సాయి పల్లవికి అంత సీను ఉందా?
on Jul 27, 2017
‘ఫిదా’విడుదలైనప్పట్నుంచీ... సాయి పల్లవి ఫివర్లో ఉండిపోయారు కుర్రాళ్లు. ఫేస్ బుక్ లో పోస్టులన్నీ కూడా ఆమె రిలేటెడ్ గానే ఉంటున్నాయి. చివరు ‘భానుమతి చెప్పు’ అని ఆ సినిమాలో సాయి పల్లవి తొడుక్కున్న చెప్పును కూడా ఫేస్ బుక్కుల్లో పోస్ట్ చేసుకుంటున్నారంటే.. యూత్ ని సాయి పల్లవి ఏ స్థాయిలో ‘ఫిదా’ చేసిందో అర్థం చేసుకోవచ్చు. ‘ఫిదా’లోని భానుమతి పాత్రను తన అభినయంతో ఆకాశమంత ఎత్తులో నిలబెట్టిన సాయి పల్లవికి... కమర్షియల్ హీరోయిన్ గా కూడా రాణించగలిగే కెపాసిటీ ఉందా? ఇప్పుడు చాలామంది క్రిటిక్స్ లో వినిపిస్తున్న ప్రశ్న ఇది. ఎందుకంటే... సాయి పల్లవి ఫిజిక్ కావొచ్చు, ముఖ కవళికలు కావచ్చు... అభినయం కావచ్చు... యాటిట్యూడ్ కావొచ్చు... ఇవన్నీ మధ్య తరగతి అమ్మాయిని తలపించేలా ఉంటాయి. మరి ప్రస్తుతం ఉన్న హీరోయిన్ల పోకడలు అందుకు భిన్నం. అధునిక భావాలున్న అమ్మాయిల పాత్రలే తెరపై ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఇప్పుడు టాప్ హీరోయిన్లుగా కొనసాగుతున్న సమంత, కాజల్, తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్, రెజీనా, రాశీఖన్నా... తదితర తారలందరూ అలాంటి పాత్రల్లోనే ఎక్కువగా కనిపించారు... కనిపిస్తున్నారు కూడా. మరి సాయి పల్లవి.. అలాంటి పాత్రలు చేసి మెప్పించగలదా? ఈ అనుమానాలన్నింటికీ.. సాయి పల్లవి సరైన సమాధానం ఇస్తుందని నమ్మేవాళ్ల సంఖ్య కూడా ఎక్కువ గానే ఉంది. ఇప్పటికే నాగశౌర్య సరసన ఈ ముద్దుగుమ్మ నటించిన చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. నాని ‘ఎంసీఏ’లో కూడా సాయిపల్లవే కథానాయిక. ఈ రానున్న సినిమాలు సాయి పల్లవి సత్తా ఏంటో తెలియజేయాలని ఆశిద్దాం.