మెగాస్టార్ చిత్రంలో శివగామి!
on Sep 16, 2021
కథానాయికగా స్టార్ డమ్ చూసిన వెటరన్ యాక్ట్రస్ రమ్యకృష్ణ.. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ తనదైన ముద్ర వేస్తున్నారు. మరీముఖ్యంగా.. `బాహుబలి` సిరీస్ లో రమ్య పోషించిన శివగామి పాత్ర జాతీయ స్థాయిలో ఆమెకి గుర్తింపుని తీసుకువచ్చింది. ఆ తరువాత `సోగ్గాడే చిన్ని నాయనా`లో తన లక్కీ హీరో, కింగ్ నాగార్జున సరసన అలరించిన రమ్యకృష్ణ.. ప్రస్తుతం ఆ సినిమా సీక్వెల్ `బంగార్రాజు`లోనూ నటిస్తున్నారు. అలాగే `రిపబ్లిక్`, `లైగర్` వంటి సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారామె.
ఇదిలా ఉంటే.. తాజాగా రమ్యకృష్ణ మరో క్రేజీ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఆ వివరాల్లోకి వెళితే.. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా కె.ఎస్. రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ బిగ్ టికెట్ ఫిల్మ్ లో రమ్యకృష్ణ ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నారని సమాచారం. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
కాగా, కెరీర్ ఆరంభంలో చిరుకి చెల్లెలిగా `చక్రవర్తి` (1987)లో నటించిన రమ్యకృష్ణ.. ఆపై `ముగ్గురు మొనగాళ్ళు`(1994), `అల్లుడా.. మజాకా!`(1995), `ఇద్దరు మిత్రులు` (1999)చిత్రాల్లో నాయికగా ఆడిపాడారు. చివరిసారిగా `అంజి`(2004)లో ఇంట్రోసాంగ్ కోసం చిరుతో జట్టుకట్టారు. దాదాపు పద్దెనిమిదేళ్ళ తరువాత చిరు చిత్రంలో కనిపించనున్న రమ్యకృష్ణ.. ఈ సారి ఎలాంటి వేషంలో ఎంటర్టైన్ చేస్తారో చూడాలి.