ENGLISH | TELUGU  

శివ‌మ్ రివ్యూ

on Oct 2, 2015

Shivam Telugu Movie Review,Shivam Review, Shivam Movie Review, Shivam Movie  rating, Shivam Movie talk

రొటీన్ క‌థ‌లే శ్రీ‌రామ‌ర‌క్ష అనే ధోర‌ణిలోనికి వెళ్లిపోతోంది యువ‌త‌రం. అవే పాట‌లు, అవే సీన్లు, అవే ఫైట్లు. ఫ‌లితం కూడా అదే. సేమ్ టూ షేమ్‌! లాజిక్ లేని క‌థ‌లు, అతుకుల బొంత లాంటి స‌న్నివేశాలు.. వెర‌సి ప్రేక్ష‌కుల్ని భ‌య భ్రాంతుల‌కు గురి చేస్తున్నాయి. నేల విడ‌చి సాము చేస్తూ... అదే కొత్త‌ద‌నం అనుకొంటూ, ప్రేక్ష‌కుల్ని గింగిరాలు తిప్పిన సినిమా మ‌రోటి బాక్సాపీసు ద‌గ్గ‌ర‌కు వ‌చ్చింది. అదే శివ‌మ్! పండ‌గ చేస్కో అంటూ.. ఈ యేడాదిలోనే రామ్ ఓ యావ‌రేజ్ అందుకొన్నాడు. అదీ రొటీన్ క‌థే. ఇక రొటీన్ క‌థ‌లే త‌న‌కు ప్రొటీన్ అనుకొని... మ‌రోసారి ఏమాత్రం కొత్త‌ద‌నం లేని క‌థ‌తో కుస్తీ ప‌ట్టాడు. ఇక క‌థ‌లోకి ఎంట‌రైతే...

ప్రేమ జంట‌ల్ని క‌ల‌ప‌డ‌మే పనిగా పెట్టుకొన్న కుర్రాడు... శివ (రామ్‌). ఆ క్ర‌మంలోనే ఓ మినిస్ట‌ర్ కుమార్తె ప్రేమ వివాహాన్ని జ‌రిపిస్తాడు. వాళ్ల మ‌నుషుల నుంచి త‌ప్పించుకొనే క్ర‌మంలో క‌ర్నూలు రైలు ఎక్కుతాడు. మార్గ మ‌ధ్య‌లో అనుకోకుండా త‌నూ (రాశీ ఖ‌న్నా) త‌గులుతుంది.

అప్ప‌టి నుంచీ రాశీఖ‌న్నాతో క‌నెక్ట్ అయిపోతాడు. అంత‌కు ముందే... భోజిరెడ్డి (వినీత్ కుమార్‌) మ‌నుషుల‌తో గొడ‌వ పెట్టుకొంటాడు శివ‌.  భోజిరెడ్డి ప‌రువు కోసం ప్రాణాలు తీసే మ‌నిషి. త‌న ప‌రువు పోయిన చోటే.. శివ‌ని చంపాల‌ని.. శివ కోసం గాలిస్తుంటాడు. మ‌రోవైపు అభి (అభిమ‌న్యుసింగ్‌) త‌ను కోసం గాలిస్తుంటాడు.  భోజిరెడ్డి, అభిమ‌న్యుల టార్గెట్ వీళ్లిద్ద‌రినీ ప‌ట్టుకోవ‌డ‌మే. అయితే అభి.. త‌ను కోసం ఎందుకు గాలిస్తున్నాడు?  శివ ప్రేమ‌ని త‌ను ఒప్పుకొందా?  శివ ఫ్లాష్ బ్యాక్ ఏంటి?  అస‌లు శివ‌మ్ అనే పేరు ఈ సినిమాకి ఎందుకు పెట్టాల్సి వ‌చ్చింది... అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

స్ర‌వంతి మూవీస్ సంస్థ‌ది 30 యేళ్ల అనుభ‌వం. రామ్ వ‌చ్చి దాదాపు ప‌దేళ్లు కావొస్తుంది. ఈ ప్ర‌యాణంలో రామ్ ఏం నేర్చుకొన్నాడో, స్ర‌వంతి మూవీస్ ఏం సాధించిందో అంద‌రికీ తెలిసిందే. ఇంత అనుభ‌వం ఉండీ.. ఇలాంటి సాదా సీదా క‌థ‌ని స్ర‌వంతి మూవీస్ ఎందుకు ఎందుకొందో అర్థం కాదు. ఈకాలంలో కొత్త క‌థల్ని ఆశించ‌డం త‌ప్పే. కానీ ట్రీట్ మెంట్ అయినా కొత్త‌గా ఉండాలి క‌దా..!
ఐ ల‌వ్ యూ చెప్పు అని హీరో.. హీరోయిన్ వెంట‌ప‌డుతుంటాడు!
వాడెక్క‌డున్నా ప‌ట్టుకు రండ్రా... అంటూ విల‌న్లు హీరో వెంట ప‌డుతుంటారు!
అంత‌కు మించిన క‌థ ఈ సినిమాలో ఎంత వెదికినా దొర‌క‌దు. కిక్ సినిమాలో హీరోకి ఓ క్యారెక్ట‌రైజేష‌న్ ఉంటుంది. త‌న కిక్ కోసం హీరో ఏదైనా చేసేస్తుంటాడు. స‌రిగ్గా అదే.. క్యారెక్ట‌రైజేష‌న్ రామ్ పాత్ర‌కు ఆపాదించారన్న విష‌యం ప్రేక్ష‌కుల‌కు స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతూనే ఉంటుంది. లైట‌ర్ కోసం రైల్వే స్టేష‌న్ బ‌య‌ట హీరో.. రౌడీల‌ను చిత‌క‌బాద‌డం చూస్తుంటే.. క‌థ‌ని ఇంత‌కంటే అద్భుతంగా చెప్ప‌లేరా అన్న బాధేస్తుంటుంది. ఇద్ద‌రు విల‌న్లుంటారు. వాళ్ల‌ని ముందు సీన్ల‌లో భీక‌రంగా చూపిస్తుంటారు. త‌ర‌వాత‌. క‌మెడియ‌న్ సైతం వాళ్ల‌తో ఆడుకొంటుంటాడు. విలన్లు బ‌ల‌హీనంగా ఉన్న‌ప్పుడు ఇద్ద‌రున్నా.. రెండు వేల మంది ఉన్నా ఒక్క‌టే. వాళ్ల ముందు పిల్లి కూడా పిల్టీమొగ్గ‌లేస్తుంది. హీరో వెయ్య‌డా?  ఎప్పుడైతే విల‌న్లు హీరో ముందు బ‌ఫూన్ల‌య్యారో.. అక్క‌డే ఈ సినిమా సైడ్‌ట్రాక్ త‌ప్పి... ఎక్క‌డెక్క‌డికో పోయింది.

అస‌లు ఈ సినిమాలో హీరోనే విల‌న్‌గా క‌నిపిస్తుంటాడు. ఎందుకంటే హీరోని చంపాల‌ని.. హీరో తండ్రి సైతం ఎదురుచూస్తుంటాడు. ఇద్ద‌రు విల‌న్ల‌నీ, త‌న స్నేహితుల్ని, హీరోయిన్‌నీ, బ్ర‌హ్మానందాన్నీ, త‌న తండ్రి పోసాని కృష్ణ‌ముర‌ళిని హీరో టార్చ‌ర్ పెడుతున్న‌ట్టు చూపించారు. ఆడియ‌న్స్‌కి హీరో పెట్టిన టార్చ‌ర్ ఎవ‌రికి క‌నిపిస్తుందో?? హీరో ఫ్లాష్ బ్యాక్ కూడా ప‌ర‌మ రొటీన్‌గా సాగింది. అస‌లు హీరో తండ్రి.. హీరోని చంపుదామ‌ని తిర‌గ‌డం ప‌ర‌మ సిల్లీగా ఉంది. ఫైట్ సీన్ల‌లో రామ్ బిల్డ‌ప్పులు త‌ట్టుకోలేం. క్లైమాక్స్‌లో అతి భ‌యంక‌ర‌మైన విల‌న్‌ని త‌న మాట‌ల‌తో క‌న్వెన్స్ చేసి, మంచివాడిగా మార్చ‌డం ఏమాత్రం క‌న్వెన్సింగ్‌గా లేదు.

రామ్ మంచి ఎన‌ర్జిటిక్ హీరో. ఎన్నిసార్లు చెప్పుకొన్నా ఇదే ముక్క‌. ఇప్పుడూ అదే చెప్పుకోవాలి. ఇంకో మార్గం లేదు. రామ్ న‌ట‌న ఏ సినిమా చూసినా ఒకేలా ఉంటుంది. క‌థ‌లే ఒకేలా ఉన్న‌ప్పుడు అలానే న‌టించాలేమో. అయితే డాన్సుల్లో మాత్రం నిజంగానే క‌ష్ట‌ప‌డ్డాడు. చాలా ఈజ్ తో చేశాడు. రాశీ ఖ‌న్నా.. రామ్‌కి అక్క‌లా క‌నిపించింది. బాగా ఒళ్లు చేసేసింది. మ‌రో రెండు సినిమాలు ఇదే ఫిజిక్‌తో క‌నిపిస్తే క‌ష్టం. బ్ర‌హ్మానందం పాత్ర అర‌వ‌డానికి త‌ప్ప ఇంకెందుకూ ఉప‌యోగ‌ప‌డ‌లేదు. విల‌న్ల‌ని స‌రిగా వాడుకోలేదు. స‌ప్త‌గిరి ఒకే అనిపిస్తాడు. హీరో త‌ప్ప‌.. ఇంకెవ్వ‌రూ ఎలివేట్ కాకూడ‌ద‌నేమో... ఎవ‌రి పాత్ర‌కూ అంత ప్రాధాన్యం ఇవ్వ‌లేదు. శ్రీ‌నివాస‌రెడ్డి, ఫిష్ వెంకట్‌ మాత్రం కాస్త బెట‌ర్‌.

దేవిశ్రీ పాట‌లు థియేట‌ర్లో విన‌డానికి ఒకే. మ‌ళ్లీ మ‌ళ్లీ వినాల‌నిపించేంత సీన్ లేదు. ఆర్‌. ఆర్ లోనూ వైవిధ్యం లేకుండా పోయింది. ర‌సూల్ కెమెరా ప‌నిత‌నం ఆక‌ట్టుకొంది. ఎడిటింగ్ లోపాలు ఎక్క‌డక‌క్క‌డ క‌నిపిస్తుంటాయి. లెంగ్తీ సీన్లు ఎన్నో ఉన్నాయ్‌. తొలిసారి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న శ్రీ‌నివాస‌రెడ్డి... త‌డ‌బ‌డిన‌ట్టు స్ప‌ష్టంగా క‌నిపించింది. రొటీన్ క‌థ‌తో, అంతే రొటీన్ స్ర్కీన్ ప్లేతో ఇంత‌కంటే అద్భుతాలు సృష్టించ‌లేమ‌ని కొత్త ద‌ర్శ‌కులు ఇప్ప‌టికైనా తెలుసుకోవాలి.

శివ‌మ్ అనే పేరుకి జ‌స్టిఫికేష‌న్ ఏంటి అని అడిగితే రామ్ చెప్ప‌లేక‌పోయాడు. అయితే.. ఈ సినిమాలో ఎండ్ కార్డ్స్‌కి మాత్రం జ‌స్టిఫికేష‌న్ జ‌రిగింది.
ఇంత‌కీ ఈ సినిమాలో శుభం కార్డుకి బ‌దులుగా ఏం వేశారో తెలుసా..?
`దూల తీరిపోద్ది`.

రేటింగ్: 2/5

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.