ENGLISH | TELUGU  

ఉన్నది ఒకటే జిందగీ మూవీ రివ్యూ

on Oct 27, 2017

తారాగణం: రామ్, శ్రీవిష్ణు, అనుపమా పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి...
దర్శకత్వం: కిశోర్ తిరుమల
నిర్మాత: స్రవంతి రవికిశోర్

ట్రెండ్ బట్టి సినిమాలు నడుస్తుంటాయ్. ఓ ఎరాలో యాక్షన్ సినిమాలు.. ఓ ఎరాలో ఫ్యాక్షన్ సినిమాలు.. ఇంకో ఎరాలో ఫ్యామిలీ డ్రామాలు.. ఇలా అనమాట. కానీ.. ఎనీ టైమ్.. ఎనీ సెంటర్.. సీజన్ తో పనిలేకుండా.. ట్రెండ్ తో నిమిత్తం లేకుండా ఆడే ఏకైక సినిమాలు ప్రేమకథలే. అందుకే.. సరైన ప్రేమకథను సరిగ్గా తీసి జనాల్లోకి వదిలితే.. మాస్ హీరోల సినిమాలైనా సరే.. వాటిముందు మట్టి కరవాల్సిందే. గతంలో అలాంటి అనుభవాలు చాలానే ఉన్నాయ్. ఈ శుక్రవారం ‘ఉన్నది ఒకటే జిందగి’ సినిమా విడుదలైంది. ‘నేను శైలజ’ తర్వాత విరామం తీసుకొని ఆచి తూచి రామ్ సెలక్ట్ చేసుకున్న కథ ఇది. ‘నేను శైలజ’ దర్శకుడైన కిశోర్ తిరుమల.. ఈ చిత్రానికి కూడా దర్శకుడు. ‘ఉన్నది ఒకటే జిందగి’ ప్రేమకథ మాత్రమే కాదండోయ్. ముఖ్యంగా ఇద్దరు ప్రాణమిత్రుల కథ. ప్రేమతో పాటు స్నేహాన్ని కూడా కలగలిపి తయారైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించే స్థాయిలో ఉందా? ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే.. ముందు కథలోకెళ్దాం. 

కథ:-
అభి(రామ్), వాసు(శ్రీవిష్ణు), మహా(అనుపమా పరమేశ్వరన్), మ్యాగి(లావణ్య త్రిపాఠి)... ఇద్దరబ్బాయిలు, ఇద్దరమ్మాయిలు. ఈ నలుగురి చుట్టూ నడిచే కథ ఇది. అభి, వాసు చిన్నప్పట్నుంచీ ప్రాణ స్నేహితులు. ఒకర్ని విడిచి ఒకర్ని ఉండలేనంత స్నేహం వీరిది. అనుకోకుండా ఇద్దరూ ఒకే అమ్మాయిని ప్రేమిస్తారు. ఆ అమ్మాయే మహా. వైరైటీగా ఇద్దరూ ఒకేసారి ప్రపోజ్ చేస్తారు. తామిద్దరిలో ఎవర్ని ‘ఓకే’ చేస్తావో ఆలోచించుకొని చెప్పమంటారు. మహా... వాసుకి ‘ఓకే’ చెబుతుంది. అప్పట్నుంచి... మహా మాయలో పడిపోయి.. స్నేహితుడైన అభిని నెగ్లెట్ చేస్తాడు వాసు. ఒక అమ్మాయి కారణంగా స్నేహితుడు దూరం కావడం అభి భరించలేకపోతాడు. ఎందుకిలా చేస్తున్నావని నిలదీస్తాడు. ‘ఎవరి జీవితం వాళ్లది’ అన్నట్టు మాట్లాడతాడు వాసు. దాంతో.. మనసు చిన్నబుచ్చుకొని దేశాన్నే వదిలి వెళ్లిపోతాడు అభి. తాను ఎక్కడున్నాడో ఎవరికీ తెలియనీయడు. ఫారిన్ లో రెస్టారెంట్ నడుపుకుంటూ నాలుగేళ్లు గడిపేస్తాడు. అనుకోకుండా తన రెస్టరెంట్లోనే చెల్లెల్ని కలుస్తాడు. ఆమె ద్వారా ఈ నాలుగేళ్లో అక్కడ జరిగిన  భయంకరమైన విషయం తెలుసుకుంటాడు. మళ్లీ ఇండియా బయలు దేరతాడు. అసలు అభి లేని ఆ నాలుగేళ్లలో అక్కడ ఏం జరిగింది? వాసు పరిస్థితి ఏంటి? అభి వెళ్లాక అక్కడ జరిగిన పరిణామాలేంటి? అనేది మిగిలిన కథ. 

విశ్లేషణ:-

కథ అయితే... కొత్తదేమీ కాదు. ఇద్దరు మిత్రులూ ఒకే అమ్మాయిని ప్రేమించడం.. త్యాగాలు.. అపార్థాలు.. ఇవన్నీ గతంలో చూసినవే. కథనం కొత్తగా యత్నించాడు దర్శకుడు. కానీ... వర్కవుట్ అయినట్టు కనిపించదు. ఒకానొక దశకు వచ్చేసరికి సినిమాను సాగ దీస్తున్నాడా? అనిపిస్తుంది. కథలోని ఆత్మకు తగినంతగా స్నేహం కానీ.. ప్రేమ కానీ.. ఎస్టాబ్లీష్ అవ్వదు. అందుకే... సినిమాలో తెలీని వెలితి. సెకండ్ హాఫ్ లో కాస్త సినిమాను ట్రిమ్ చేయడం కరెక్ట్. ఇక యువతరం సినిమా అవ్వడంతో కామెడీకి కొదవుండదు. ఫ్రెండ్స్ మధ్య సాగే సన్నివేశాలు సహజత్వానికి దగ్గరగా ఉంటాయ్. ప్రథమార్ధంలో రామ్, అనుపమా పరమేశ్వరన్ మధ్య సాగే సన్నివేశాలు ఆకట్టుకుంటాయ్. ద్వితీయార్థంలో లావణ్య త్రిపాఠీ మెరిపించింది. సో... ఆ విధంగా చూసుకుంటే.. సినిమా కలర్ ఫుల్ గా ఉంది. దర్శకుడుగా కిశోర్ తిరుమలకు పాస్ మార్కులు వేయొచ్చేమో!.. అద్భుతంగా అయితే  తీయలేదు. 

ఇక రామ్.. తన ఎనర్జీ గురించి ప్రత్యేకించి చెప్పేదేముంది. నటనలో ఇంకాస్త పరిణితి సాధించాడు. ఇందులో రామ్ గెటప్స్ ఆకట్టుకుంటాయ్. ఇందులో రామ్ కు సమానమైన పాత్రను శ్రీవిష్ణు పోషించాడు. తనకు ఇది మంచి అవకాశం. కానీ... సినిమా అంతా మంపుగా కనిపిస్తాడు. ఆనందంలోనూ విషాదంలోనూ ఒకే ఎక్స్ ప్రెషన్. అనుపమా పరమేశ్వర్, లావణ్య త్రిపాఠి.. ఇద్దరూ అందంగా కనిపించారు. బాగా చేశారు కూడా. ఫ్రెండ్స్ లో ‘పెళ్లిచూపులు’ఫేం ప్రియదర్శిన్ తో పాటు ఇంకో ముగ్గురు కొత్త ముఖాలు కనిపించాయ్. బాగానే చేశారు. సాంకేతికంగా చెప్పుకుంటే.. కిశోర్ తిరుమల మాటలు చక్కగా రాసుకున్నాడు. చాలా చోట్ల సంభాషణలు మనసుల్ని కదిలిస్తాయ్. సినిమాలో రెండు పాటలు బావున్నాయ్. నేపథ్య సంగీతం మాత్రం ఇరగదీసేశాడు దేవిశ్రీ. ఎడిటర్ శ్రీకర ప్రసాద్ కి ఇంకా కొంతపని మిగిలింది. అదికూడా పూర్తి చేస్తే బెటర్. సమీర్ రెడ్డి కెమెరా వర్క్ ‘ఓకే’. 

టోటల్ గా చెప్పాలంటే.. ఇందులో శ్రీవిష్ణు ముఖం మాదిరిగానే.... సినిమా కూడా మంపుగా ఉంది. వాటమ్మా? వాటీజ్ దిస్సమ్మా? 

రేటింగ్:- 2/5

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.