లక్ష్మీస్ ఎన్టీఆర్... వర్మ పంట పండినట్టే!
on Feb 27, 2019
నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తూ, నిర్మించిన 'యన్.టి.ఆర్' బయోపిక్ రెండు భాగాలూ విడుదలయ్యాయి. మహానాయకుడు విడుదల తరవాత కథానాయకుడు కాస్తో కూస్తో పర్వాలేదని టాక్ వచ్చింది. ఎవరూ ఊహించని రీతిలో రెండు భాగాలూ ప్రేక్షకుల తిరస్కరణకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ తీసిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్'పై అందరి చూపూ పడింది. ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ఎప్పుడు విడుదలవుతుందా? సినిమాలో వర్మ ఏం చూపించి వుంటాడా? అని సర్వత్రా చర్చ జరుగుతోంది. మార్చి రెండో వారంలో ఈ సినిమాను విడుదల చేయాలని వర్మ డిసైడ్ అయ్యాడని తెలిసింది. 'లక్ష్మీస్ ఎన్టీఆర్' మార్చి 15న ప్రేక్షకుల ముందుకు వస్తుందట. అదే జరిగితే వర్మ పంట పండినట్టే. ప్రస్తుతానికి ఆ రోజున ఇతర సినిమాలేవీ విడుదల కావడం లేదు. వర్మ సినిమాకు సోలో రిలీజ్ దొరుకుతుంది. 'యన్.టి.ఆర్ - మహానాయకుడు'కి సోలో రిలీజ్ దొరకలేదు. ఆ సినిమాకు పోటీగా నయనతార 'అంజలి సిబిఐ' విడుదలైంది. చిన్న సినిమాలు మూడు నాలుగు వచ్చాయి. 'లక్ష్మీస్ ఎన్టీఆర్'కి మాత్రం భలే కలిసివచ్చింది. ప్రస్తుతం థియేటర్లలో హిట్ సినిమాలు లేకపోవడంతో ఓపెనింగ్స్ బాగా వస్తాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.