కన్నడ చిరంజీవి కన్నుమూత
on Jun 7, 2020

యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు, ప్రముఖ కన్నడ నటుడు చిరంజీవి సర్జా ఆదివారం గుండెపోటుతో మృతి చెందారు. శనివారం ఆయనకు శ్వాసకు సంబంధించిన సమస్యలు తలెత్తడంతో కుటుంబ సభ్యులు బెంగళూరులోని జయానగర్‌లో ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో చేర్పించారు. ఆదివారం సాయంత్రం ఆయన గుండెపోటుతో కన్నుమూసినట్లు వైద్యులు తెలిపారు. చిరంజీవి సర్జా వయసు 39 సంవత్సరాలు. ఆయన ఇప్పటివరకూ 19 సినిమాల్లో నటించారు. 1980 అక్టోబర్ 17న బెంగళూరులో జన్మించిన చిరంజీవి సర్జా తొలి నాళ్లలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆ తర్వాత నటుడిగా మారారు.
ఆయన తమ్ముడు ధ్రువ సర్జా కన్నడనాట రైజింగ్ హీరోగా రాణిస్తున్నారు. చిరంజీవి సర్జాకు రెండేళ్ల క్రితమే వివాహమైంది. నటి మేఘనా రాజ్‌ను ఆయన పెళ్లి చేసుకున్నారు. చిరంజీవి సర్జా ఆకస్మిక మరణంతో కన్నడ సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. ఈ దుర్వార్త వినగానే నటి ప్రియమణి విచారం వ్యక్తం చేశారు. "చిరంజీవి సర్జా మృతి వార్త వినగానే షాకయ్యాను. ఆయన నవ్వు ముఖాన్ని ఎన్నటికీ మరవలేను. ఆయన కుటుంబానికంతటికీ నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా" అని ట్వీట్ చేశారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



