మౌత్ టాక్ తో 'ఒకే ఒక జీవితం' హిట్టయ్యేనా?
on Sep 10, 2022

పెద్దగా అంచనాల్లేకుండా నిన్న(సెప్టెంబర్ 9న) ప్రేక్షకుల ముందుకొచ్చిన 'ఒకే ఒక జీవితం' పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఓ వైపు 'బ్రహ్మాస్త్ర' విడుదల, మరోవైపు ప్రస్తుత శర్వానంద్ ప్లాప్ ల ట్రాక్ రికార్డు, తక్కువ ప్రమోషన్స్ వంటి కారణాలతో ఈ సినిమా మొదటి రోజు పెద్దగా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. మౌత్ టాక్ తో నేటి నుంచి పుంజుకొని ఫుల్ రన్ లో మంచి కలెక్షన్స్ రాబట్టే అవకాశముంది.
శర్వానంద్, రీతు వర్మ జంటగా శ్రీ కార్తీక్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ఒకే ఒక జీవితం'. అక్కినేని అమల, వెన్నెల కిషోర్, ప్రియదర్శి ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. శర్వా గత ఆరు చిత్రాలు పరాజయం పాలవ్వడంతో ఈ చిత్రంపై ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించలేదు. తన చిన్నతనంలో మరణించిన తల్లిని కలుసుకోవడానికి గతంలోకి టైం ట్రావెల్ చేసిన ఒక కొడుకు కథగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం.. చూసిన వారిని విశేషంగా ఆకట్టుకుంటోంది. దీంతో మౌత్ టాక్ ఈ సినిమా విజయ తీరాలకు చేరే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం వరల్డ్ వైడ్ గా రూ.7.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన 'ఒకే ఒక జీవితం' మొదటిరోజు 1.3 కోట్ల షేర్ రాబట్టినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో సుమారుగా 75 లక్షల షేర్ వసూలు చేసినట్టు సమాచారం. శర్వానంద్ గత చిత్రాలతో పోల్చితే ఈ మూవీ ఓపెనింగ్స్ తక్కువే అయినప్పటికీ.. పాజిటివ్ టాక్ రావడం కలిసొచ్చే అంశం. ఇటీవల విభిన్న చిత్రాలకు ఆదరణ లభిస్తోంది. 'సీతా రామం', 'కార్తికేయ-2' వంటి సినిమాలు మౌత్ టాక్ తో భారీ కలెక్షన్స్ రాబట్టి సత్తా చాటాయి. ఇప్పుడు 'ఒకే ఒక జీవితం' కూడా ఆ మ్యాజిక్ రిపీట్ చేసి, చాలాకాలంగా సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న శర్వానంద్ కి సాలిడ్ హిట్ ని అందిస్తుందేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



