వేణు తొట్టెంపూడికి కలిసిరాని రీఎంట్రీ!
on Jul 29, 2022
.webp)
'స్వయంవరం', 'చిరునవ్వుతో', 'హనుమాన్ జంక్షన్' వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వేణు తొట్టెంపూడి చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత 'రామారావు ఆన్ డ్యూటీ'తో రీఎంట్రీ ఇచ్చాడు. కానీ రీఎంట్రీ ఆయనకు పెద్దగా కలిసొచ్చేలా లేదు.
రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో రూపొందిన సినిమా 'రామారావు ఆన్ డ్యూటీ'. ఈ సినిమాలో సీఐ మురళి అనే కీలక పాత్రలో నటించిన వేణు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేశాడు. నిజానికి జూనియర్ ఎన్టీఆర్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన 'దమ్ము'(2012) సినిమాతోనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారాడు వేణు. కానీ ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేదు. పైగా అందులో తనది అంతగా ప్రాధాన్యం లేని పాత్ర కావడంతో వేణు కూడా కాస్త నిరాశచెందాడు. దీంతో 2013 లో వచ్చిన 'రామాచారి' తరువాత సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు. పలు సినిమాల్లో అవకాశాలొచ్చినా 8-9 ఏళ్ళ పాటు దేనికీ ఓకే చెప్పలేదు. మొదట 'రామారావు ఆన్ డ్యూటీ' చేయడానికి ఆసక్తి చూపలేదు. కానీ కథ, తన క్యారెక్టర్ నచ్చి.. ఇదే తన రీఎంట్రీకి కరెక్ట్ అని భావించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కానీ తాజాగా విడుదలైన ఈ చిత్రం వేణు అంచనాలను తప్పేలా చేసింది.
'రామారావు ఆన్ డ్యూటీ' మెయిన్ ప్లాట్ కాస్త కొత్తగా ఉన్నప్పటికీ ఎగ్జిక్యూషన్ మాత్రం పూర్తిగా మిస్ ఫైర్ అయింది. వేణు పోషించిన సీఐ మురళి పాత్ర కూడా అంత బలంగా లేదు. ఆ పాత్ర కూడా ఆయనకు అంతగా సెట్ అయినట్లు అనిపించలేదు. 'ఏందిరా సామి' అంటూ అక్కడక్కడా ఆయన తన మార్క్ చూపించే ప్రయత్నం చేశాడు కానీ.. ఎందుకనో ఆయన సొంతంగా చెప్పుకున్న డబ్బింగే ఆయనకు సెట్ కాలేదు అనిపించింది. ఎన్నో ఆశలు పెట్టుకొని ఆయన రీఎంట్రీ ఇచ్చిన చిత్రం మొదటి షో నుంచే నెగటివ్ టాక్ తెచ్చుకుంది. సినిమా రిజల్ట్ ని పక్కన పెడితే, ఆయన కామెడీ టైమింగ్ కి ఇప్పటికీ ఫ్యాన్స్ ఉన్నారు. మరి త్వరలో ఆయన మరో చిత్రంతోనైనా కమ్ బ్యాక్ ఇస్తాడేమో చూద్దాం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



