ఇంతకీ పవన్ మదిలో ఏముంది?
on Feb 5, 2023

ఎప్పుడో మొదలుపెట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'హరి హర వీరమల్లు' చిత్రం ఇప్పటివరకు 60 శాతం మాత్రమే షూటింగ్ పూర్తయిందని సమాచారం. ఇంకా 40 శాతం వర్క్ పెండింగ్ ఉందట. ఇది ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. అందులోనూ ఇది పీరియాడికల్ స్టోరీ. పోస్ట్ ప్రొడక్షన్ కు చాలా సమయం తీసుకుంటుంది. విఎఫ్ఎక్స్ పనులకు చాలా సమయం కేటాయించాల్సి వస్తుంది. అయితే ఈ చిత్రం త్వరగా విడుదల అవుతుంది అనే నమ్మకం ఒకే ఒక దర్శకుని చూసి మాత్రమే వస్తుంది. ఇలాంటి చిత్రమే అయినా గౌతమీపుత్ర శాతకర్ణిని రికార్డ్ స్థాయిలో రెండు మూడు నెలల్లోనే షూటింగ్ పూర్తి చేసిన ఘనత క్రిష్ జాగర్లమూడి కి ఉంది. దాంతో అందరూ పవన్ కనుక సరిగా డేట్స్ ఇస్తే ఈ చిత్రాన్ని క్రిష్ అనుకున్న దానికంటే వేగంగా పూర్తి చేస్తారని భావిస్తున్నారు.
మరోవైపు పవన్ జోరు మాత్రం తగ్గడం లేదు. రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ కొత్త సినిమాలను ప్రారంభిస్తూనే ఉన్నారు. తాజాగా దానయ్య- సుజీత్ ల కాంబినేషన్ లో చిత్రాన్ని అనౌన్స్ చేశారు. దానికి ముహూర్తం కూడా తాజాగా జరిగింది. ఈ చిత్రాన్ని కేవలం 30 వర్కింగ్ డేస్ లో పూర్తి చేయాలని ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. పవన్ గట్టిగా అనుకోవాలి కానీ ఓ నెల రోజులు కాల్ షీట్స్ ఇస్తే సుజిత్ ఈ సినిమాను పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరోవైపు హరీష్ శంకర్ సంగతి చూస్తే ఆయన మాట్లాడుతూ పవన్ డేట్ ఇస్తే ఉస్తాద్ భగత్ సింగ్ ను వీలైనంత తొందరగా పూర్తి చేసి సంక్రాంతికి విడుదల చేస్తానని చెప్పారు. అలాగే వినోదాయ సిత్తం రీమేక్ కూడా కేవలం 40 రోజుల్లో పూర్తి చేసే విధంగా ప్లానింగ్ జరుగుతోంది.
ఏది ఏమైనా 30 రోజులు 40 రోజుల్లో సినిమా తీయడం సరే ఆ మాత్రం డేట్స్ అయినా పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఇస్తాడు? అనేది క్లారిటీ లేదు. ఎందుకంటే ఆయన ప్రస్తుతం రాజకీయాల్లో బిజీబిజీగా ఉన్నారు. సెట్స్ పై ఉన్న హరిహర వీరమల్లును పూర్తి చేయడం పక్కనపెట్టి వరుస చిత్రాలను ఒప్పుకుంటున్నారు. వాటి పూజా కార్యక్రమాలు జరుపుతున్నారు. పోస్టర్ రిలీజ్ జరుగుతున్నాయి. వీటన్నింటితో పవన అభిమానులలో తెలియని గందరగోళం నెలకొని ఉంది.
పవన్ గనుక సరిగా ప్లాన్ చేసుకుంటే ఈ దసరాకి హరిహర వీరమల్లుతో రావచ్చు. అంతకంటే ముందుగానే సుజిత్ సినిమా లేదా వినోదయ సిత్తం చిత్రాలను పూర్తి చేయగలరు. మరికొన్ని డేట్స్ కేటాయిస్తే సంక్రాంతికి ఉస్తాద్ భగత్ సింగ్ గా రావచ్చు. కానీ ఇవన్నీ మాటలు వరకు మాత్రమే. ఎందుకంటే డేట్స్ ఇవ్వాల్సింది పవన్ కళ్యాణ్. ఆయన మదిలో ఏముందో ఎవరికీ తెలియదు. త్వరలోనే అభిమానులకు పవన్ కళ్యాణ్ ఏమైనా క్లారిటీ ఇస్తాడేమో వేచి చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



