ప్రభాస్ రిజెక్ట్ చేసిన 'యజ్ఞం'తో గోపీచంద్ హిట్ కొట్టాడు
on Jun 30, 2022

'తొలివలపు' సినిమాతో టాలీవుడ్ కి హీరోగా పరిచయమైన గోపీచంద్.. 'జయం', 'నిజం', 'వర్షం' సినిమాలలో విలన్ గా నటించి మెప్పించాడు. అలా తక్కువ టైంలోనే పవర్ ఫుల్ విలన్ గా గుర్తింపు తెచ్చుకున్న గోపీచంద్ మళ్ళీ 'యజ్ఞం' సినిమాతో హీరోగా మారాడు. ఆ సినిమా భారీ విజయం సాధించి సక్సెస్ ఫుల్ హీరోగా ఎదిగాడు. అయితే నిజానికి అసలు మొదట 'యజ్ఞం' ప్రాజెక్ట్ ప్రభాస్ దగ్గరకు వెళ్లిందట.
గోపీచంద్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'పక్కా కమర్షియల్' రేపు(జులై 1న) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో తాజాగా ఈటీవీలో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా షోలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. "తొలివలపు సక్సెస్ కాకపోవడంతో ఆరేడు నెలలు అసలు అవకాశాలు రాలేదు. ఆ సమయంలో ఒకసారి తేజ ఫోన్ చేసి ఒక సీన్ చెప్పి విలన్ గా చేస్తావా అని అడిగారు. వెంటనే చేస్తానని చెప్పాను. అలా వరుసగా మూడు సినిమాల్లో విలన్ గా చేశాను. ఆ సినిమాలే నన్ను మాస్ లోకి తీసుకెళ్లాయి" అని గోపి అన్నాడు.
"యజ్ఞం సినిమా అవకాశం అనుకోకుండా వచ్చింది. అది నాకోసమని రాసిన కథ కాదు. ఫస్ట్ ప్రభాస్ కి చెప్పారు. ఆ తర్వాత కళ్యాణ్ రామ్ కి చెప్పారు. అయితే వారికి కథ నచ్చింది కానీ, ఆ సినిమా డైరెక్టర్ ఏ.ఎస్.రవికుమార్ మొదటి సినిమా పెద్దగా ఆడకపోవడంతో డైరెక్టర్ ని మార్చాలని వాళ్ళు చెప్పారు. కానీ పోకూరి బాబురావు రావు బాబాయ్ ఆ దర్శకుడితోనే చేయాలని ఫిక్స్ అయ్యారు. అప్పుడు ఆయనతో ఎవరో అన్నారంట వాళ్ళు వీళ్ళు ఎందుకు.. మనోడు(గోపి)తో చేయొచ్చుగా అని.. అలా యజ్ఞం సినిమా అవకాశమొచ్చింది" అని గోపీచంద్ చెప్పుకొచ్చాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



