పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఆ క్రేజ్ వేరు, ఆ రేంజ్ వేరు!
on Sep 1, 2022

మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా 1996లో వచ్చిన 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాతో హీరోగా పరిచయమైన పవన్ కళ్యాణ్.. పవర్ స్టార్ గా ఎదగడానికి ఎంతో సమయం పట్టలేదు. తనదైన స్క్రీన్ ప్రజెన్స్, బాడీ ల్యాంగ్వేజ్ తో యూత్ ని కట్టిపడేశాడు. అద్భుతమైన స్క్రిప్ట్ సెలక్షన్ తో కెరీర్ స్టార్టింగ్ లోనే డబుల్ హ్యాట్రిక్ సాధించి సంచలనం సృష్టించాడు. 'గోకులంలో సీత', 'సుస్వాగతం', 'తొలిప్రేమ', 'తమ్ముడు', 'బద్రి', 'ఖుషి' ఇలా వరుస విజయాలతో పవన్ క్రేజ్ ఆకాశాన్నంటింది. ఆయన సాంగ్స్, డైలాగ్స్, మేనరిజమ్స్, హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ స్టైల్.. ఇలా ఒక్కటేమిటి? అప్పట్లో యూత్ లో ఎక్కడ చూసినా పవన్ మేనియానే కనిపించేది. హీరోగా పరిచయమైన ఆరేళ్లలోనే ఎవరూ కలలో కూడా ఊహించనంత క్రేజ్ ఆయన సొంతమైంది.

ఎంతటి స్టార్ హీరోకైనా వరుస ఫ్లాప్ లు పడితే క్రేజ్ తగ్గిపోతుంది. కానీ పవన్ విషయంలో అది వర్తించదు. పదేళ్ళపాటు సరైన హిట్ లేకుండా వరుస ఫ్లాప్ లు పడినా ఆయన క్రేజ్ అంతకంతకు పెరుగుతూ వచ్చింది. 2001లో వచ్చిన 'ఖుషి' తర్వాత 2011 వరకు పదేళ్ళలో హీరోగా తొమ్మిది సినిమాలు చేశాడు పవన్. అందులో 'జల్సా' మినహా మిగతా అన్ని సినిమాలు ఘోర పరాజయం పాలయ్యాయి. అయినా పవన్ క్రేజ్ ఇంచు కూడా తగ్గకపోగా ఎన్నో రెట్లు పెరగటం విశేషం. ఇక 2012లో వచ్చిన 'గబ్బర్ సింగ్'తో అభిమానుల పదేళ్ళ దాహాన్ని తీర్చాడు పవన్. ఈ సినిమాతో 'వన్ మ్యాన్ షో' అనే దానికి అసలుసిసలైన అర్థాన్ని చెప్పాడు. అప్పట్లోనే రూ.60 కోట్లకు పైగా షేర్ రాబట్టి పవర్ స్టార్ బాక్సాఫీస్ స్టామినా ఏంటో తెలిసేలా చేసింది ఈ చిత్రం.

విడుదలకు ముందే సినిమా లీక్ అయినా, ఓ సాధారణ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో ఇండస్ట్రీ హిట్ కొట్టడం ఒక్క పవన్ కే సాధ్యమవుతుందంటే అతిశయోక్తి కాదేమో. 2013లో పవన్ నటించిన 'అత్తారింటికి దారేది' మూవీ రిలీజ్ కి ముందే హెచ్.డీ ప్రింట్ ఆన్ లైన్ లో లీక్ అయింది. దీంతో అసలు ఈ సినిమా చూడటానికి జనాలు థియేటర్లకు వస్తారా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ పవన్ స్టార్ డమ్ ఆ అనుమానాలను పటాపంచలు చేసింది. ఆ సినిమా ఏకంగా రూ.75 కోట్ల షేర్ రాబట్టి, అప్పటిదాకా ఉన్న రికార్డులు అన్నింటినీ తుడిచేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

'అత్తారింటికి దారేది' మాత్రమే కాదు.. కేవలం పవన్ స్టార్ డమ్ తో కోట్ల కలెక్షన్స్ రాబట్టిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. పాలిటిక్స్ లో బిజీ అయ్యి, సినిమాలకు చిన్న బ్రేక్ ఇచ్చినా పవన్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. కరోనా, తక్కువ టికెట్ ధరలు వంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా 'వకీల్ సాబ్', 'భీమ్లా నాయక్' వంటి రీమేక్ సినిమాలతో ఏకంగా రూ.90 కోట్ల షేర్ రాబట్టాడంటేనే పవన్ బాక్సాఫీస్ స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు.

పవన్ కి కేవలం సినిమాలు చూసే కాకుండా ఆయన మంచితనం, సేవాగుణం చూసి అభిమానులు అయినవాళ్లు ఎందరో ఉన్నారు. అందుకే ఎన్ని పరాజయాలు వచ్చినా ఆయన క్రేజ్ తగ్గట్లేదు.. తగ్గదు కూడా. ప్రస్తుతం ఆయన 'హరిహర వీరమల్లు' అనే పీరియాడికల్ యాక్షన్ ఫిల్మ్ లో నటిస్తున్నాడు. ఇది ఆయన నటిస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా కావడం విశేషం. ఈ సినిమాతో పవన్ నేషనల్ వైడ్ గా తన పేరు మారుమోగిపోయేలా చేస్తాడని ఆశిస్తూ 'తెలుగు వన్' తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు.
(సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు)
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



