'సిందూరం' విడుదలై నేటికి 25 ఏళ్ళు
on Sep 12, 2022

జయాపజయాలతో సంబంధం లేకుండా కొన్ని చిత్రాలు ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి. అలాంటి వాటిలో 'సిందూరం' ఒకటి. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 12, 1997న విడుదలై ప్రేక్షకుల మెప్పు పొందడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అంతే కాకుండా నేషనల్ అవార్డుతోపాటు ఐదు నంది అవార్డులను గెలుచుకుంది. కల్ట్ క్లాసిక్ గా పేరు తెచ్చుకున్న ఈ సినిమా విడుదలై నేటికి 25 ఏళ్ళు.
'గులాబి', 'నిన్నే పెళ్లాడతా' సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన మూడో సినిమా 'సిందూరం'. ఈ చిత్రం విడుదలైనప్పటి కంటే తర్వాత తర్వాత గొప్ప పేరు తెచ్చుకుంది. ఉత్తమ తెలుగు చిత్రంగా ఆ ఏడాది జాతీయ అవార్డు గెలుచుకుంది. అలాగే ఐదు నంది అవార్డులను కూడా సొంతం చేసుకుంది. ఆ ఏడాది ఉత్తమ చిత్రంగా 'అన్నమయ్య' నిలవగా, ఉత్తమ ద్వితీయ చిత్రంగా 'సిందూరం' నిలిచింది. దాంతో పాటు ఉత్తమ మాటల రచయిత(పతంజలి), ఉత్తమ సహాయనటుడు(సూర్య కుమార్), ఉత్తమ గీత రచయిత( సిరివెన్నెల సీతారామశాస్త్రి), ఉత్తమ పాత్రధారి(పరుచూరి వెంకటేశ్వర రావు) విభాగాల్లో నంది అవార్డులు గెలుచుకుంది.

శ్రీనివాస్ చక్రవర్తి సంగీతం అందించిన ఈ చిత్రంలోని అన్ని పాటలు విశేష ఆదరణ పొందాయి. 'హాయ్ రే హాయ్' పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించగా మిగతా ఐదు పాటలు సిరివెన్నెల కలం నుంచి జాలువారాయి. అందులో 'అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా' పాట నంది అవార్డును గెలుచుకోవడమే కాకుండా ఎందరినో కదిలించింది.
ఆంధ్రా టాకీస్ బ్యానర్ పై రూపొందిన ఈ చిత్రంలో రవితేజ, బ్రహ్మాజీ, సంఘవి, నరసింహ రాజు, భానుచందర్, చలపతి రావు, పరుచూరి వెంకటేశ్వరరావు, సూర్య తదితరులు నటించారు. ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా భూపతి, ఎడిటర్ గా శంకర్ వ్యవహరించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



