కరోనాతో తెలుగు కమెడియన్ మృతి
on Sep 23, 2020

కరోనా మహమ్మారి కాటు వల్ల మరో సినీ ప్రముఖుడు మృతి చెందారు. హాస్య నటుడిగా తనదైన నటనతో పలు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను నవ్వించిన కోసూరి వేణుగోపాల్ కరోనాతో బాధపడుతూ బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. ఒక కుమారుడు, ఒక కుమార్తె. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఆయన స్వస్థలం. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో మేనేజర్ గా పని చేసి, కొన్ని రోజుల క్రితం రిటైర్మెంట్ తీసుకున్నారు. అసలు వివరాల్లోకి వెళితే...
దర్శకుడు పి.ఎన్. రామచంద్రరావు తెరకెక్కించిన 'తెగింపు' సినిమాతో కోసూరి వేణుగోపాల్ తెలుగు తెరకు నటుడిగా పరిచయం అయ్యారు. సుమారు 27 ఏళ్లుగా పలు సినిమాల్లో నటించారు. సునీల్ హీరోగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన 'మర్యాద రామన్న' ఆయనకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. 'ఛలో'లో 'వెన్నెల' కిశోర్ తండ్రిగా నటించారు. ప్రతి సినిమాలో తనదైన నటనతో ఆకట్టుకున్నారు. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించిన 'అమీ తుమీ' ఆయన చివరి సినిమా అని సమాచారం.
సెప్టెంబర్ 1న అనారోగ్యంతో గచ్చిబౌలిలోని ప్రయివేటు ఆసుపత్రిలో కోసూరి వేణుగోపాల్ జాయిన్ అయ్యారు. పరీక్షలు చేయగా, ఆయనకు కరోనా అని తేలింది. అప్పటినుండి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. కొన్ని రోజుల తరవాత కరోనా నెగెటివ్ అని నిర్ధారణ అయినప్పటికీ ఆరోగ్యం కుదుటపడలేదు. ఆయన కోలుకోలేదు. వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మృతి పట్ల పలువురు తెలుగు సినిమా ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



