'శాకిని డాకిని'ని పట్టించుకోని దర్శకుడు!
on Sep 14, 2022

సినిమా విడుదలకు ముందు ప్రమోషన్స్ అనేవి చాలా కీలకం. ప్రధాన తారాగణంతో పాటు దర్శకులు కూడా ముందుండి ప్రమోషన్స్ లో పాల్గొంటూ ఉంటారు. అయితే 'శాకిని డాకిని' విషయంలో మాత్రం డైరెక్టర్ సుధీర్ వర్మ ఎందుకనో తెర వెనకే ఉండిపోతున్నాడు. రెజీనా కాసాండ్రా, నివేదా థామస్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సురేష్ బాబు, సునీత తాటి నిర్మాతలు. సుధీర్ వర్మ దర్శకత్వంలో వస్తున్న ఐదో సినిమా ఇది. అయితే ఆయన డైరెక్ట్ చేసిన సినిమా ప్రమోషన్స్ లోనే ఆయన ఎక్కడా కనిపించడం లేదు. రీసెంట్ గా జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్ లో సైతం ఆయన పాల్గొనలేదు. దీంతో అసలు ఏం జరిగిందన్న చర్చలు జరుగుతున్నాయి.
'మిడ్ నైట్ రన్నర్స్' అనే కొరియన్ ఫిల్మ్ కి రీమేక్ గా వస్తున్న 'శాకిని డాకిని' షూటింగ్ సెకండ్ వేవ్ టైంలో జరిగింది. అయితే సినిమా విడుదల మాత్రం ఆలస్యమవుతూ వచ్చింది. ఈలోపు రవితేజతో చేస్తున్న 'రావణాసుర'తో బిజీ అయిపోయాడు డైరెక్టర్ సుధీర్. వర్క్ విషయంలో చాలా స్పీడ్ గా ఉంటాడనే పేరున్న సుధీర్ కి 'శాకిని డాకిని' నిర్మాతలతో విభేదాలు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. 'శాకిని డాకిని'ని పూర్తి చేసి 'రావణాసుర'తో బిజీ అయిన సుధీర్ ని మళ్ళీ రీషూట్ అంటూ పిలిచారట. స్వతహాగా రీషూట్స్ నచ్చని సుధీర్ తనకు కుదరదని చెప్పాడట. దాంతో నిర్మాతలతో విభేదాలు తలెత్తాయని, అందుకే 'శాకిని డాకిని' ప్రమోషన్స్ లో ఎక్కడా ఆయన కనిపించడం లేదని అంటున్నారు.
'శాకిని డాకిని' ప్రమోషన్స్ లో సుధీర్ పాల్గొనకపోవడంపై మరో ప్రచారం కూడా జరుగుతోంది. కేవలం ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసి అవుట్ పుట్ ఇచ్చేలా సుధీర్ డీల్ చేసుకున్నాడని, అందుకే విడుదలకు ముందే మరో సినిమాతో బిజీ అయిపోయాడని టాక్. మరోవైపు 'శాకిని డాకిని'తో పోల్చితే 'రావణాసుర' పెద్ద ప్రాజెక్ట్. పైగా చిత్రీకరణ చివరి దశలో ఉన్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే 'రావణాసుర' నిర్మాతలకు ఇచ్చిన కమిట్ మెంట్ ప్రకారం.. ప్రస్తుతం 'శాకిని డాకిని' కంటే సుధీర్ వర్మ ఆ చిత్రానికే ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నట్లు తెలుస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



