అన్నగారి సినిమాలో దాసరి...
on Nov 5, 2018

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రముఖులు జీవిత చరిత్రలకు పట్టాభిషేకం చేసే కార్యక్రమం జరుగుతోంది. ప్రస్తుతం తెరకెక్కుతోన్న జీవిత చరిత్రలో ప్రముఖంగా చెప్పుకోవలసింది నందమూరి తారక రామారావు బయోపిక్ 'యన్.టి.ఆర్' గురించి! ఇందులో దర్శకరత్న దాసరి నారాయణరావు పాత్రలో దర్శకుడు చంద్ర సిద్ధార్థ్ కనిపించనున్నారు. ఎన్టీఆర్ కథానాయకుడిగా దాసరి దర్శకత్వంలో 'బొబ్బిలి పులి', 'సర్దార్ పాపారాయుడు' వంటి విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. ఆయా సినిమాల్లోని ఎన్టీఆర్ గెటప్పుల్లో ఈ బయోపిక్‌లో బాలకృష్ణ కనిపించనున్నారు. బయోపిక్‌లో దాసరి సినిమాల ప్రస్తావన వచ్చినప్పుడు దాసరి పాత్రలో చంద్ర సిద్ధార్థ్ కనిపిస్తారు.

దాసరిగా ఆయనపై కొన్ని సన్నివేశాలు తీశారని సమాచారం. ఎన్టీఆర్ బయోపిక్ దర్శకత్వ బాధ్యతల నుంచి తేజ తప్పుకున్న తరవాత దర్శకుడిగా చంద్ర సిద్ధార్థ్ పేరు వినిపించింది. కానీ, ఆయనకు అవకాశం దక్కలేదు. దాసరి పాత్రను పోషించడం ద్వారా సినిమాలో ఆయన ఓ భాగమయ్యారు. క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తూ, నిర్మిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకొస్తున్న సంగతి తెలిసిందే. జనవరి 10న 'యన్.టి.ఆర్ - కథానాయకుడు', జనవరి 24న 'యన్.టి.ఆర్ - మహానాయకుడు' విడుదల చేస్తామని ప్రకటించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



