోర్టల్ యాంకర్ వాళ్ల రౌడీ ప్రవర్తన ఆధారంగా సహ నటులకు రేటింగ్ ఇవ్వాల్సిందిగా భాసీని అడిగింది. మొదట అతను ఈ ప్రశ్నలను తిప్పికొట్టడానికి ప్రయత్నించాడు. దాంతో అతడికి ఇబ్బందికరం అయితే వెళ్లిపోవచ్చునని ఆమె అంది. ఆ వెంటనే అలాంటి పిచ్చి ప్రశ్నలు అడగవద్దని భాసీ చెప్పడం కనిపించింది. ఆ తర్వాత షూట్ చేయడం ఆపమని కెమెరామెన్‌ని అతను అడిగాడు. కెమెరాలు ఆఫ్ చేసిన తర్వాత తమను కూడా భాసీ దుర్భాషలాడాడని కెమెరా సిబ్బంది చెప్పారు.
మహిళలను తీవ్రంగా అవమానించేలా భాసీ తిట్టినట్లు చానల్‌లో పోస్ట్ చేసిన ఓ వీడియోలో వారు ఆరోపించారు. "సాధారణంగా సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూల్లో సాధారణ ప్రశ్నలకు బదులు ఫన్నీగా ఉండే ప్రశ్నలను ఎక్కువగా అడుగుతుంటాం. నిజానికి, సినిమా ప్రమోషన్ టీమ్‌లు మమ్మల్ని సంప్రదించినప్పుడు, వారు ఇలాంటి సరదా ప్రశ్నలనే ఇష్టపడతారు. అందుకే ఇతర పబ్లిసిటీ వీడియోల కంటే మా వీడియోలు లైవ్లీగా ఉంటాయి" అని వారు తెలిపారు. ఆ వీడియోలో 'చట్టంబి' టీమ్ తమ చానల్‌తో చర్చలు జరుపుతున్న సీసీటీవీ ఫుటేజ్ స్నిప్పెట్‌లను కూడా చూపించారు.
మలయాళంలో తక్కువ సమయంలో మంచి పాపులారిటీ సంపాదించుకున్న నటుల్లో శ్రీనాథ్ భాసీ ఒకడు. లేటెస్ట్‌గా 'హ్యాపీ సర్దార్', 'ట్రాన్స్', 'కప్పేలా', 'భీష్మపర్వం' సినిమాల్లో కీలక పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



