వేణు తొట్టెంపూడి ఆన్ డ్యూటీ.. రామారావుతో రీఎంట్రీ
on Jul 29, 2021

యాక్టింగ్, కామెడీ టైమింగ్ తో తక్కువ టైంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు వేణు తొట్టెంపూడి. 1999లో వచ్చిన 'స్వయంవరం' సినిమాతో హీరోగా తెలుగు తెరకి పరిచయమైన వేణు.. దాదాపు 25 సినిమాల్లో హీరోగా నటించాడు. 'చిరునవ్వుతో', 'హనుమాన్ జంక్షన్', 'పెళ్ళాం ఊరెళితే', 'గోపి గోపిక గోదావరి' వంటి సినిమాలతో హిట్స్ అందుకున్నాడు. అయితే ఆ తర్వాత వేణు కెరీర్ డల్ అయింది. ఎన్టీఆర్-బోయపాటి శ్రీను కాంబినేషన్ లో 'దమ్ము' సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారినా.. అది కూడా ఆయనకు విజయాన్ని అందించలేకపోయింది. 2013 వచ్చిన 'రామాచారి' తర్వాత వేణు ఇండస్ట్రీకి దూరమయ్యాడు. అయితే దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఆయన మళ్ళీ ఇప్పుడు రీఎంట్రీ ఇస్తున్నాడు.
మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'రామారావు ఆన్ డ్యూటీ'. డెబ్యూ డైరెక్టర్ శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వేణు తొట్టెంపూడి కీలక పాత్రలో నటిస్తున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. వేణుకి 'రామారావు ఆన్ డ్యూటీ' మూవీ టీమ్ తరఫున స్వాగతం చెబుతూ మేకర్స్ ట్విట్టర్ వేదికగా ఓ పోస్టర్‌ను వదిలారు. రీఎంట్రీతో వేణు మెప్పిస్తాడేమో చూడాలి.

'రామారావు ఆన్ డ్యూటీ' మూవీని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మజిలీ ఫేమ్ దివ్యాన్ష కౌశిక్, మలయాళ నటి రాజేష్ విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సామ్ సిఎస్ సంగీతం అందిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



