ప్రభాస్ ఒకేసారి ఇన్ని సినిమాలు ఎలా చేస్తున్నాడు..?
on Feb 26, 2025

ఒకప్పుడు స్టార్ హీరోలు వరుసగా సినిమాలు చేసుకుంటూ పోయేవారు. ఏడాదికి అర డజను నుంచి డజను వరకు సినిమాలు విడుదల చేసేవారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. స్టార్ హీరో నుంచి ఏడాదికి ఒక సినిమా వస్తే గొప్ప అన్నట్టుగా ఉంది. ప్రస్తుత పాన్ ఇండియా ట్రెండ్ లో ఒక్కో సినిమాకి రెండు మూడేళ్లు కూడా పడుతుంది. అయినప్పటికీ అందరి కంటే ముందే 'బాహుబలి'తో పాన్ ఇండియా స్టార్ గా అవతరించిన ప్రభాస్ మాత్రం.. వరుస సినిమాలు చేస్తూ అందరినీ సర్ ప్రైజ్ చేస్తున్నాడు. (Prabhas)
2022 నుంచి గమనిస్తే, ప్రభాస్ నుంచి ఏడాదికి కనీసం ఒక సినిమా అయినా వస్తుంది. 2022లో రాధేశ్యామ్, 2023లో ఆదిపురుష్, సలార్, 2024లో కల్కి సినిమాలతో ప్రభాస్ అలరించాడు. ఈ ఏడాది ప్రభాస్ అతిథి పాత్రలో నటించిన 'కన్నప్ప' విడుదల కానుంది. అలాగే మారుతి దర్శకత్వంలో చేస్తున్న 'ది రాజా సాబ్' కూడా ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుంది.
'రాజా సాబ్'తో పాటు ప్రభాస్ చేతిలో పలు భారీ ప్రాజెక్ట్ లు ఉన్నాయి. హను రాఘవపూడి డైరెక్షన్ లో 'ఫౌజీ' సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ప్రస్తుతం 'రాజా సాబ్', 'ఫౌజీ' షూటింగ్ దశలో ఉన్నాయి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'స్పిరిట్' మూవీ కమిటై ఉన్నాడు. అలాగే 'సలార్-2', 'కల్కి-2' కూడా లైన్ లో ఉన్నాయి. ఇవి చాలవు అన్నట్టు హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ లో 'సలార్-2'తో పాటు మరో రెండు సినిమాలు సైన్ చేశాడు ప్రభాస్. వాటిలో ఒకటి ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేయనున్న 'బ్రహ్మ రాక్షస' కాగా, రెండోది లోకేష్ కనగరాజ్ ప్రాజెక్ట్ అని వినికిడి. అంతేకాదు, ఒక బాలీవుడ్ డైరెక్టర్ తో సైతం సినిమా చేయడానికి చర్చలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంటే ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఏకంగా ఎనిమిది భారీ ప్రాజెక్ట్ లు ఉన్నాయి అన్నమాట.
పాన్ ఇండియా ఇమేజ్ పొందిన ఇతర స్టార్స్.. ఒక్కో సినిమా స్టార్ట్ చేయడానికే చాలా సమయం తీసుకుంటున్నారు. పైగా ఒక సినిమా పూర్తయిన తర్వాతే, మరో సినిమా మొదలు పెడుతున్నారు. అలాంటిది ప్రభాస్ మాత్రం.. ఒకేసారి రెండు మూడు భారీ ప్రాజెక్ట్ లు చేస్తూ, మరికొన్ని భారీ ప్రాజెక్ట్ లను లైన్ లో పెట్టడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అసలు ఒకేసారి ఇన్ని భారీ సినిమాలు చేయడం ఎలా సాధ్యమవుతుందని అందరూ సర్ ప్రైజ్ అవుతున్నారు. అయితే ప్రభాస్ పర్సనల్ లైఫ్ ని కూడా పక్కన పెట్టి, పూర్తి సమయాన్ని సినిమాలకే కేటాయిస్తున్నాడని సన్నిహిత వర్గాల మాట. ఇంట్లో కంటే సినిమా సెట్స్ లోనే ఎక్కువగా ఉంటున్నాడని, అందుకే ఇలా వరుస సినిమాలు చేయడం సాధ్యమవుతుందని అంటున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



