ఆలస్యంగా సినిమా వేసినందుకు హైదరాబాద్‌లోని థియేటర్‌కు భారీ జరిమానా!
on Dec 18, 2021

సినిమా చూడాలని ఎంతో ఆశగా టికెట్ కొనుక్కొని థియేటర్ కి వెళ్లి కూర్చుంటే.. ఒక్కోసారి టైమ్ దాటిపోతున్నా షో స్టార్ట్ చేయకుండా10-15 నిమిషాల పాటు యాడ్స్ వేసి ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంటారు థియేటర్ నిర్వాహకులు. మనసులో తిట్టుకుంటూ ఆలస్యంగానే సినిమా చూసి బయటకు రావడం తప్ప.. దీని గురించి ఫిర్యాదు చేయాలన్న ఆలోచన పెద్దగా ఎవరికీ రాదు. కానీ ఒక వ్యక్తి మాత్రం షో ఆలస్యంగా వేసి తన విలువైన సమయాన్ని వృధా చేశారంటూ.. హైదరాబాద్ లోని ఓ థియేటర్ యాజమాన్యంపై ఫిర్యాదు చేసి, భారీ జరిమానా పడేలా చేశాడు.
Also Read: రాజమౌళి దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్!
హైదరాబాద్ లోని తార్నాకకు చెందిన విజయ్ గోపాల్ అనే వ్యక్తి 2019 జూన్ 22న 'గేమ్ ఓవర్' అనే సినిమా చూడడానికి కాచిగూడ క్రాస్ రోడ్స్‌లోని ఐనాక్స్ థియేటర్ కు వెళ్లాడు. టికెట్ పై ముద్రించిన సమయం ప్రకారం సాయంత్రం 4:30 గంటలలకు ప్రారంభం కావాల్సి ఉండగా.. 4:45 గంటలకు సినిమా ప్రారంభమైంది. 15 నిమిషాలు ప్రకటనలు వేసి తన సమయం వృథా చేశారంటూ విజయ్ గోపాల్ థియేటర్ మేనేజర్ కు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో.. హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్ కు ఆయన ఫిర్యాదు చేశాడు.
Also Read: పుష్ప.. అంచనాలను మించి ఫస్ట్ డే వసూళ్లు రాబట్టిన హిందీ వెర్షన్!
అయితే, తెలంగాణ సినిమాస్ రెగ్యులేషన్ చట్టం-1955 ప్రకారం పాత పద్ధతిని అనుసరిస్తూనే ప్రకటనలు వేస్తున్నట్లు థియేటర్ యాజమాన్యం సమర్థించుకునే ప్రయత్నం చేసింది. ఆర్టికల్ 19(1)(జీ), (ఏ) ప్రకారం తమకు ప్రకటనలు వేసే హక్కు ఉందని తెలిపింది. అయితే, ఐనాక్స్ సంస్థ వాదనలను వినియోగదారుల ఫోరం తప్పుపట్టింది. తెలంగాణ సినిమాస్ రెగ్యులేషన్ చట్టం-1970, రూల్ నెం. 41 ప్రకారం కేవలం 5 నిమిషాలు మాత్రమే ఉచిత ప్రకటనలు వేసే హక్కు ఉందని, వాణిజ్య ప్రకటనలు వేయడం నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది. ఫిర్యాదుదారుడికి పరిహారంగా రూ.5వేలు, కేసు ఖర్చుల కింద మరో రూ.5వేలు చెల్లించాలని.. అంతేగాక, లైసెన్సింగ్ అథారిటీ అయిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కి పెనాల్టీ కింద రూ.లక్ష చెల్లించాలని ఆదేశించింది. ఈ డబ్బును థియేటర్లలో భద్రతకు, విపత్తు నిధిగా వినియోగించాలని కమిషనర్ కార్యాలయానికి సూచించింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



