రవితేజ బర్త్ డేకి ఖిలాడి ట్రీట్ అదే!
on Jan 20, 2021
రాజా ది గ్రేట్ తరువాత ట్రాక్ తప్పిన మాస్ మహారాజా రవితేజ కెరీర్.. ఈ సంక్రాంతి బ్లాక్ బస్టర్ క్రాక్ తో మళ్ళీ సక్సెస్ రూట్ లోకి వచ్చేసింది. ఒకవైపు ఈ ఘనవిజయాన్ని ఆస్వాదిస్తూనే.. మరోవైపు ఖిలాడి చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్నారు రవితేజ. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ వైజాగ్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో రవితేజ రెండు విభిన్న పాత్రల్లో దర్శనమివ్వనున్నారు.
ఇదిలా ఉంటే.. జనవరి 26 రవితేజ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఖిలాడి టీజర్ రాబోతుందంటూ ఆ మధ్య ప్రచారం సాగింది. అయితే, ఆ రోజు టీజర్ కాకుండా గ్లిమ్స్ ఆఫ్ ఖిలాడి పేరిట ఓ వీడియో రాబోతోంది. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు రమేష్ వర్మ తాజాగా తన ట్విట్టర్ లో ప్రకటించాడు. మాస్ మహారాజా రవితేజ బర్త్ డే స్పెషల్ గా గ్లిమ్స్ ఆఫ్ ఖిలాడి రాబోతుందంటూ అప్ డేట్ ఇచ్చేశాడు. మరి.. ఈ గ్లిమ్స్ లో ఏముంటుందో తెలియాలంటే జనవరి 26 వరకు వేచిచూడాల్సిందే.
ఖిలాడిలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి నాయికలుగా నటిస్తుండగా.. దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నాడు.