ENGLISH | TELUGU  

పిట్ట‌గోడ‌ మూవీ రివ్యూ

on Dec 24, 2016

పెళ్లి చూపులు లాంటి సినిమాల‌తో చిన్న సినిమాపై గౌర‌వం పెరిగింది. అయితే ప్ర‌తీసారీ ఆ అద్భుతాలు సాధ్యం కావు. కొత్త వాళ్ల‌తో సినిమాలు తీయ‌డంలో ఎంత సౌల‌భ్యం ఉంటుందో అంత రిస్కూ క‌నిపిస్తుంటుంది. వాళ్ల ఆలోచ‌న‌లు బాగానే ఉన్నా... వాటిని తెర‌పై ఆవిష్క‌రించ‌డంలో త‌డ‌బ‌డుతుంటారు.  ఏదో చెప్పాల‌నుకొని, ఇంకేదో చూపించి, మ‌రేదో చెబుతారు. ఇలాంటి క‌న్‌ఫ్యూజ్‌లు సాధార‌ణంగా కొత్త ద‌ర్శ‌కుల్లోనే క‌నిపిస్తుంటాయి. 'పిట్ట‌గోడ‌' చూసినా అదే అనిపిస్తుంది. ద‌ర్శ‌కుడిలో టాలెంట్ ఉన్నా.. దాన్ని ఎగ్జిక్యూట్ చేసే విధానంలోనే ఎక్క‌డో లోపం ఉంద‌నిపిస్తుంది. మ‌రి ద‌ర్శ‌కుడు అనుకొన్న‌దేంటి?  తీసిందేంటి?  నిజానికి పిట్ట‌గోడ ఎక్కి క‌బుర్లు చెప్పుకొంటున్న ఆ తొట్టి గ్యాంగ్ సంగ‌తేంటి?  ఇవ‌న్నీ తెలుసుకోవాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.  

* క‌థ‌

అది గోదావ‌రి ఖ‌ని. ఆ ఊర్లో స్ట్రైక‌ర్స్ బ్యాచ్ అన‌బ‌డే టిప్పు, వేణు, నాగ‌రాజు, జ్ఞానేశ్వ‌ర్.. శుద్ధ ఆవారాగాళ్లు. పొద్దున్నే లేచి... ఆ వీధి చివ‌ర‌న ఉన్న పిట్ట‌గోడ ఎక్కి క‌బ‌ర్లు చెప్పుకోవ‌డం, ఏ అర్థరాత్రో ఇంటికి చేరుకోడం.. ఇదీ వాళ్ల దిన‌చ‌ర్య‌. ఈ బ్యాక్ మొత్తానికి లీడ‌ర్ టిప్పు (విశ్వ‌దేవ్ రాచ‌కొండ‌). ఆ కాల‌నీకి కొత్త‌గా వ‌చ్చిన దివ్య (పున‌ర్న‌వి)ని చూసి ఇష్ట‌ప‌డ‌తాడు. దివ్య కూడా టిప్పు మంచి త‌నం చూసి అత‌నికి చేరువు అవుతుంది. ఊర్లో వాళ్లంతా త‌మ‌ని మ‌రీ ప‌నికి రాని బ్యాచ్ అనుకొంటున్నారని, ఏదో ఒక‌టి చేయాల‌ని ఫిక్స‌వుతారు. అప్పుడే క్రికెట్ టోర్న‌మెంట్ ఐడియా పుట్టుకొస్తుంది. మండ‌ల్ స్థాయి టోర్నీ ని నిర్వ‌హిస్తే త‌మ పేరు పేప‌ర్లో ప‌డుతుంద‌ని అనుకొంటారు. టోర్నీకి అన్ని ముస్తాబులు చేసుకొంటారు. అయితే.. పోలీస్ ప‌ర్మిష‌న్ మాత్రం రాదు. అందుకోసం ఓ లోక‌ల్ లీడ‌ర్‌ని క‌లుస్తారు. ఆ లీడ‌ర్ వ‌ల్లే పోలీసుల ప‌ర్మిష‌న్ దొరుకుతుంది. అందుకే లీడ‌ర్ సూచించిన 'దినేష్‌' పేరుని ఈ టోర్న‌మెంట్‌కి పెడ‌తారు. దినేష్ అనే పేరు విన‌గారు.. దివ్య కంగారు ప‌డుతుంది. దినేష్‌కీ, దివ్య‌కీ ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంద‌ని గ్ర‌హిస్తాడు టిప్పు. అదేంటో తెలుసుకొనే ప్ర‌య‌త్నాలు మొద‌లెడ‌తాడు. ఆ ప్ర‌యాణంలో త‌న‌కు కొన్ని నిజాలు తెలుస్తాయి. దాంతో టోర్న‌మెంట్ మొత్తాన్ని ఆపేస్తాడు. డ‌బ్బులు తీసుకొని త‌మ‌ని మోసం చేశార‌ని ఆ ఊర్లో కుర్రాళ్లు టిప్పు బ్యాచ్‌పై కేసు వేస్తారు. ఓ మంచి ప‌ని చేసి పేప‌ర్ల‌లో ఫొటో చూసుకోవాల‌ని ఆశ ప‌డిన స్ట్ర‌యిక‌ర్స్ టీమ్ పేరు... మ‌రోలా పేప‌ర్లో వ‌స్తుంది. దాంతో వీళ్లంద‌రి క‌థ మ‌లుపు తిరుగుతుంది. ఇంతక దివ్య‌కీ దినేష్‌కీ మ‌ధ్య ఉన్న లింక్ ఏమిటి?  స్ట్ర‌యిక‌ర్స్ బ్యాచ్ త‌మ ఉనికిని కాపాడుకోవ‌డానికి ఏం చేశారు?  టిప్పు - దివ్య‌ల ప్రేమ‌క‌థ ఏమైంది?  అనేదే పిట్ట‌గోడ క‌థ‌.

* విశ్లేష‌ణ‌

పిట్ట‌గోడ పేరుకు త‌గ్గ‌ట్టు ఇదేం పిట్ట క‌థ కాదు. ట్విస్టులు, ట‌ర్న్‌లూ ఉన్నాయి. అయితే.. దాన్ని రాసుకొన్న విధానం, చూపించిన ప‌ద్ధ‌తి జ‌న‌రంజ‌కంగా లేవు. పిట్ట‌గోడ సినిమానీ, క‌థ‌నీ ప్రారంభించిన విధానం బాగానే ఉంటాయి. మ‌రో ఫ్రెష్ ఫ్రెండ్ షిప్ & ల‌వ్ స్టోరీ చూస్తున్నాం అనిపిస్తుంది. పాత్ర‌ల ప‌రిచ‌యం, దివ్య ఎంట‌ర్ అవ్వ‌డం, క్రికెట్ టోర్న‌మెంట్ కోసం ప్ర‌య‌త్నాలు ఇవ‌న్నీ ఆస‌క్తిగానే ఉంటాయి. అయితే క‌థ కేవ‌లం వీటి చుట్టూ న‌డిస్తే స‌రిపోద‌ని ద‌ర్శ‌కుడు భావించి ఉంటాడు. అందుకే దొంగ‌నోట్లు, దివ్య‌కు ఓ ఫ్లాష్ బ్యాక్ అంటూ.. బ‌ల‌వంతంగా కొన్ని ఎపిసోడ్లు సృష్టించుకొన్నాడ‌నిపిస్తుంది.  అందుకే ఆ క‌థ‌నీ  స‌మాంత‌రంగా న‌డిపే ప్ర‌య‌త్నం చేశాడు. పిట్ట‌గోడ‌లో స్నేహం, ప్రేమ‌, క్రైమ్ ఇలా ర‌క‌ర‌కాల ఎమోష‌న్లున్నాయి. ఈ మూడింటినీ మేళ‌వించి ఓ క‌థ చెప్ప‌డంలో ద‌ర్శ‌కుడు త‌డ‌బ‌డ్డాడు. ఏ ఎమోష‌న్‌కీ న్యాయం చేయ‌లేక‌పోయాడు. చిన్న‌ప్ప‌టి నుంచీ అంత ప్రాణంగా క‌ల‌సి మెల‌సి తిరిగిన స్నేహితులు, అంత తేలిగ్గా ఎలా విడిపోతారు.పోనీ.. విడిపోయారు అనుకొందాం. ఆ సీన్‌ని ఎంత బ‌లంగా తీయాలి?  ఎంత ఎమోష‌న్ పండించాలి?  ఇవేం ఈ క‌థ‌లో క‌నిపింవు. ఓ టోర్న‌మెంట్ పెట్టి, దాన్ని ర‌ద్దు చేయ‌డం అన్న‌ది ఊర్ల‌లో జ‌రిగే మామూలు వ్య‌వ‌హారాలు.

క్రికెట్ టోర్న‌మెంట్లూ, వాటి సంగ‌తులూ తెలిసిన‌వాళ్ల‌కు అదేదో పెద్ద క్రైమ్‌గా క‌నిపించ‌దు. దాన్ని పేప‌ర్ల‌లో పెద్ద పెద్ద హెడ్డింగులు పెట్టి వార్త‌లుగా రాయ‌డం, పోలీసు కేసులు అవ్వ‌డం.. ఇవ‌న్నీ సిల్లీగా అనిపిస్తాయి. ఇక ప్రేమ క‌థ విష‌యానికొద్దాం. హీరోని హీరోయిన్ ఎందుకు ప్రేమించాలి?  త‌న ఇంట్లో చెత్త ఊడ్చి, ఇంటికొచ్చిన వాళ్ల‌కు టీ, కాఫీలు స‌ప్ల‌య్ చేసినందుకా??   దినేష్‌కీ దివ్య‌కీ ఏదో జ‌రిగి ఉంటుంది.. క‌థ‌లో మ‌లుపు అదే అనుకొంటారంతా. కానీ.. దానికి సంబంధించిన ఎపిసోడ్ కూడా చాలా తేలిగ్గా చుట్టేశారు. క‌థ‌లో ఏ ఎమోష‌న్‌కీ ప్రేక్ష‌కుడు క‌నెక్ట్ అవ్వ‌డు. అన్నీ పైపైన అలా వ‌చ్చి.. ఇలా వెళ్లిపోతుంటాయంతే.  క‌థ‌ని ముగించిన పద్ధ‌తీ ఏం బాలేదు. హ‌డావుడి హ‌డావుడిగా చుట్టేసిన‌ట్టు అనిపించింది. పాత 500.. 1000 నోట్ల ర‌ద్దు గురించి మాట్లాడుకొంటున్న త‌రుణంలో.. అవే నోట్ల‌ను ముద్రించే ముఠాని హీరో ప‌ట్టుకోవ‌డం అనే కాన్సెప్ట్ క‌చ్చితంగా ఈ సినిమాకీ, క‌థ‌కీ ఓల్డేజ్ ముద్ర వేస్తుంది.

* న‌టీన‌టుల ప్ర‌తిభ‌

రావి శాస్త్రి మ‌న‌వ‌డు విశ్వ‌దేవ్ రాచ‌కొండ ఈ సినిమాతో క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యాడు. త‌న లుక్స్ బాగున్నాయి. స‌హ‌జంగా న‌టించాడు. సినిమా అంతా ఒకే ఎమోష‌న్ చుట్టూ న‌డుస్తుంది కాబ‌ట్టి.. త‌న‌లోని వేరియేష‌న్స్‌ని పూర్తి స్థాయిలో చూసే అవ‌కాశం రాలేదు. స‌పోర్టింగ్ రోల్స్ చేసే పున‌ర్న‌వి హీరోయిన్‌గా ఛాన్స్‌కొట్టేసింది. అయితే... ఇందులోనూ దాదాపుగా త‌న‌ది స‌పోర్టింగ్ రోలే అని చెప్పాలి. నాగరాజు, జ్ఞానేశ్వ‌ర్‌, బిల్డ‌ప్ రాజు.. ఈ పాత్ర‌ల్ని చూస్తుంటే.. హ్యాపీడేస్‌లోని పాత్ర‌లు ఉదాహ‌ర‌ణ‌లుగా తీసుకొని డిజైన్ చేసుకొన్నారేమో అనిపించ‌డం ఖాయం. న‌టీన‌టులంతా కొత్తవాళ్లే. క‌నీసం విల‌న్ పాత్ర‌లో అయినా నోటెడ్ ఫేస్‌ని తీసుకొంటే బాగుండేది.

* సాంకేతిక వ‌ర్గం

ప్రాణం క‌మ‌లాక‌ర్ చాలా కాలం త‌ర‌వాత ఈ చిత్రానికి సంగీతం అందించారు. ప్రాణంలో తన పాట‌లు బాగుంటాయి. ఈ సినిమా పాట‌ల్లోనూ అదే ఫ్లేవ‌ర్ క‌నిపించింది. ఆర్‌.ఆర్ కూడా బాగానే ఉంది. ఫొటోగ్ర‌ఫీ ఈ సినిమా స్థాయి, అవ‌స‌రాల‌కు త‌గ్గ‌ట్టే ఉంది. మాట‌ల్లో కొత్త‌ద‌నం క‌నిపించ‌లేదు. ఓ డైల‌గ్ తెలంగాణ యాస‌లో ఇంకోటి తూ.గో యాస‌లో వినిపించే స‌రికి డైలాగ్ రైట‌ర్ క‌న్‌ఫ్యూజ్ అయ్యాడేమో అనిపించింది.  కుర్రోళ్ల సినిమా క‌దా అని బూతుల జోలికి వెళ్ల‌క‌పోవ‌డం.. అభినందించ‌ద‌గిన విష‌యం. సినిమా మొద‌లైన అర‌గంట‌కే... వేగం త‌గ్గిపోయింది. క‌థ ముందుకు సాగ‌లేదు. ప‌తాక సన్నివేశాల తీత మ‌రీ ఘోరంగా ఉంది. అదంతా ద‌ర్శ‌కుడి అనుభ‌వ‌లేమి అనేది స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతోంది.

* చివ‌ర‌గా:  పిట్ట‌గోడ ఇంటి గోడంత స్ట్రాంగ్‌గా ఉండ‌దు క‌దా.. ఇదీ అంతే!

రేటింగ్‌: 2.25


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.