ENGLISH | TELUGU  

తెలుగుభారతికి వెలుగు హారతి వేటూరి!

on Jan 29, 2018


తెలుగు పాటకు పట్టాభిషేకం చేసిన కవి మహారాజాయన...

తెలుగు సినీ గీతానికి శృగార నైషిధ సొగబులద్దిన అక్షర శిల్పి జక్కన్న ఆయన...

ఆత్మ సంఘర్షణకు గురించే అక్షరాలు ఆయన ఆయుధాలు...

ఉవ్విత్తున ఎగిసిపడే వరద గోదారి తరంగాలు.. ఆయన పదబంధాలూ...

రాగరత్న మాలికాతరళాలు.. శంకారాభరణాలు ఆయన గీతాలు..

ఆయనే... అక్షర యాత్రికుడు... కవితా శ్రామికుడు... అపర శ్రీనాథుడు..  చైతన్యాక్షర  దీప్తి... వేటూరి సుందరరామమూర్తి.

తెలుగు సినీ సంగీత వృక్షాన కొమ్మ కొమ్మకో సన్నాయిని పూయించిన కవి వైతాళికుడు వేటూరి. ఆ గీత రచనతో తెలుగు సినిమా పాట పులకించింది. ప్రేక్షక లోకం మైమరచింది.

పాటకు సంగీతం శరీరమైతే.. సాహిత్యం ఆత్మ. వేటూరి కలం నుంచి ఉద్భవించిన అక్షరాత్మలు.. ఎన్నో పాటలను చిరంజీవుల్ని చేశాయనడం ఏమాత్రం అతిశయోక్తి కాదు.

’ఓంకారనాదానుసంధానమౌ గానమే..’. ఆని రాసినాయనే... ‘ఆరేసుకోబోయి పారేసుకున్నాను’ అని రాశాడటే నమ్ముతారా?
‘ఈ దుర్యోధన దుశ్యాసన దుర్వినీత లోకంలో’..  ఆని  రాసినాయనే.. ‘అబ్బనీ తీయనీ దెబ్బ...’ అని రాశాంటే  విశ్వసిస్తారా?
వేటూరి కలానికి అన్ని వైపులా పదునే. ఆయన కలం చేతపడితే... అక్షరాలు తమకు తామే అలంకరించుకుంటాయ్.  ఆవేశంతో పదాలు పరవళ్లు తొక్కుతాయ్. అసలాయన్ను వేటూరి అనడం కంటే... ‘పాటల ఊటలూరి’ అనడం సబేబేమో. శరీరాన్ని వదిలేవరకూ ఆయన ఆత్మ అక్షర యాగం నిరంతరాయంగా చేస్తూనే ఉంది. అలుపెరగని కవితాశ్రమికుడు అని వేటూరి అనేది అందుకే.

‘నువ్వు పట్టుచీర కడితే ఓ పుత్తడిబొమ్మా... ఆ కట్టుబడికి తరించేను పట్టుపురుగు జన్మ’ అని రాయాలని ఎవరికి అనిపిస్తుందండీ... వేటూరికి కాక. ‘ప్రతి భారతసతి మానం చంద్రమతీ మాంగల్యం... మర్మస్థానం కాదది నీ జన్మస్థానం’ అని రాసే దమ్ము ఎవరికుందండీ వేటూరి తప్ప. ‘నడురు బ్రతుకు నటన.. ఈశ్వరుని తలపు ఘటన.. ఆ రెంటి నట్ట నడుమా.. నీకెందుకింత తపన’  రాని రాసి.. వైరాగ్య శిఖరానికి చక్రవర్తి అనిపించుకున్నాడు వేటూరి..

‘చిన్నల్లుడు’ సినిమాలో సిల్కు స్మిత, సుమన్లపై తీసిన పాట  ‘సిల్కో... చిన్నారి కన్నె సిల్కో... మిడ్ లైట్ తీసి మేల్కోవే నా సిల్కు’ .  ఆ పాటలో.. సుమన్... సిల్క్ స్మితను అడుగుతాడు...  ’చల్మోహన రంగమ్మా.. నీ మొగుడిక ఎవరమ్మా...?’ అని. అప్పుడు సిల్క్ చెప్పే సమాధానం... ‘మదన జనకుడు రా!’ అని. ‘మనద జనకుడు’ అంటే శ్రీకృష్ణుడు. ‘నా మొగుడు శ్రీకృష్ణుడు’ అని సిల్క్ స్మిత పాత్రతో చెప్పించగలిగిన... అభినవ శ్రీనాధుడు వేటూరి.

ముందుతరం కవులైన... దాశరధి, ఆరుద్ర, ఆత్రేయ, శ్రీశ్రీ ల  భావుకతకూ... తర్వాత తరం కవులు... సిరివెన్నెల, వెన్నెకంటి, చంద్రబోస్ తదితరుల ఆధునికతకూ మధ్య వారధి వేటూరి సుందరరామ్మూర్తి. తెలుగు భారతికి వెలుగు హారతి వేటూరి సుందరరామ్మూర్తి.

ఆ మహానుభావుని పుట్టిన రోజు సందర్భంగా... ఆయన్ను స్మరించుకోవడం మనందరి ధర్మం. అందుకే...  ‘తెలుగువన్’ ఆ కవిరాజుకు ఇస్తున్న అక్షర నివాళి ఈ వ్యాసం.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.