ENGLISH | TELUGU  

ఒక లైలా కోసం మూవీ రివ్యూ

on Oct 17, 2014

 Oka Laila Kosam Movie Review, Oka Laila Kosam Review, OLK Movie Review, OLK Movie Review Rating, Oka Laila Kosam Public Talk

రాజ‌కీయాలంటే స్కాములు..
మాయ‌లంటే సాములు
రియ‌ల్ ఎస్టేటంటే భూములు
ఎలా కామ‌నో... ల‌వ్‌స్టోరీ అంటే ఫీల్ ఉండ‌డం కంప‌ల్స‌రీ. లేదంటే మ్యాజిక్‌లేని విఠ‌లాచార్య సినిమా చూసిన‌ట్టే.
ప్ర‌తీ ప్రేమ‌క‌థ‌లోనూ ఓ అబ్బాయి ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు.
ఇక్క‌డా అంతే.
అమ్మాయి కాదంటుంది..
ఈ క‌థ కూడా అదే!
ఆ అమ్మాయి ప్రేమ‌ని గెలుచుకోవ‌డానికి ఆ హీరో తాప‌త్ర‌య‌ప‌డుతుంటాడు.
సేమ్ టూ సేమ్ స్టోరీ
చివ‌రికి ఆ ప్రేమ ద‌క్క‌ద‌ని తెలిసి.. త‌న‌కి దూరం కావాల‌నుకొంటాడు.
యాజ్ టీజ్ దింపేశారు.
ఆఖ‌రికి హీరో రాసుకొన్న డైరీనో మ‌రోటో క‌నిపిస్తుంది.. నిజాలు తెలుస్తాయి. అమ్మాయి ప‌రుగెట్టుకొంటూ అబ్బాయి ఒడిలో వాలిపోతుంది..!
మ‌క్కీకి మ‌క్కీ...
ప‌ది, ఇర‌వై, వంద.... ఇలా అంకెలెందుకు గానీ, మీరెన్నోప్రేమ‌క‌థల్లో చూసిన సీన్లు, తెలిసిన క‌థ ఇవ‌న్నీ ఓ బండిల్‌కి చుట్టి, పాసింజ‌ర్ ట్రైన్‌కి క‌ట్టి వ‌దిలేస్తే... ప‌డుతూ లేస్తూ ఎప్ప‌టికో గ‌మ్యం చేరుతుంది. ఒక లైలా కోసం కూడా అంతే. స్లో అండ్ స్డడీ.. మూవీ. ఫీల్ లేని.. ఫీల్ గుడ్ సినిమా.  ఇంత‌కీ ఈ సినిమా స్టోరీ ఏంటంటే...??

కార్తీక్ (నాగ‌చైత‌న్య‌) కి ఫ్రీడ‌మ్ అంటే చాలా ఇష్టం.  చ‌దువు పూర్త‌వుతుంది.  క్యాంప‌స్ ఇంట‌ర్వ్యూలో సెల‌క్ట్ అయ్యాడు కూడా. కానీ చ‌దువుల వ‌ల్ల కోల్పోయిన ఫ్రీడ‌మ్ తిరిగి పొందాల‌నుకొంటాడు.  ఓ సంవత్స‌రం న‌న్ను వ‌దిలేయండి, జీవితం గురించి తెలుసుకొస్తా.. అంటాడు.  ఇంట్లోవాళ్లు కూడా (సుమ‌న్‌, సుధ‌) స‌రే అంటారు. దాంతో లైఫ్‌ని ఎంజాయ్ చేయ‌డం మొద‌లెడ‌తాడు.  ఈ ప్ర‌యాణంలో నందు (పూజా హెగ్డే) క‌నిపిస్తుంది. నందుకి నాన్న (షాయాజీ షిండే) అంటే చాలా ఇష్టం. ఇద్ద‌రి అభిప్రాయాలూ ఇంచుమించు ఒక‌టే. నందు మంచిత‌నం చూసి తొలి చూపులోనే  ప్రేమిస్తాడు కార్తి. అయితే ఆమె పేరేంటో, అడ్ర‌స్సేంటో తెలీదు. ఆ అమ్మాయిని ఊహించుకొంటూ ఓ పుస్త‌కం రాయ‌డం మొద‌లెడ‌తాడు. అదే ఒక లైలా కోసం. ఏదోలా నందుని ప‌ట్టుకొంటాడు. ఐ ల‌వ్ యూ చెబుతాడు.  అయితే  కార్తీక్‌పై నందుకు మంచి అభిప్రాయం ఉండ‌దు. అందుకే నందు కార్తీక్‌ని రిజ‌క్ట్ చేస్తుంటుంది.  ఇంట్లోనూ, ఇటు కార్తీక్ ఇంట్లోనూ పెళ్లి సంబంధాలు వెదుకుతుంటారు. అనుకోకుండా కార్తీక్‌, నందూల పెళ్లి కుదురుతుంది. ఇంట్లో వాళ్లే ఈ సంబంధం సెట్ చేస్తారు. కార్తీక్ అంటే ఇష్టం లేద‌ని చెబుదామ‌నుకొనేలోగా . నిశ్చితార్థం కూడా జ‌రిగిపోతుంది. నాన్న చూసిన సంబంధం కాబ‌ట్టి.. నందు మౌనంగా ఉండిపోతుంది. ఆ త‌ర‌వాత ఏమైంది??  నందు మ‌న‌సులో కార్తీక్ ఎలా చో టు సంపాదించుకొన్నాడు??  తెలుసుకోవాలంటే లైలా చూడాలి.

ఈ సినిమాలో ఉన్న గొప్ప‌ద‌నం ఏంటంటే... తొలి సీన్స్ చూసిన‌వాళ్ళ‌కు ఎవ్వ‌రికైనా కాస్త బుర్ర పెట్టి ఆలోచిస్తే క్లైమాక్స్ అర్థ‌మైపోతుంది. హీరో పావురాల్ని వ‌ద‌ల‌డం.. అవి హీరోయిన్ ద‌గ్గ‌ర‌కు చేరుకోవ‌డం, కార్తీక్‌ ఒక లైలా కోసం అనే పుస్త‌కం రాయ‌డం... ఇవ‌న్నీ క్లైమాక్స్ కోసం ద‌ర్శ‌కుడు ముందే ప‌డిన ప్రిప‌రేష‌న్‌. ఓహో... చివ‌రి సీన్ ఇద‌న్న‌మాట అని ప్రేక్ష‌కుడికి ముందే ఓ హింట్ ఇచ్చేశాడు. త‌రువాతి స్న‌నివేశాన్ని గెస్ చేసేంత ఫాస్ట్ ఆడియ‌న్స్ ఉన్న ఈ కాలంలో శుభం కార్డుకి హింట్ ఇచ్చేస్తే... ఇక ఆ క‌థ‌లో కిక్ ఏముంది...??  ఇంత ఫ్లాట్ నేరేష‌న్ ఈమ‌ధ్య కాలంలో ఏ సినిమాలోనూ క‌నిపించ‌లేదు. క‌థ‌లో మెలిక‌లు లేవు. ఓకే... అనుకొందాం. ఆ క‌థ‌ని న‌డిపించే విధానంలోనూ ద‌ర్శ‌కుడు కొత్త పంథాను అవలంభించ‌లేక‌పోయాడు. హీరో హీరోయిన్ల‌ను చివ‌రి వ‌ర‌కూ క‌ల‌పకూడ‌ద‌ని భీష్మించుకొని కూర్చుని, ఆ లైన్ చుట్టూ క‌థ‌ని, స‌న్నివేశాల్ని అల్లుకొన్నాడు.

ఓ ప్రేమ క‌థ‌లో ఉండాల్సింది ఫీల్‌. ఖుషీ ఎందుకు హిట్ట‌య్యింది..??  అదేం గొప్ప క‌థ కాదే!  హీరో, హీరోయిన్ల మ‌ధ్య ఈగో క్లాష్‌. ఇద్ద‌రూ క‌లుసుకొంటే బాగుణ్ణు క‌దా అని ప్రేక్ష‌కుడు కోరుకొంటాడు. వాళ్లు క‌లుసుకోరు. దాంతో ఫీల్ క్యారీ అయ్యింది. `నో` చెప్ప‌డానికి ఎవ‌రి ద‌గ్గ‌ర ఉండాల్సిన కార‌ణాలు వాళ్ల‌కున్నాయి. సో.. క‌థ‌లో బ్యాలెన్స్ కుదిరింది. అయితే అదంతా ఒక లైలా కోసంలో రివ‌ర్స్ అయ్యింది. కార్తీక్ ప్రేమించ‌డం, నందు రిజ‌క్ట్ చేయ‌డం.. సినిమా అంతా ఇదే గోల‌. వీళ్లిద్ద‌రూ క‌లుసుకొంటారా, లేదా?  అనే టెన్ష‌న్ ఎవ్వ‌రికీ ఉండ‌దు. క‌లుసుకొంటే బాగుణ్ణు అన్న కోరికా ఉండ‌దు. ఏదో సీన్లు న‌డుస్తుంటాయి. పాట‌లొస్తుంటాయి. కాసేపు ఆవులిస్తూ. ఇంకా సేపు దిక్కులు చూస్తూ. మ‌ధ్య మ‌ధ్య‌లో చైత‌న్య ఎక్స్‌ప్రెష‌న్స్‌కి ఉలిక్కి ప‌డి లేస్తూ.. పూజా జీరో సైజ్‌కి భ‌య‌ప‌డుతూ... రెండు గంట‌లు గ‌డిపేస్తాం.

గుండె జారి గ‌ల్లంత‌య్యిందేలో ఓ నావ‌ల్టీ ఉన్న పాయింట్‌ని కొత్త పంథాలో చెప్పాడు ద‌ర్శ‌కుడు. ఈ సినిమాలో ఆ పాయింట్‌, చెప్పిన విధానం రెండూ పాత‌వే. ఒక లైలా కోసం... తిరిగాను దేశం... 1983లో వ‌చ్చిన పాట‌. ఈ క‌థ కూడా ఇంచుమించుగా అప్ప‌టిదే అనిపిస్తుంది. గుండెజారిలో ఏమైతే ప్ల‌స్సులు అయ్యాయో.. ఈ సినిమాలో అవేం క‌నిపించ‌లేదు. ముఖ్యంగా వినోదం మిస్ అయ్యింది. ఆ అలీ ఎపిసోడ్ లేక‌పోతే... లైలాని భ‌రించ‌డం మ‌రింత క‌ష్ట‌మ‌య్యేది. ల‌వ్ స్టోరీని క్లీన్ సినిమాగా మ‌ల‌చ‌డానికి మ‌న ద‌ర్శ‌కుల‌కు అంత భ‌య‌మేంటో అర్థం కాదు. ఈ సినిమాలో ఫైట్స్ ఇరికించిన విధానం చూస్తే... క‌మ‌ర్షియ‌ల్ ఛ‌ట్రాల మ‌ధ్య ఎంత ఇరుక్కుపోయారో అర్థ‌మ‌వుతుంది. ఇందులో రెండు ఫైట్స్ ఉన్నాయి. అవి కావాల‌ని జోడించిన‌వే అని అర్థ‌మ‌వుతోంది. చివ‌ర్లో అలీ ఎపిసోడ్ (పోలీస్ స్టేష‌న్) కూడా కావాల‌ని అతికించిన‌దే. సెకండాఫ్‌లో ఎమోష‌న్స్ పై దృష్టి పెట్టాడు ద‌ర్శ‌కుడు. హీరో తెగ ఫీలైపోతుంటాడు గానీ, ఆ ఫీల్ ప్రేక్ష‌కుడికి రాదు. అలా ఆ ఎమోష‌న్ కూడా క్యారీ అవ్వ‌లేదు.

నాగ‌చైత‌న్య లోపాలు ఈ సినిమాలో మ‌రింత బ‌య‌ట‌ప‌డ్డాయి. ఏమిటా ఎక్స్ ప్రెష‌న్స్‌...??  న‌వ్వితే అంద‌రూ బాగుంటారంటుంటారు. కానీ నాగ‌చైతన్య‌కు మాత్రం ఈ మాట వ‌ర్తించదు. ఎమోష‌న్స్ సీన్స్‌లో క‌ష్ట‌ప‌డ్డాడు. కామెడీ చేస్తూ మ‌న‌ల్ని క‌ష్ట‌పెట్టాడు. డాన్స్‌ల‌లో ఇబ్బంది ప‌డ్డాడు. ఇక పూజా వాడిపోయిన యాపిల్‌లా ఉంది. న‌ట‌న ఓకే. కానీ... గొప్ప అంద‌గ‌త్తె కాదు. ఆ ప్లేసులో అప్స‌ర‌స‌లాంటి అమ్మాయుండాలి. ఆ అమ్మాయి కోసం ఏం చేసినా ఫ‌ర్లేదు అన్న ఫీలింగ్ ప్రేక్ష‌కుడికి క‌ల‌గాలి. కానీ పూజా ఆ ఎఫెక్ట్ తీసుకురాలేక‌పోయింది. పండుగాడుగా అలీ న‌వ్విస్తాడు. అత‌ని ఎపిసోడ్ ఒక్క‌టే కాస్త రిలీఫ్ ఇస్తుంది. కొండాకి గే కామెడీ అంటే ఇష్ట‌మ‌నుకొంటా. ఈసినిమాలోనూ అది ట‌చ్ చేశాడు. నిజానికి అది జోడించిన సీన్. ఆ సంగ‌తి క‌నిపెట్ట‌డం అంత క‌ష్ట‌మైన విద్యేం కాదు. ఇక మిగిలిన తారాగ‌ణానికి అంత స్కోప్ లేదు. రోహిణిలాంటి ఆర్టిస్టుకి రెండు మూడు డైలాగుల‌కంటే ఎక్కువ ఇవ్వ‌లేదంటేనే ప‌రిస్థితి అర్థం చేసుకోవ‌చ్చు.


ఇంత వీక్ క‌థ‌ని నాగార్జున ఎలా ఒప్పుకొన్నాడో మ‌రి. బహుశా.. గుండెజారి గ‌ల్లంత‌య్యిందే సినిమా చూసి ఈ ఛాన్స్ ఇచ్చేశాడేమో..??  క‌థ ఫ్లాట్‌గా, నేరేష‌న్ స్లోగా గ‌డిచిపోయిందంటే అది ద‌ర్శ‌కుడి వైఫ‌ల్య‌మే. మాట‌లు అక్క‌డ‌క్క‌డా మెరుస్తాయి. భూమ్మీద దేవ‌త‌లు తిరుగుతున్నార‌నడానికి ఆ అమ్మాయే ఓ నిద‌ర్శ‌నం.. అన్న డైలాగ్ బాగుంది. ఆండ్రూ కెమెరాప‌నిత‌నానికి వంక పెట్ట‌లేం. అనూప్ బాణీల్లో కొత్త‌ద‌నం లేదు. మ‌ళ్లీ మ‌ళ్లీ వినాల‌న్న పాట ఒక్క‌టీ లేదు. ఎడిటింగ్ షార్ప్ గా ఉండాల్సింది.

ల‌వ్ స్టోరీల‌కు ఏం కావాలో అదే ఈసినిమాలో మిస్ అయ్యింది. ఓ సాదా సీదా క‌థ‌కు, బ‌ల‌హీన‌మైన నేరేష‌న్ తోడైతే ఎలా ఉంటుందో చెప్ప‌డానికి ఈ సినిమానే ఓ ఉదాహ‌ర‌ణ‌. కాక‌పోతే బూతు లేకుండా క్లీన్‌గా ఓ క‌థ తీసుకొచ్చిన ద‌ర్శ‌కుడిని అభినందించాలి. ప్రేమ క‌థ‌ని ఎలాంటి `క‌ట్స్‌` లేకుండా చూపించ‌గ‌లిగాడు. ఆ ఒక్క విష‌యంలో ద‌ర్శ‌కుడిని మెచ్చుకొంటూ.. ద్వితీయ వీఘ్నం అనే సెంటిమెంట్ దాటలేనందుకు చింతిస్తూ ఈ సినిమా చూడొచ్చు.

రేటింగ్ 2.25/5

పంచ్ లైన్: ఒక లైలా కోసం....`ఫీల్‌` జారి గ‌ల్లంత‌య్యిందే

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.