ఆకట్టుకుంటున్న 'స్వాతి ముత్యం' ట్రైలర్.. గణేష్ హిట్ కొట్టేలా ఉన్నాడు
on Sep 26, 2022

గణేష్, వర్ష బొల్లమ్మ జంటగా లక్ష్మణ్ కె.కృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'స్వాతి ముత్యం'. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నేడు హైదరాబాద్ లోని ఏఎంబీ సినిమాస్ లో చిత్ర ట్రైలర్ విడుదల వేడుక జరిగింది. తాజాగా విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటుంది.
"నిన్న నైట్ ఒక మూవీ చూశానండీ.. దాంట్లో కూడా హీరో, హీరోయిన్ మనలాగే కాఫీ షాప్ లో కలుస్తారు" అంటూ వర్ష బొల్లమ్మ పలికే సంభాషణతో ట్రైలర్ ఆహ్లాదకరంగా ప్రారంభమైంది. వర్షతో తొలి చూపులోనే గణేష్ ప్రేమలో పడటం, ఆమె కూడా గణేష్ ని తిరిగి ప్రేమించడం వంటి క్యూట్ సన్నివేశాలతో అలా సరదాగా సాగిపోతుండగా వారికి ఊహించని సమస్య వస్తుంది. కాసేపట్లో పెళ్లి.. ఏర్పాట్లు కూడా జరిగిపోయాయి.. ఆ సమయంలో వారికి వచ్చిన సమస్య ఏంటి?, దాని నుండి బయట పడటానికి ఏం చేశారు? వంటి సన్నివేశాలతో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. సహజమైన సన్నివేశాలు, సంభాషణలతో ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది.

ఈ చిత్రంలోని ఇతరపాత్రల్లో సీనియర్ నటుడు నరేష్, రావు రమేష్, వెన్నెల కిషోర్, గోపరాజు రమణ, ప్రగతి, సురేఖావాణి తదితరులు నటిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా సూర్య, ఎడిటర్ గా నవీన్ నూలి వ్యవహరిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



