ENGLISH | TELUGU  

సవ్యసాచి మూవీ రివ్యూ

on Nov 2, 2018

 

నటీనటులు: నాగచైతన్య, నిధి అగర్వాల్, మాధవన్, భూమిక, భరత్ రెడ్డి, 'వెన్నెల' కిషోర్, 'స్వామి రారా' సత్య, సుదర్శన్, విద్యులేఖ రామన్, తాగుబోతు రమేష్, రావు రమేష్, నాగినీడు తదితరులు
కెమెరా: యువరాజ్
కళ: మౌనిక-రామకృష్ణ
కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు  
సంగీతం: ఎం.ఎం. కీరవాణి  
నిర్మాణ సంస్థ‌: మైత్రీ మూవీ మేకర్స్
నిర్మాత‌లు: నవీన్ యెర్నేని, యలమంచలి రవిశంకర్, మోహన్ చెరుకూరి
కథ, మాటలు, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: చందూ మొండేటి
విడుదల తేదీ: నవంబర్ 2, 2018

శరీరం ఒక్కటే కానీ... అందులో మనుషులు ఇద్దరు వుండటాన్ని 'వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్' కాన్సెప్ట్ అంటార్ట‌... 'సవ్యసాచి' సినిమాలో నాగచైతన్య ఎడమ చేయి అతడి మాట వినదట... వంటి వార్తలు ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తిని పెంచాయి. అందులోనూ చైతన్యకు 'ప్రేమమ్' వంటి సూపర్‌హిట్ ఇచ్చిన అక్కినేని అభిమాని చందూ మొండేటి, మరోసారి చైతన్య హీరోగా దర్శకత్వం వహించిన సినిమా..  ఇప్పటి వరకూ అపజయం అనేది ఎరుగని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన సినిమా కావడంతో 'సవ్యసాచి'పై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఈ రోజు విడుదలైన సినిమా ఆ అంచనాలను నిలబెట్టుకుందా? లేదా? చదవండి!

క‌థ‌: విక్రమ్ (నాగచైతన్య) ఒక యాడ్ ఫిలింమేకర్! విక్ర‌మ్‌లోనే ఆదిత్య (కేవలం ఎడమ చేతిలో మాత్రమే) వుంటాడు. ప్రతి మనిషిలా ఆదిత్యకు అన్ని ఎమోషన్స్ వుంటాయి. అయితే.. వాటిని ఎడమ చేయి ద్వారా మాత్రమే వ్యక్తం చేస్తాడు. దీనివల్ల విక్రమ్‌ వింత వింత పరిస్థితులు ఎదుర్కొంటాడు. అతడికి ఆదిత్య కొన్నిసార్లు అండగా నిలబడితే.. మరికొన్నిసార్లు అడ్డు (ప్రేమ విషయంలో మాత్రమే)గా నిలబడతాడు! - ఇదీ హీరో క్యారెక్టరైజేషన్! కథ విషయానికి వస్తే... విక్రమ్ (నాగచైతన్య) యాడ్ ఫిలింమేకర్. మేనకోడలు మహా (భూమిక కూతురు) అంటే అతడికి ప్రాణం. మహాలో అమ్మను చూసుకుంటాడు. లవర్ చిత్ర (నిధి అగర్వాల్)తో కలిసి ఒక యాడ్ కోసం అమెరికా వెళ్లొచ్చే సరికి గ్యాస్ సిలిండర్ పేలడం వలన సంభవించిన అగ్ని ప్రమాదంలో మహాతో పాటు విక్రమ్ బావ (భూమిక భర్త) కూడా మరణించారని చెబుతారు. కానీ, మహా చావలేదని, ఎవరో కిడ్నాప్ చేశారని విక్రమ్‌కి అర్థమవుతుంది. మహాని కిడ్నాప్ చేసిన అరుణ్ రాజ్ (మాధవన్) ఎవరు? అసలు, ఎందుకు కిడ్నాప్ చేశాడు? విక్ర‌మ్‌కి, అత‌డికి సంబంధం ఏంటి? అనేది మిగతగా సినిమా!

విశ్లేషణ: కథ బావుంది. కాకపోతే కథను చెప్పిన విధానమే బాగోలేదు. సినిమాలో అసలు కథ సెకండాఫ్‌లో స్టార్ట్ అవుతుంది! ఫస్టాఫ్ అంతా లవ్, కామెడీ పేరుతో మరీ సాగదీశారు. అక్కడ వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ కాన్సెప్ట్‌ని సరిగా వాడుకోలేదు. మధ్యలో 'వెన్నెల'కిషోర్ వున్నాడు కాబట్టి సరిపోయింది. లేదంటే మరింత విసుగు వచ్చేది. సెకండాఫ్‌లో కథ మొదలైనప్పటి నుండి ఆసక్తిగా ముందుగా సాగింది. వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ కాన్సెప్ట్‌ని కథకు భలే ఉపయోగించుకున్నారు. కానీ, కథ మంచి రసవత్తరంగా ముందుకు వెళ్తున్న సమయంలో 'నిన్ను రోడ్డు మీద లగ్గాయిత్తు' రీమిక్స్, సుభద్ర పరిణయ నాటకం పెట్టి తప్పు చేశారని అనిపిస్తుంది. దర్శకుడు చందూ మొండేటి కథను, సినిమాను సరిగా హ్యాండిల్ చేయలేకపోయాడు. వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ కాన్సెప్ట్ కూడా 'అపరిచితుడు'కు  ఎక్స్‌టెన్ష‌న్‌లా వుంటుంది. కథలో మంచి మంచి సన్నివేశాలు వున్నప్పటికీ... అందులో ఎమోషన్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా తీయడంలో దర్శకుడు విఫలమయ్యాడు. అయితే... అక్కినేని అభిమానులు కోరుకునే కొన్ని కొన్ని అంశాలును బాగా తీశాడు. 'నిన్ను రోడ్డు మీద చూసినది లగ్గాయిత్తు' పాట, కాలేజీలో పంచెకట్టులో నాగచైతన్య చేసే ఫైట్ అభిమానులకు ఆనందాన్ని ఇస్తాయి. మైత్రీ మూవీ మేకర్స్ ఖర్చు విషయంలో రాజీ పడలేదు. ఆర్ట్ డైరెక్టర్స్ మౌనిక, రామకృష్ణ పనితీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. చైతన్య ఆఫీస్, మాధవన్ హౌస్ సెట్స్ అద్భుతంగా వున్నాయి.   

నటీనటుల పనితీరు: నాగచైతన్య పాత్రకు తగ్గట్టు నటించాడు. క్యారెక్టర్ ఆసక్తికరంగా వుండటంతో మాంచి జోష్‌లో చేసుకుంటూ వెళ్ళాడు.డ్యాన్సులు బాగా చేశాడు.  నటుడిగా మాధవన్ ప్రతిభ గురించి కొత్తగా చెప్పేది ఏముంది? ప్రతినాయకుడి పాత్రలోనూ అద్భుతంగా నటించగలనని ఈ సినిమాతో చెప్పాడు. నిధి అగర్వాల్ పాత్ర చిన్నదే. అందులో అందంగా కనిపించింది. అక్కగా భూమికకు చక్కటి పాత్ర చేసే ఆవకాశం వచ్చింది. 'వెన్నెల' కిషోర్, సత్య కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు కాస్త నవ్వించాయి. 'షకలక' శంకర్ ఎపిసోడ్ పర్వాలేదు.

ప్లస్ పాయింట్స్:

నాగచైతన్య, మాధవన్ నటన
'వెన్నెల' కిషోర్ కామెడీ,
స్టోరీ కాన్సెప్ట్
'నిన్ను రోడ్డు మీద చూసినది లగ్గాయిత్తు' సాంగ్, 'సవ్యసాచి' టైటిల్ సాంగ్    

మైనస్ పాయింట్స్:

ఫస్టాఫ్
దర్శకత్వం

చివరగా: ముందుగా చెప్పుకున్నట్టు కాన్సెప్ట్ బావుంది. దర్శకుడు చందూ మొండేటి కథను రాసుకున్న విధానం బావుంది. కానీ, తీసిన విధానమే బాగోలేదు. అక్కినేని అభిమానులను అలరించే అంశాలను కథలో చక్కగా చూపించిన అతను, ప్రేక్షకులందరికీ కనెక్ట్ అయ్యేలా కథను చెప్పలేకపోయాడు. నాగచైతన్య, మాధవన్... ఇద్దరి నటన సినిమాకు కొండంత బలం! వారిద్దరి కోసం, కాసిన్ని నవ్వుల కోసం సినిమాకు వెళ్ళవచ్చు.

రేటింగ్: 2/5

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.